
సాక్షి, విజయవాడ: అధికారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంత నీచానికైనా దిగజారుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో అమలుకు వీలుకాని హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అబద్ధపు వాగ్ధానాలతో మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం కేవలం అబద్ధాలు చెప్పడానికే ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు నాయుడు వాడుతున్న బాష అభ్యతరకరంగా ఉందన్నారు. గతంలో జగన్‌కు ఓటువేస్తే.. కాంగ్రెస్‌కు వేసినట్టే అని ప్రచారం చేశారని, ఇప్పుడేమో కేసీఆర్‌కి వేసినట్టే అని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హరికిృష్ణా శవం పక్కన పెట్టుకుని టీఆర్‌ఎస్‌తో పొత్తుకు వెంపర్లాడింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. తన రాజకీయ స్వార్థ ప్రయోజనం కోసం తెలంగాణలో ఆంధ్ర వాళ్లపై దాడులు జరుగుతున్నాయని ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అండతోనే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. వైఎస్సార్ బతికి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment