న్యూఢిల్లీ/అహ్మదాబాద్/సాక్షి, ముంబై: పలు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించిన ఓక్కి తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఐదు రోజుల క్రితం తమిళనాడు, కేరళ, లక్షదీవుల్లో భారీ వర్షాలతో ప్రారంభమైన తుపాను క్రమంగా మహారాష్ట్రకు విస్తరించడంతోపాటు ఇప్పుడు గుజరాత్‌పై కూడా ప్రభావం చూపింది. కేరళ, తమిళనాడుల్లో కలిపి ఇప్పటివరకు ఓక్కి ధాటికి 39 మంది మరణించగా, 167 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. మరోవైపు మూడు రోజుల్లో తొలిదశ శాసనసభ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో వర్షాల కారణంగా మంగళవారం రాజకీయ నాయకుల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి.
కేరళ, తమిళనాడు తీరాల్లో చేపల వేటకు వెళ్లిన 809 మంది మత్స్యకారులు వారి పడవలతో సహా మహారాష్ట్ర తీరానికి క్షేమంగా వచ్చారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. అయితే తుపాను క్రమంగా బలహీనపడుతోందనీ, గుజరాత్‌లో ఎన్నికలు జరిగే డిసెంబరు 9 నాటికి దాని ప్రభావం ఉండే అవకాశాలు తక్కువని ఓ అధికారి చెప్పారు. భారీ వర్షాల వల్ల తమిళనాడులో 10 మంది మరణించగా, 74 మందికిపైగా జాలర్లు కనిపించకుండా పోయారు. అలాగే కేరళలో 29 మంది మృతిచెందగా, 93 మంది జాలర్లు గల్లంతయ్యారు. వానల వల్ల ముంబైలో ప్రాణ, ఆస్తి నష్టమేమీ జరగలేదు.
నిరంతరం పర్యవేక్షిస్తున్నా: మోదీ
ఓక్కి తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను తాను నిరంతరం పర్యవేక్షిస్తున్నానని ప్రధాని మోదీ ట్వీటర్ ద్వారా తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకు సాయం చేయాలని బీజేపీ కార్యకర్తలను ఆయన కోరారు.
రాహుల్, అమిత్ షా ర్యాలీలు రద్దు
గుజరాత్‌లో పలు జిల్లాల్లో జల్లులు కురవడంతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పాల్గొనాల్సిన పలు ర్యాలీలు రద్దయ్యాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనీ, రానున్న రెండ్రోజుల్లో అది మరింత తీవ్రంగా మారొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలపై ఉండే అవకాశం ఉందంది.
Comments
Please login to add a commentAdd a comment