అనుమానాస్పదంగా పాలిటెక్నిక్ విద్యార్థి మృతి
Published Mon, Jan 27 2014 3:29 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
మద్దిరాల (చిలకలూరిపేట రూరల్), న్యూస్‌లైన్: వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతు న్న విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రూరల్ పోలీసుల కథనం మేరకు.. మద్దిరాల గ్రామంలోని ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని బావిలో విద్యార్థి ఇందుర్తి అఖిల్(17) మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం గుర్తించారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లికి చెందిన అఖిల్ మరో నలుగురు విద్యార్థులతో కలిసి కళాశాలలోని వసతిగృహంలో ఉంటున్నాడు. ఈనెల 24న సహ విద్యార్థి తన సెల్‌ఫోన్ కనిపించడం లేదని అఖిల్‌ను అడగ్గా.. తెలియదని చెప్పడంతో గట్టిగా నిలదీశాడు. ఆ రోజు నుంచి అఖిల్ కనిపించకపోవడంతో కళాశాల యాజమాన్యం అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
వారు బంధుమిత్రుల నివాసాల వద్ద విచారించినా ప్రయోజనం లేకుండాపోయింది. ఆదివారం కళాశాల ఆవరణలోని బావి నుంచి దుర్వాసన వెదజల్లుతుండడంతో యాజమాన్యం గమనించగా.. బావిలో శవం తేలుతోంది. ఆ మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడు కళాశాల విద్యార్థి అఖిల్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న అఖిల్ కుటుంబ సభ్యులు, బంధువులు కళాశాలకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. యాజమాన్యం సకాలంలో స్పందించకపోవడంతో దారుణం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. తండ్రి లేని బిడ్డకు ఉన్నత విద్య అందించి అత్యున్నత శిఖరాలకు చేరుద్దామనుకున్న తరుణంలో విధి వక్రీకరించిందని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. సంఘటనా స్థలాన్ని రూరల్ సీఐ టి.సంజీవ్‌కుమార్ పరిశీలించారు. విద్యార్థి మృతిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఇచ్చిన పక్షంలో కేసు నమోదుచేసి విచారణ నిర్వహిస్తామని ఎస్‌ఐ జగదీష్ తెలిపారు. విద్యార్థి మృతదేహాన్ని కళాశాల ఆవరణలోనే ఉంచారు.
సృహ తప్పి పడిపోయిన ప్రిన్సిపాల్ ..
కళాశాల ఆవరణలోని బావిలో విద్యార్థి మృతదేహం ఉందన్న సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కేశవరావు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసిన వెంటనే సృహ తప్పి కిందపడిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది ప్రిన్సిపాల్‌ను ప్రవేటు వైద్యశాలకు తరలించారు.
Advertisement