ఈ ఐదేళ్లలో అది తప్ప ఇంకోటి చూడలేదు : వైఎస్‌జగన్‌ | Ys Jagan Mohan Reddy In Vijayawada Public Meeting | Sakshi
Sakshi News home page

ఈ ఐదేళ్లలో అది తప్ప ఇంకోటి చూడలేదు : వైఎస్‌జగన్‌

Published Fri, Apr 5 2019 7:54 PM | Last Updated on Fri, Apr 5 2019 8:52 PM

Ys Jagan Mohan Reddy In Vijayawada Public Meeting - Sakshi

సాక్షి, విజయవాడ : అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మనం చూసింది ఒక్కటేనని అదే మోసం.. మోసం.. మోసం అని అది తప్పా ఇంకోటి చూడలేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ జగన్‌ విజయవాడ సభలో ప్రసంగిస్తూ.. ఈ ఐదేళ్లలో అవినీతి, అబద్దాలు, మోసం అనేవే చూశామని అన్నారు. అమరావతి రాజధానిని తానే కడతానని చెప్పిన బాబు.. పర్మినెంట్‌ పేరుతో ఒక్క ఇటుక కూడా వేయలేదని దుయ్యబట్టారు. ఈ ఐదేళ్లలో కనీసం దుర్గగుడి ఫ్లైఓవర్‌ కూడా కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

మొత్తం 300 మద్యం షాపులు..
‘కృష్ణానది పక్కనే ఉన్నా కూడా.. తాగడానికి నీళ్లు లేవు. ఎవరైనా ఫోన్‌ చేస్తే.. మంచినీళ్లు వస్తాయో లేదో కానీ.. మందు మాత్రం వస్తుంది. ఇక్కడ వీదికొక బ్రాందీషాపు ఉంది. మొత్తం 59 డివిజన్లు ఉంటే.. ప్రతి డివిజన్‌కు 5 మద్యంషాపులున్నాయి. ఈయన మనకు మంచి చేస్తున్నాడా? మనల్ని చెడగొడుతున్నాడా? భవాని స్కూల్‌ పక్కనే మద్యం షాపు ఉందని అక్కడి ప్రజలు ఆందోళన చేస్తే.. వారినే జైల్లో పెట్టారు.

మోసం..మోసం..మోసం..
కొండ మీదున్న నివసిస్తున్న వారి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్‌ చేస్తాను బాబు హామీ ఇచ్చారు. కొండ మీద దాదాపు రెండు లక్షల మందికి పైగా ఉన్నారు. ఎంతమందికి రెగ్యులరైజ్‌ చేశారు. భవానీపురం స్టేడియాన్ని కూడా కట్టలేదు. దేశంలో అత్యంత ధనిక సీఎం ఎవరు అంటే.. అన్ని రిపోర్ట్‌లు చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. అవే రిపోర్ట్‌లు దేశంలో అత్యంత పేద, రుణ భారమున్న రైతులు ఎవరూ అంటే మన రైతులనే చూపిస్తున్నాయి. ఓ వైపు ధనిక సీఎం.. మరోవైపు.. రుణాలతో పాటు వడ్డీ తడిపిమోపడవుతున్న.. పొదుపు సంఘాల మహిళలు ఉన్నారు. ఈ ఐదేళ్ల పాలన మోసం, అవినీతి, అబద్దం, కుట్రలు తప్పా ఇంకేమీ కనిపించడం లేదు.

జాబు రావాలి అంటే బాబు పోవాలి
ఈ రోజు ఏ గ్రామానికి వెళ్లినా.. పట్టణానికి వెళ్లినా.. నిరుద్యోగులు రెట్టింపు అయ్యారు. ఎన్నికల ముందు జాబురావాలంటే..బాబు రావాలి అన్నారు.కానీ ప్రస్తుతం జాబు రావాలి అంటే బాబు పోవాలి అని అంటున్నారు. జాబు రాకపోతే.. నిరుద్యోగభృతి ఇస్తానన్న బాబు అది కూడా చేయలేకపోయాడు. బాబు పాలనలో ఒక్క ఇంటికి మాత్రమే ఉద్యోగం వచ్చింది.. అది తన కొడుకు లోకేష్‌కు మాత్రమే. ఎమ్మెల్సీని చేసి అటుపై మంత్రి పదవిని కట్టబెట్టారు.

ఉన్న జాబులు గోవిందా..
జాబు రావాలి అంటే.. బాబు రావాలి అన్న చంద్రబాబు.. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు పోయాయి. ముప్పై వేల ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా.. గృహనిర్మాణ శాఖలో 3500 ఉద్యోగాలు గోవిందా.. వెయ్యి మంది గోపాలమిత్ర ఉద్యోగాలు గోవిందా.. ఆయుష్‌లో వెయ్యి మంది ఉద్యోగాలు గోవిందా.. సాక్షర భారత్‌లో 30వేల మంది ఉద్యోగాలు గోవిందా.. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా 85 వేల అక్కచెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా..

గవర్నమెంట్‌ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకే... 
గ్రామ సెక్రటేరియట్‌ పేరిట ప్రతి గ్రామంలో చదువుకున్న 10 మందికి అక్కడే ఉద్యోగం ఇస్తాం. ప్రభుత్వ పథకాలకు, నవ రత్నాలకు సంబంధించి ఏ పని అయినా 72 గంటల్లో పూర్తి చేసేలా గ్రామ సచివాలయం పనిచేస్తుంది. గ్రామ సెక్రటేరియట్‌కు అనుబంధంగా ప్రతి 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్‌గా ఉద్యోగం ఇస్తాం. వారికి గౌరవ వేతనం కింద 5000వేల రూపాయలు అందజేస్తాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యతలను వారే చూస్తారు. రేషన్‌, పింఛన్‌ ఇలా ప్రతి ఇంటికి డోర్‌ డెలివరీ చేస్తారు. పరిశ్రమల్లో స్థానికంగా ఉన్నవారికి ఉద్యోగాలు రావడం లేదు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెస్తాం. అంతేకాకుండా వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. గవర్నమెంట్‌ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకే ఇస్తాం. నిరుద్యోగ యువతకు వ్యాపార నిమిత్తం పెట్టుబడి కింద రుణం, సబ్సిడీ అందజేస్తాం. ఈ కాంట్రాక్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తాం.దేశంలో రేపు ఏ ఒక్కరు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఉంది. మనం 25 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలను గెలిపించుకుందాం. ప్రత్యేక హోదా ఇచ్చే వారికే కేంద్రంలో మద్దతిస్తాం. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు, హోటళ్లు నెలకొల్పడానికి అందరు ముందుకొస్తారు.

ఎన్నికలు దగ్గర పడుతుండటంలో బాబు మరిన్ని కుట్రలు చేస్తారు. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు పంపిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. వారం రోజులు ఓపిక పట్టండి మన అన్న అధికారంలోకి వస్తాడు. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి’ అని ప్రసంగించారు. విజయవాడ నుంచి బరిలోకి దిగిన మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, బొప్పన భవ కుమార్‌..ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement