
సాక్షి, విజయవాడ : ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేపట్టింది. ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ, శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు, ప్రధాన ఎన్నికల ఏజెంట్లకు శిక్షణా శిబిరం గురువారం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ శిక్షణా తరగతులకు ఆయా పార్లమెంటు జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు హాజరయ్యారు.
విజయవాడలోని బందర్ రోడ్డు, డీవీ మానర్ హోటల్ ఎదురుగా ఉన్న ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది. మాజీ సీఎస్ అజయ్ కల్లం, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్, పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఏజెంట్ల విధులపై, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమం కొనసాగనంది. శిక్షణకు హాజరవుతున్న వారు విధిగా సమయపాలన పాటించాల్సి ఉంటుందని పార్టీ ఇప్పటికే సూచనలు పంపింది. ఈ శిక్షణా తరగతులకు ఆహ్వానితులతో పాటుగా చీఫ్ ఎన్నికల ఏజెంట్లు అంతా విధిగా హాజరు కావాలని, ఎవరికీ మినహాయింపు లేదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ నేతలకు ఇప్పటికే ఓ సర‍్క‍్యులర్ పంపిన విషయం విదితమే.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి