ఏదైనా తప్పు చేస్తే
దున్నపోతులా ఉన్నావ్ బుద్ధిలేదా అంటారు ...
కానరాని పని చేస్తే
పశువులా ఎందుకిలా ప్రవర్తించావ్ అంటారు...
చిల్లర పనులు చేస్తే
ఎద్దులా ఉన్నావ్ ఆ మాత్రం
తెలియదా అని అదిలిస్తారు...
మీరు చేసే అవకతవకలకు కూడా
నోరులేని మూగజీవులమని చూడకుండా
చెడామడా మమ్మల్నే
మీ మధ్యకు లాగుతారు
మరి..
మీరు చేసిందేమిటి...
పశువుల మేత పోరంబోకును
కూడా మేసేస్తారా...
మీరు మేశారు సరే ...
రక్షించాల్సిన అధికార గణానికేమయింది...
చదువులేని వాడు వింత పశువంటారే...
మరి మీరంతా చదువుకున్న వారే కదా...
మీ భాషలోనే చెబుతున్నా...
దున్నపోతుపై వర్షం కురిసిన చందంగా
ఎందుకు ముందుకురకడం లేదు
ప్రేక్షకపాత్ర వహించే
మీ ప్రవర్తననేమనాలి...?
తమ భూములను ఆక్రమించుకుంటే ఎవరైనా ఇలాగే ఆగ్రహిస్తారు. కళ్లముందే కరిగిపోతున్న భూమి... అందులో మేత కనుమరుగైతే మూగజీవైనా దానికి మనసుంటుంది కదా ... దానికీ కోపతాపాలుంటాయి కదా ... 1200 ఎకరాల్లో ప్రకృతి ప్రసాదించిన పచ్చ గడ్డిని మేస్తూ వస్తున్న ఆ పశువులు క్రమేపీ ఆ అదృష్టానికి దూరమయ్యాయి. అక్కడే మేత మేస్తూ ఆ ప్రదేశంలోనే సేదదీరుతూ... కుంటల్లో ఈదుతూ... పరుగులు తీసే ప్రదేశం నేడు అదృశ్యమయింది. ఇంత జరుగుతున్నా సంబంధితాధికారులు మొద్దునిద్ర వీడడం లేదు. ఒకటి కాదు రెండు కాదు నాలుగు పోరంబోకు స్థలాలను చేజిక్కించుకొని చదును చేసేస్తున్నారు... ఆ పశువుల కడుపు కొడుతున్నారు...ఆ కథేమిటో మీరే చదివేయండి...
తర్లుపాడు :
కాదేదీ ఆక్రమణలకు అనర్హమంటున్నారు ఈ ఆక్రమణదారులు...ఏ భూమైనా ఫర్వాలేదు ఆక్రమించేద్దాం ... అమ్మేద్దామనే సూత్రాన్ని పాటిస్తూ దాదాగిరీకి దిగుతున్నా పట్టించుకునేవారంతా ప్రేక్షకపాత్ర వహించడంతో మరింత రెచ్చిపోతున్నారు. 1200 ఎకరాలున్న పోరంబోకు భూముల్లో ఇప్పుడు కేవలం 12 సెంట్లే మిగిలిదంటే కబ్జా ఎంత దర్జాగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అంతే లేకుండాపోతుందనడానికి ఇదే ఉదాహరణ. పశువులమేత పొరంబోకు, కొండపోరంబోకు, వాగు పోరంబోకు, రస్తా పోరంబోకు తదితర భూములకు పట్టాలివ్వాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఇవేవీ చేయకుండానే అధికారులను ప్రసన్నం చేసుకొని ఆక్రమణకు తెరదీస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గానుగపెంట రెవెన్యూ గ్రామంలో సుమారు 1200 ఎకరాలు పశువుల మేత, పొరంబోకు భూమి ఉంది. నేడు పశువులు మేసేందుకు 12 సెంట్ల భూమి లేదని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి అయిన వారికి అనుమతులిస్తూ సాగుకు సన్నద్ధం చేస్తున్నారు. సర్వే నెంబర్ 10లో 168.40 ఎకరాల పశువుల మేత పోరంబోకు భూమి ఉంది. గతంలో ఈ సర్వే నెంబర్‌లో 60 ఎకరాల పట్టాలను కూడా మంజూరు చేశారు. మిగిలిన 108.40 ఎకరాల భూమిని పలువురు అధికారుల అండదండలతో సాగు చేసుకుంటున్నారు. కొందరు మరికొంత ముందుకెళ్లి ఆ భూమి తమదిగా విక్రయించేసుకున్నారు కూడా. సర్వే నెంబర్ 10లో ఇటీవల మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన కొందరు తమ పూర్వీకులు కొనుగోలు చేశారని, పదెకరాల భూమిని ఇటీవల చదును చేసి పంట పొలంగా మార్చే ప్రయత్నాలు చేపట్టారు. దీంతో గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారమందించారు. తహశీల్దార్ కేవీఆర్‌వీ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆర్.ఐ. శ్రీనివాస్, వీఆర్వో నాగేశ్వరరావు ఆక్రమిత భూములను పరిశీలించి తహశీల్దార్‌కు నివేదిక అందజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పశువుల మేత, పొరంబోకు భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకొని పశువుల మేతకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌ను సంప్రదించనున్నట్లు తెలిపారు.
పశువులు మేసేందుకు సెంటు భూమి లేదు
పోటు గురవయ్య
గ్రామంలో సుమారు 20 వేల వరకు జీవధనం ఉంది. గ్రామానికి సంబంధించి సుమారు 1200 ఎకరాలు పశువుల మేత, పొరంబోకు భూములున్నాయి. నేడు పశువులు మేసేందుకు సెంటు భూమి కూడా లేకపోవటంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పశువుల బీడును ఆక్రమిస్తే చర్యలు తప్పవు-
కేవీఆర్‌వీ ప్రసాదరావు, తహశీల్దార్
పశువుల మేత, పొరంబోకు భూములను, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూముల జోలికి ఎవరూ వెళ్లవద్దు. ప్రభుత్వ భూముల్లో బోర్డులను ఏర్పాటు చేసి గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటాం.
పోరంబోకుల దందా.!
Published Thu, Jan 22 2015 10:08 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM
Advertisement
Advertisement