Storm destruction
-
ఓక్కి’కి 39 మంది మృతి
న్యూఢిల్లీ/అహ్మదాబాద్/సాక్షి, ముంబై: పలు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించిన ఓక్కి తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఐదు రోజుల క్రితం తమిళనాడు, కేరళ, లక్షదీవుల్లో భారీ వర్షాలతో ప్రారంభమైన తుపాను క్రమంగా మహారాష్ట్రకు విస్తరించడంతోపాటు ఇప్పుడు గుజరాత్‌పై కూడా ప్రభావం చూపింది. కేరళ, తమిళనాడుల్లో కలిపి ఇప్పటివరకు ఓక్కి ధాటికి 39 మంది మరణించగా, 167 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. మరోవైపు మూడు రోజుల్లో తొలిదశ శాసనసభ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో వర్షాల కారణంగా మంగళవారం రాజకీయ నాయకుల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కేరళ, తమిళనాడు తీరాల్లో చేపల వేటకు వెళ్లిన 809 మంది మత్స్యకారులు వారి పడవలతో సహా మహారాష్ట్ర తీరానికి క్షేమంగా వచ్చారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. అయితే తుపాను క్రమంగా బలహీనపడుతోందనీ, గుజరాత్లో ఎన్నికలు జరిగే డిసెంబరు 9 నాటికి దాని ప్రభావం ఉండే అవకాశాలు తక్కువని ఓ అధికారి చెప్పారు. భారీ వర్షాల వల్ల తమిళనాడులో 10 మంది మరణించగా, 74 మందికిపైగా జాలర్లు కనిపించకుండా పోయారు. అలాగే కేరళలో 29 మంది మృతిచెందగా, 93 మంది జాలర్లు గల్లంతయ్యారు. వానల వల్ల ముంబైలో ప్రాణ, ఆస్తి నష్టమేమీ జరగలేదు. నిరంతరం పర్యవేక్షిస్తున్నా: మోదీ ఓక్కి తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను తాను నిరంతరం పర్యవేక్షిస్తున్నానని ప్రధాని మోదీ ట్వీటర్ ద్వారా తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకు సాయం చేయాలని బీజేపీ కార్యకర్తలను ఆయన కోరారు. రాహుల్, అమిత్ షా ర్యాలీలు రద్దు గుజరాత్లో పలు జిల్లాల్లో జల్లులు కురవడంతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పాల్గొనాల్సిన పలు ర్యాలీలు రద్దయ్యాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనీ, రానున్న రెండ్రోజుల్లో అది మరింత తీవ్రంగా మారొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలపై ఉండే అవకాశం ఉందంది. -
గాలివాన విధ్వంసం...
హిందూపురం మునిసిపాలిటీ/అర్బన్, న్యూస్‌లైన్ : పట్టణంలో శనివారం అర్ధరాత్రి గాలివాన విధ్వంసం సృష్టించింది. రాత్రి 11 నుంచి సుమారు గంటన్నర పాటు ఏకధాటిగా వీచిన గాలి, కురిసిన వర్షంతో పట్టణం అతలాకుతలమైంది. పలుచోట్ల విద్యుత్ తీగలపై చెట్లు పడి పలు స్తంభాలు పాక్షికంగా దెబ్బతినడంతో పాటు విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. దీంతో ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఉదయం 6 గంటలకు హిందూపురం నుంచి బెంగళూరు వెళ్లే ప్యాసింజర్ రైలు 8 గంటల వరకు ఆగిపోయింది. ఈ సమయంలో హిందూపురం మీదుగా బెంగళూరు, హైదరాబాదు వెళ్లే పలు రైళ్లను నిలిపి వేశారు. ప్యాసింజర్ రైలుకు సిగ్నల్ ఇవ్వక పోవడాన్ని అధికారులు ప్రకటించక పోవడంతో ప్రయాణికులు గొడవకు దిగారు. టికెట్ కొన్న అనేక మంది రైల్వే స్టేషన్ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. స్థానిక బాలాజీ రోడ్లో పెద్దపెద్ద వృక్షాలు నెలకొరిగాయి. పెనుకొండ రోడ్‌లోని ఆర్కే ల్యాబ్ సమీపంలో చింతచెట్టు కొమ్మ విరిగి పడ్డంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధన్ రోడ్లో శ్రీనివాసరెడ్డి ఇంటిపై చేనేత పనుల నిమిత్తం ఏర్పాటు చేసుకున్న షెడ్ రేకులు గాలికి కొట్టుకు పోయింది. మొదటి రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన అతి పెద్ద హోర్డింగ్స్ బోర్డు కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌పై పడింది. ఈ ఘటనకు కొద్ది సేపటికి ముందు డీజల్ కోసం వచ్చిన వాహనాలు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉన్న సద్భావన చిహ్నం దిమ్మెకు నాలుదిక్కులా ఏర్పాటు చేసిన పెద్ద హోర్డింగ్ గాలికి నేలకొరగడంతో పాటు దిమ్మె పాక్షికంగా దెబ్బతిన్నది. ముద్దిరెడ్డిపల్లిలో ఓ చెట్లు పూరిళ్లపై పడ్డాయి. పశువుల షెడ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఆదివారం ఉదయం నుంచి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టిన సిబ్బంది సాయంత్రం 4 గంటలకు సరఫరా చేశారు. పట్టణంలో ఇటీవల రోడ్డుకు ఇరువైపులా కేబుల్ పనుల కోసం తవ్విన గుంతలతో రాకపోకలు సాగించేందుకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. -
బతుకు గూడులో తుపాను విధ్వంసం
నరసాపురం టౌన్, న్యూస్‌లైన్ : రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. పూరిగుడిసెలో జీవనం సాగిస్తున్న ఆ పేద కుటుంబాన్ని తుపాను నిలువ నీడ లేకుండా చేసింది. తలదాచుకోవడానికి గూడులేక అష్టకష్టాలు పడుతున్నారు. పాక్షికంగా ఇంటికి నష్టం వాటిల్లిందటూ అందికారులు అరకొరగా సాయం అందించి చేతులు దులుపుకున్నారు. దీంతో బాధితులు గత్యంతరం లేక బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. పూర్తి సాయం చేసి పుణ్యం కట్టుకోండి బాబూ అంటూ 28వ వార్డు గోగులమ్మ చెరువునకు చెందిన జడ్డు పద్మావతి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. హెలెన్ తుపాను ఆమె పూరిల్లు పూర్తిగా కూలిపోయింది. నిలువ నీడ కరువవడంతో బంధువులు ఆసరా ఇవ్వడంతో కుటుంబ సభ్యులంతా వారి ఇంటి వసారాలో తలదాచుకుంటున్నారు. పద్మావతి భర్త వీరవెంకట సత్యనారాయణ అనారోగ్యంతో కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కొడుకు కూలి పని చేసి తీసుకువచ్చే డబ్బుతో ఆమె కుటుంబాన్ని పోషిస్తోంది. ఇల్లు నేలకూలడంతో ప్రభుత్వం సహాయం కింద ఇచ్చే రూ.5 వేలతో మళ్లీ పూరిగుడిసె వేసుకోవాలని ఆమె భావించింది. కొంత మేర అప్పు చేసి మళ్లీ రాటలు నిలబెట్టుకుంది. ఈ లోగా అధికారులు వచ్చి ఇల్లు పాక్షికంగా దెబ్బతిందంటూ పరిహారంగా రూ.1900 నగదు, 10 కిలోల బియ్యం అందించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం అందించిన సహాయం కనీసం తాటాకు కొనేందుకు కూడా సరిపోదని గోడలు, తలుపులు, తదితర ఇంటి సామగ్రి అమర్చుకునే ఆర్థిక స్థోమత తమకు లేదని ఆమె వాపోతోంది. పూర్తి సహాయం కింద రూ. 5 వేలు ఇప్పించాలని పలుమార్లు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగింది. అధికారులు కనికరించకపోవడంతో మానవత్వం ఉన్న వారి సహాయం కోసం ఆమె బేలగా ఎదురు చూస్తోంది.