సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం) నుంచి కుడి కాలువను అనుసంధానం చేసే కనెక్టివిటీస్ పనులకు బ్రేకులు పడ్డాయి. పనుల పరిమాణం పెరిగినందున రూ.113కోట్ల అదనపు చెల్లింపులు చేయాలంటూ మూడు ప్యాకేజీలకు సంబంధించిన కాంట్రాక్టర్లు చేస్తున్న డిమాండ్లకు ఉన్నతాధికారులు తలొగ్గకపోవడంతో వారు పనులు నిలిపివేశారు. దీంతో స్వయాన సీఎం జోక్యం చేసుకుని వారికి దన్నుగా నిలిచినట్లు.. వారం రోజుల్లో కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉత్తర్వులు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ కుడి వైపు అనుసంధానం పనుల్లో 62వ ప్యాకేజీ (హెడ్ రెగ్యులేటర్, ఆఫ్ టేక్ రెగ్యులేటర్.. ఈ, ఎఫ్ సాడిల్ డ్యామ్‌లు, వాటికి డిప్లీషన్ స్లూయిజ్‌ల నిర్మాణం) పనులను రూ.91.16 కోట్లకు హిందూస్థాన్–రత్నా (జేవీ) సంస్థ దక్కించుకుని ఇప్పటివరకూ రూ.60.86 కోట్ల విలువైన పనులు పూర్తిచేసింది. 63వ ప్యాకేజీ (736 మీటర్ల పొడవుతో జంట సొరంగాల తవ్వకం, మట్టికట్ట–1, మట్టికట్ట–2, మట్టికట్ట–1కు డిప్లీషన్ స్లూయిజ్ నిర్మాణం) పనులను ఎస్‌ఎంఎస్సైఎల్–యూఏఎన్‌మ్యాక్స్ (జేవీ) సంస్థ రూ.72.81 కోట్లకు దక్కించుకుని.. రూ.39.70 కోట్ల విలువైన పనులు పూర్తిచేసింది. 64వ ప్యాకేజీ (జంట సొరంగాలకు నీటిని సరఫరా చేసే ఛానల్.. సొరంగాల నుంచి కాలువలకు నీటిని తీసుకెళ్లే ఛానల్ తవ్వకం) పనులను యూఏఎన్ మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ రూ.73.90 కోట్లకు దక్కించుకుని.. ఇప్పటివరకూ రూ.51.77 కోట్ల విలువైన పనులు పూర్తిచేసింది.
పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు
ఇదిలా ఉంటే.. అదనపు బిల్లులు ఇచ్చేవరకూ పనులు చేయబోమని ఆయా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. దీంతో గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయాలంటే కాంట్రాక్టర్ల డిమాండ్లు పరిష్కరించాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ వెంటనే అదనపు బిల్లుల కోసం మూడు ప్యాకేజీల కాంట్రాక్టర్లు జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. వాటిని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌సీ)కి జలవనరుల శాఖ సిఫార్సు చేసింది. పనుల పరిమాణంలో ఏమాత్రం పెరుగుదలలేదని.. కాంట్రాక్టర్ల ప్రతిపాదనలు సహేతుకంగా లేవని ప్రాథమికంగా ఎస్‌ఎల్‌ఎస్‌సీ నిర్ధారించింది. ఈ విషయాన్ని కాంట్రాక్టర్లు సీఎం చంద్రబాబుకు తెలియజేయడంతో ఆయన జోక్యం చేసుకున్నారు. కాంట్రాక్టర్ల డిమాండ్ పరిష్కరించి.. పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఎస్‌ఎల్‌ఎస్‌సీకి దిశానిర్దేశం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఎస్‌ఎల్‌ఎస్‌సీ ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తే.. చీఫ్ ఇంజనీర్స్ కమిటీతో వాటిపై ఆమోదముద్ర వేయించి.. కేబినెట్‌లో తీర్మానించడం ద్వారా కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న అధికారులు.. కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు చెల్లించేలా వారం రోజుల్లో ఉత్తర్వులు రావడం ఖాయమని చెబుతున్నారు.
అదనపు బిల్లులు చెల్లిస్తేనే..
ఈ నేపథ్యంలో.. కుడి వైపు అనుసంధానాల పనుల్లో 62వ ప్యాకేజీలో 88,150 క్యూబిక్ మీటర్ల మట్టి, 2,36,430 క్యూబిక్ మీటర్ల ఎంబాక్‌మెంట్ (గట్లు), 10,984 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 477 చదరపు మీటర్ల గేట్ల పనులు ఇంకా చేయాల్సి ఉంది. 63వ ప్యాకేజీ పనులు పూర్తికావాలంటే ఇంకా 2,18,500 మట్టి, 65,500 క్యూబిక్‌మీటర్ల కాంక్రీట్, 2,61,170 క్యూబిక్ మీటర్ల ఎంబాక్‌మెంట్ పనులు చేయాలి. ఇక 64వ ప్యాకేజీ పనులు పూర్తి కావాలంటే 25,213 క్యూబిక్ మీటర్ల మట్టి, 61,352 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలి. ఈ పనులు పూర్తిచేయడానికి కాంట్రాక్టర్లు కొత్త మెలిక పెడుతున్నారు.ఇప్పటివరకూ చేసిన పనులకు రూ.44 కోట్ల అదనపు బిల్లులు ఇవ్వాలని 62వ ప్యాకేజీ కాంట్రాక్టర్, రూ.48 కోట్ల అదనపు బిల్లుల కోసం 63వ ప్యాకేజీ కాంట్రాక్టర్.. రూ.21 కోట్ల అదనపు నిధులు ఇవ్వాల్సిందేనని 64వ ప్యాకేజీ కాంట్రాక్టర్.. గత నెల 26న నిర్వహించిన వర్చువల్ రివ్యూలో సీఎం చంద్రబాబుకు వివరించారు. పనుల పరిమాణం భారీగా పెరిగిందని.. మొత్తం రూ.113కోట్లు అదనపు బిల్లులు ఇస్తేనే మిగిలిన పనులు చేస్తామని వారు స్పష్టంచేశారు. కానీ, పనుల్లో పరిమాణం ఏమాత్రం పెరగలేదని.. అదనపు బిల్లులు ఇవ్వాల్సిన అవసరంలేదని సమీక్షలో పాల్గొన్న జలవనరుల అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. కానీ.. అధికారుల వాదనను తోసిపుచ్చిన ముఖ్యమంత్రి కాంట్రాక్టర్లకే వంతపాడారని అధికార వర్గాలు చెబుతున్నాయి. గిట్టుబాటు కాకపోతే కొట్టినా కాంట్రాక్టర్లు పనులుచేయరని ఆయనన్నట్లు ఓ కీలక అధికారి చెప్పారు. ముందే కుదిరిన ఒప్పందం మేరకే కాంట్రాక్టర్లకు సీఎం చంద్రబాబు దన్నుగా నిలుస్తునట్లు అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment