భక్తుల నిలువుదోపిడీ | poojari's taking more money in rahu ketu pooja | Sakshi
Sakshi News home page

భక్తుల నిలువుదోపిడీ

Published Wed, Feb 12 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

భక్తుల నిలువుదోపిడీ

భక్తుల నిలువుదోపిడీ

 రాహు-కేతు పూజల్లో
 బలవంతపు వసూళ్లు
 పనిచేయని సీసీ కెమెరాలు
 అధికారులకూ వాటాలు!
 శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్:
 శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ముఖ్యంగా అర్చకులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వాటా అందుతున్న కారణంగానే ఆలయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయం రాహు-కేతు పూజలకు పేరుగాంచింది. ఇతర రాష్ట్రాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో భక్తులు అనేక మోసాలకు గురవుతున్నారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పూజారులు అందినకాడికి దోచుకుంటున్నారు.
 
 అడుగడుగునా దోపిడీ
 పట్టణంలోని దేవస్థానం సమాచారకేంద్రం నుంచి ఆలయం వరకు, సన్నిధివీధిలో నేతి దీపాలు, కొబ్బరికాయలు, గరిక, జిల్లేడు మాలలు విక్రయించే దుకాణాలు అనేకం ఉన్నాయి. వీటిని ఆలయంలోకి అనుమతించరు. రాహు-కేతు పూజలు చేయించుకునే భక్తులు వీటిని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దేవస్థానం వారే పూజా సామగ్రిని అందజేస్తారు. అయినా రాహు-కేతు టికెట్లు తీసుకున్న భక్తులకు దుకాణదారులు వీటిని బలవంతంగా అంటగడుతున్నారు.
 
 బలవంతంగా దక్షిణ
 రూ.300, రూ.750, రూ.1500, రూ.2,500 టికెట్లపై రాహు-కేతు పూజలు జరుగుతున్నాయి. పూజలు చేయించుకున్న భక్తులు చివర్లో తప్పనిసరిగా దక్షిణ(డబ్బు) సమర్పించుకోవాల్సి ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత దోషం పోవాలంటే బ్రాహ్మణులకు గోదానం, భూదానం, సువర్ణదానం చేయాల్సిఉంటుందని పూజారులు బాహాటంగానే చెబుతుం టారు.  వాటిని ఇవ్వడం వీలుకాదు కాబట్టి దక్షిణ ఇవ్వాలని వారే సలహా ఇస్తుంటారు. ఏమవుతుందో ఏమోనని భక్తులు తోచినంత ఇచ్చి వెళుతున్నారు.
 
 పూజకో రేటు
 రాహు-కేతు పూజా టికెట్లు మూడు రకాలుగా ఉన్నా యి. మూడు ప్రాంతాల్లో పూజలు జరుగుతున్నాయి. ఒక్కో పూజ చేసుకునే భక్తులు ఒక్కో రకమైన దక్షిణ సమర్పించుకోవాలి. రూ.300 పూజ చేసుకునే భక్తులు రూ.50, రూ.750 పూజ వారు రూ.100, రూ.1500 పూజ చేసుకునే భక్తులు రూ.200 నుంచి 300 వరకు దక్షిణ  ఇవ్వాలి.
 
 పనిచేయని సీసీ కెమెరాలు
 మృత్యుంజయ మండపంలోని సీసీ కెమెరాలు మాత్రమే పనిచేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కువగా రూ.300, రూ.1500 టికెట్లు కొని రాహుకేతు పూజలు చేయించుకుంటుంటారు. వీటిని ఆలయంలోని మృత్యుంజయ మండపంలో చేస్తారు. ఇక్కడే ప్రధానంగా ఆలయ కిందిస్థాయి సిబ్బంది, దళారులు, అర్చకులు భక్తుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. భక్తుల నుంచి అధికమొత్తంలో దక్షిణ రూపంలో, దానధర్మం పేరిట వసూలు చేస్తున్నారు. దీనిపై ఆలయ ఉన్నతాధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
 
 అధికారులకూ వాటాలు
 ఆలయంలోని స్వామి అమ్మవార్ల సన్నిధిలోనే కాకుండా పరివార దేవతల వద్ద  పూజారులు, పరిచారకులు ఉన్నారు. హారతి పళ్లాలను నిషేధించారు. దీనివల్ల భక్తులకు దక్షిణలు ఇచ్చే బాధ తప్పిందని భావించారు. అయితే మళ్లీ ఈ తంతు సాధారణమై పోయింది. హారతి పళ్లాలు, రాహు-కేతు పూజల్లో వచ్చే వసూళ్లు కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు వెళుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
 
 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం
 ఆలయంలోని మృత్యుంజయ మండపంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఇటీవల నా దృష్టికి వచ్చింది. వాటిని త్వరలో బాగు చేయిస్తాం. ఆలయంలో జరిగే రాహుకేతు పూజల్లో భక్తుల నుంచి దక్షిణ వసూలు చేయరాదని అర్చకులను ఆదేశించాం. ఎక్కడైనా దక్షిణ వసూలు చేస్తుంటే భక్తులు ఫిర్యాదు చేయవచ్చు. విచారించి చర్యలు తీసుకుంటాం.
 - పూర్ణచంద్రరావు, ఇన్‌చార్జి ఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement