నట్టేట ముంచిన బ్రిడ్జి | Polytechnic student admissions not available to ITI | Sakshi
Sakshi News home page

నట్టేట ముంచిన బ్రిడ్జి

Published Thu, Aug 6 2015 2:54 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

నట్టేట ముంచిన బ్రిడ్జి

నట్టేట ముంచిన బ్రిడ్జి

సాంకేతిక విద్యాబోర్డు విభజన...అధికారుల నిర్లక్ష్యం.. సమన్వయలోపం.. పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి జరగని అర్హత పరీక్ష.. అందని ఉన్నత సాంకేత విద్య.. వెరసి బ్రిడ్జి కోర్సు చేసిన ఐటీఐ విద్యార్థులు నట్టేట మునిగారు. ఫలితంగా ఐటీఐ బ్రిడ్జి కోర్సు చేసిన విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు.
 
- ఐటీఐ విద్యార్థులకు అందని పాలిటెక్నిక్ ప్రవేశాలు
- రోడ్డున పడిన పలువురు విద్యార్థులు
తిరుచానూరు:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సాంకేతిక విద్యాబోర్డు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఐటీఐ బ్రిడ్జి కోర్సు చేసిన విద్యార్థులకు ఇక్కట్లు తప్పలేదు. ద్వితీయ సంవత్సర పాలిటెక్నిక్ కోర్సుల్లో పది శాతం మంది ఐటీఐ విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతి ఏడాది బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తోంది.

బ్రిడ్జి కోర్సులో అర్హత సాధించిన వారికి సాంకేతిక విద్యాబోర్డు మళ్లీ అర్హత పరీక్ష నిర్వహించి పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. ఈ ఏడాది మే 16 నుంచి జూన్ 16వ తేదీ వరకు తిరుపతిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో బ్రిడ్జి కోర్సు నిర్వహించారు. ఈ కోర్సుకు జిల్లా నలుమూలల నుంచి ఐటీఐ పూర్తయిన 66 మంది విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్‌లో ద్వితీయ సంవత్సరం ప్రవేశం పొందాలని తమ ఉద్యోగాలను వదులుకుని బ్రిడ్జి కోర్సుల్లో చేరారు. జూన్ నెల 28, 29వ తేదీల్లో పరీక్షలు కూడా రాశారు. నేడో రేపో సాంకేతిక విద్యాబోర్డు అర్హత పరీక్ష  నిర్వహిస్తుందని విద్యార్థులు తలిచారు.

సుమారు రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అర్హత పరీక్ష నిర్వహించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సాంకేతిక విద్యా బోర్డు సైతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా రెండుగా విడిపోయింది. రెండు రాష్ట్రాల సాంకేతిక విద్యా బోర్డు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో బ్రిడ్జి కోర్సులో అర్హత సాధించిన విద్యార్థులకు ద్వితీయ సంవత్సర పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి అర్హత పరీక్ష నిర్వహించలేదు. దీంతో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఆశతో ఎదురుచూస్తున్న ఐటీఐ విద్యార్థులకు నిరాశే  మిగులుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హత పరీక్ష నిర్వహించాలని బ్రిడ్జి కోర్సు విద్యార్థులు కోరుతున్నారు.
 
ఉన్న ఉద్యోగం వదులుకున్నా
2013లో ఐటీఐ పూర్తి చేశాను. ఆర్థికంగా తమ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నందున చిన్నపాటి ఉద్యోగం చేస్తూ అండగా నిలుస్తున్నా. బ్రిడ్జి కోర్సు ద్వారా పాలిటెక్నిక్ పూర్తి చేసి మెరుగుపడాలని తలచి ఉన్న ఉద్యోగం వదులుకున్నా. అధికారులు స్పందించి పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సర ప్రవేశానికి అర్హత పరీక్ష నిర్వహించాలి.
- టీ కుమార్, శ్రీకాళహస్తి

రోడ్డున పడ్డాను
తంబళ్లపల్లె ఐటీఐ కళాశాలలో 2013లో ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌ను పూర్తి చేశా. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నా. బ్రిడ్జి కోర్సు ద్వారా పాలిటెక్నిక్‌లో చేరి జీవితంలో స్థిరపడాలని నిశ్చయించుకున్నా. తీరా పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి అర్హత పరీక్ష నిర్వహించకపోవడంతో రోడ్డున పడ్డాను.
- నాగేంద్రనాయక్, మదనపల్లి

నిర్లక్ష్యం తగదు

గత ఏడాది ఐటీఐ పూర్తి చేశాను. బ్రిడ్జి కోర్సులో చేరి అర్హత సాధించాను. ఇప్పుడు పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సర ప్రవేశానికి సాంకేతిక విద్యాబోర్డు పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో తనలాంటి నిరుపేద విద్యార్థులు నష్టపోతున్నాం. అధికారులకు ఇంత నిర్లక్ష్యం తగదు.
- టీ సదాశివయ్య, నగరి

మా లోపం లేదు
సాంకేతిక విద్యా బోర్డు ఆదేశాల మేరకు బ్రిడ్జి కోర్సు నిర్వహించి, పరీక్షలు జరిపాం. ఇందులో అర్హత సాధించిన విద్యార్థుల మార్కుల జాబితాను ఉన్నతాధికారులకు చేరవేశాం. పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి సాంకేతిక విద్యా బోర్డే పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇందుతో తమ లోపమేదీ లేదు.
 - పీ.గణేష్, ప్రిన్సిపాల్, ప్రభుత్వం ఐటీఐ కళాశాల, తిరుపతి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement