రుణం పై రణం
సాక్షి, కడప : ఎన్నికల సమరం ముగిసింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపర్చే విషయంలో అధికార పార్టీ మాట మారుస్తోంది. ప్రజలను వంచిస్తున్న పాలకపక్ష తీరును ఎండగడుతూ బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం నుంచి ఆందోళనకు సిద్ధమవుతోంది.
అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం రైతు రుణ మాఫీలకు సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేస్తానన్న చంద్రబాబు ఆ తర్వాత కోటయ్య కమిటీని నియమించి తీరా ఇప్పుడేమో అంతా కాదు కొంత మొత్తమే మాఫీ చేస్తామని ప్రకటించడంతో అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి సమరానికి శ్రీకారం చుడుతోంది.
నేటి నుంచి మూడు రోజులు.. :
రైతులు డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలన్నింటినీ రద్దుచేయాలని కోరుతూ గురువారం నుంచి మూడురోజులపాటు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో ఆందోళనలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో వరుసగా గురు, శుక్ర, శనివారాల్లో ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టనున్నారు.
చంద్రబాబువి తప్పుడు నిర్ణయాలు :
చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోలో రుణమాఫీ చేస్తానన్నారు. తల తాకట్టు పెట్టయినా రైతుల రుణాలు మాఫీ చేస్తానన్న బాబు ప్రజలతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు మాట తప్పుతున్నారు. అప్పుడు రుణమాఫీ అన్న బాబు నేడు కేవలం కుటుంబానికి రూ.1.50లక్షలే అని ప్రకటించడం హాస్యాస్పదం. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు మూడు రోజుల పాటు అన్ని మండలాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయాలి. ప్రతి కార్యకర్త, నాయకులు, రైతు సోదరులు, ఇతర పార్టీ నాయకులు కూడా పార్టీలకతీతంగా పాల్గొని ఆందోళనలను విజయవంతం చేయాలి.
- కె.సురేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు