బతుకు గూడులో తుపాను విధ్వంసం
Published Mon, Jan 27 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
నరసాపురం టౌన్, న్యూస్‌లైన్ : రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. పూరిగుడిసెలో జీవనం సాగిస్తున్న ఆ పేద కుటుంబాన్ని తుపాను నిలువ నీడ లేకుండా చేసింది. తలదాచుకోవడానికి గూడులేక అష్టకష్టాలు పడుతున్నారు. పాక్షికంగా ఇంటికి నష్టం వాటిల్లిందటూ అందికారులు అరకొరగా సాయం అందించి చేతులు దులుపుకున్నారు. దీంతో బాధితులు గత్యంతరం లేక బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. పూర్తి సాయం చేసి పుణ్యం కట్టుకోండి బాబూ అంటూ 28వ వార్డు గోగులమ్మ చెరువునకు చెందిన జడ్డు పద్మావతి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. హెలెన్ తుపాను ఆమె పూరిల్లు పూర్తిగా కూలిపోయింది. నిలువ నీడ కరువవడంతో బంధువులు ఆసరా ఇవ్వడంతో కుటుంబ సభ్యులంతా వారి ఇంటి వసారాలో తలదాచుకుంటున్నారు. పద్మావతి భర్త వీరవెంకట సత్యనారాయణ అనారోగ్యంతో కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు.
కొడుకు కూలి పని చేసి తీసుకువచ్చే డబ్బుతో ఆమె కుటుంబాన్ని పోషిస్తోంది. ఇల్లు నేలకూలడంతో ప్రభుత్వం సహాయం కింద ఇచ్చే రూ.5 వేలతో మళ్లీ పూరిగుడిసె వేసుకోవాలని ఆమె భావించింది. కొంత మేర అప్పు చేసి మళ్లీ రాటలు నిలబెట్టుకుంది. ఈ లోగా అధికారులు వచ్చి ఇల్లు పాక్షికంగా దెబ్బతిందంటూ పరిహారంగా రూ.1900 నగదు, 10 కిలోల బియ్యం అందించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం అందించిన సహాయం కనీసం తాటాకు కొనేందుకు కూడా సరిపోదని గోడలు, తలుపులు, తదితర ఇంటి సామగ్రి అమర్చుకునే ఆర్థిక స్థోమత తమకు లేదని ఆమె వాపోతోంది. పూర్తి సహాయం కింద రూ. 5 వేలు ఇప్పించాలని పలుమార్లు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగింది. అధికారులు కనికరించకపోవడంతో మానవత్వం ఉన్న వారి సహాయం కోసం ఆమె బేలగా ఎదురు చూస్తోంది.
Advertisement
Advertisement