రైతులను దొంగలతో పోలుస్తారా?
- సీఆర్‌డీఏ బిల్లుపై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: పైసా పెట్టుబడి కూడా లేని ల్యాండ్ డెవలపర్స్‌కు ఇచ్చిన హక్కులు, భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వకపోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ల్యాండ్ పూలింగ్‌పై కోర్టుకెళ్ళే రైతుల ఆలోచనల గురించి ప్రభుత్వం చెప్పే మాటలు రైతులను అవమానించేలా ఉన్నాయని తప్పుపట్టారు. ఎర్ర చందనం దొంగలూ కోర్టుకు వెళుతున్నారనడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు.
శాసనసభలో సోమవారం సీఆర్‌డీఏపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 60 శాతం ప్రజల ఆమోదం ఉంటేనే భూసేకరణ చేపట్టాలన్న నిబంధనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయ భూములను సేకరించకూడదని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొందని, ప్రభుత్వం మాత్రం పూలింగ్ పేరుతో 50 వేలు, లక్ష ఎకరాలను రాజధాని కోసం సేకరిస్తోందని విమర్శించారు.
ఉన్న వ్యవసాయ భూములను ఇలా సేకరిస్తే ఆహారభద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. పేద రైతులు భూమలు ఇవ్వబోమని చెబుతుంటే, ఏ చట్టాన్నైనా తీసుకొచ్చి లాక్కుంటామని ఓ మంత్రి, మీరు కాదంటే దొనకొండలోనో మరో చోటనో రాజధాని పెడతామని మరో మంత్రి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ఏర్పాటు విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే ఇన్ని వేల ఎకరాల భూములు ఎందుకు సేకరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఆర్‌డీఏ బిల్లులో రైతులు, రైతుకూలీలకు ఏమాత్రం భద్రత లేదన్నారు.
ఎక్కడైనా భూమి ఇచ్చిన వారికి 70 శాతం, డెవలపర్‌కు 30 శాతం ఇవ్వడం సహజమని, కానీ రాజధాని విషయంలో ఇందుకు భిన్నంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డెవలపర్ ఎంపిక విషయంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఎలాంటి పెట్టుబడి లేని డెవలపర్ చిరవకు భూ యజమానిగా బిల్లులో పేర్కొనడం దారుణమన్నారు.
ఉపగ్రహాల తయారీలోనే ప్రపంచంలోనే భారత్ తన ప్రతిభను చాటుతుంటే, నిపుణులైన యువత మన దగ్గరుంటే, సింగపూర్‌ను ఆశ్రయించాల్సిన అవసరం ఏమిటన్నారు. చంద్రబాబుకు గొప్ప విజన్ ఉందని, అందుకే 30 ఏళ్ళ క్రితమే కృష్ణా జిల్లా వ్యక్తినే పెళ్లి చేసుకున్నారని రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ఇదే విజన్‌ను రాజధాని నిర్మాణం విషయంలో అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.