‘నీరు-చెట్టు’ ఆ చెరువుకు వర్తించదా?
ఆక్రమణకు గురైన దుంపలగట్టు చెరువు
అక్రమార్కులు టీడీపీ వర్గీయులు కావడంతో చేష్టలుడిగిన యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, కడప : చెట్లు పెంచుదాం.. చెరువుల్ని సంరక్షిద్దాం.. పరిగెత్తే నీటికి నడక నేర్పించి నిలువరిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ‘నీరు-చెట్టు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. చెరువుల్లో పూడికతీత పనులు వేగవంతం చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అయితే జిల్లాలో తద్భిన్నంగా చర్యలున్నాయి. టీడీపీ నేతలు చెరువులను సైతం ఆక్రమిస్తే అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిందిపోయి వారికి అండగా నిలుస్తోంది.
పూడిక తీస్తే మట్టిని తరలించుకుంటామని రైతులు ముందుకు వస్తున్నా పట్టించుకునే స్థితిలో యంత్రాంగం లేదు. వివరాల్లోకి వెళితే.. చెన్నూరు సమీపంలోని దుంపలగట్టు చెరువు భూమి సుమారు రెండు వందల ఎకరాలు ఆక్రమణకు గురైంది. కొందరు టీడీపీ నేతలు చెరువులో దశాబ్ధాలుగా ఉన్న చెట్లను తెగ నరికి పంట భూమిగా చదును చేశారు. చెరువులోనే బోర్లు వేసి పంటలు సాగు చేస్తున్నారు. అక్రమార్కులని తెలిసినా ట్రాన్స్ కో యంత్రాంగం విద్యుత్ కనెక్షన్లు సమకూరుస్తోంది. దాదాపు 200 ఎకరాల్లో వాణిజ్య పంటలు సాగు చేసి అధికార పార్టీ వర్గీయులు ఫలసాయం పొందుతున్నారు.
ఎమ్మెల్యే ప్రశ్నించినా చర్యలు నిల్
దుంపలగట్టు చెరువు ఆక్రమణపై మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జెడ్పీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశాలల్లో అధికారులను నిలదీశారు. ఎన్నిమార్లు మీ దృష్టికి తీసుకవచ్చినా ఫలితం లేదని అధికారులపై ఆగ్రహం ప్రదర్శించారు. ఓ దశలో జడ్పీ సమావేశంలో బైఠాయించారు. కలెక్టర్ కెవి రమణ, జాయింట్ కలెక్టర్ రామారావు చర్యలు తీసుకుంటామని చెప్పి మిన్నకుండిపోయారు. ఆక్రమణదారులు అధికార పార్టీ అనుచరులు కావడంతోనే అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారని స్పష్టమవుతోంది. దీంతో మరింతగా చెరువు భూమిని ఆక్రమించేందుకు అక్రమార్కులు సన్నద్ధమవుతున్నారు.
నీరు-చెట్టు ఆ చెరువుకు వర్తించదా?
ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం దుంపలగట్టు చెరువుకు వర్తించదా.. అని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. చెరువు మట్టిని భూములకు తరలించేందుకు సుముఖంగా ఉన్నామని చెబుతున్నా అధికారులు పనులు ప్రారంభించలేదని వాపోతున్నారు. ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నామని, అన్ని చెరువుల్లో పనులు ప్రారంభించాలని సాక్షాత్తు సీఎం చెప్పినా ఆ దిశగా చర్యలైతే లేవు.
చెరువు కబ్జా
Published Sun, May 10 2015 3:40 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM
Advertisement