లావేరు : వారిది రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. అటువంటి కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. వారి ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతోంది. ఎప్పటికప్పుడు రక్త కణాలు తగ్గిపోతున్నాయి. నిత్యం రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పారు. ఇంతవరకు అప్పులు చేసి సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. బయట అప్పులు పుట్టకపోవడంతో వైద్యం చేయించలేక దీనంగా ఉండిపోయారు. దాతలు సహకరించి తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
తరుచూ రక్తం మార్చాలి
పాలకొండకు చెందిన తేగల రాజు, తేగల జానకమ్మ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమార్తెలు. సుమారు 10 ఏళ్ల క్రితం ఉపాధి కోసం రణస్థలం మండలం జేఆర్‌పురం గ్రామానికి వలస వచ్చారు. ఇక్కడ భార్యాభర్త లిద్దరూ కూలి పనులు చేసుకుంటూ బతుకు బండిని సాగిస్తున్నారు. పెద్ద కుమార్తె వనితకు 2011వ సంవత్సరంలో సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని రక్త కణాలు తరుచూ తగ్గిపోతాయి. ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించాలి.
పాలకొండ, శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రులు, రిమ్స్‌లో వైద్యం చేయించారు. ఇప్పటివరకు సుమారు రూ.4లక్షలు అప్పు చేశారు. ఎలాగైనా కుమార్తె ఆరోగ్యం బాగు చేయించుకోవాలన్న తపనతో స్థోమతకు మించి అప్పులు చేసి వైద్యం చేయించారు. ఇక అప్పులు పుట్టకపోవడంతో చేసేదేమిలేక తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు. కుమార్తె పరిస్థితిని చూసి తల్లిదండ్రులు కంటతడి పెడుతున్నారు. దాతలు సహకరించి తన కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. దాతలు సహకరించి ఎస్‌బీహెచ్ బ్యాంకు ఖాతా నంబరు 62400418658కు సాయం చేయాలని కోరుతున్నారు.
పేదింటికి పెద్ద కష్టం
Published Sat, Apr 30 2016 4:59 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement