మచిలీపట్నం : ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పోర్టు నిర్మాణ ఆశలపై నీళ్లు చల్లింది. పోర్టు నిర్మాణానికి కేవలం రూ.30 లక్షలు కేటాయించటంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని మంత్రులు హామీలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికి తొమ్మిది నెలలు పూర్తయినా పనుల ప్రారంభానికి సంబంధించి కసరత్తు జరగటం లేదు. బడ్జెట్‌లో మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేస్తామనే ఒకే ఒక్క మాటతో ఈ అంశాన్ని పక్కన పెట్టడం గమనార్హం. పోర్టును ప్రైవేటు సంస్థ నిర్మించినప్పటికీ ప్రభుత్వ పరంగా పోర్టు వరకు నిర్మించే రోడ్లు, డ్రెడ్జింగ్ తదితర పనులకు నిధులు కేటాయించకుండా మిన్నకుండిపోయింది. పోర్టు నిర్మించే ప్రాంతంలో 2428 ఎకరాల ప్రభుత్వ భూమి, 411 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని ఇటీవల నిర్వహించిన సర్వేలో అధికారులు తేల్చారు.
ఈ భూమి సేకరణ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగాలంటే కనీసంగా ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయినా బందరు పోర్టు అభివృద్ధికి సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడకపోగా బడ్జెట్‌లోనూ డ్రెడ్జింగ్ తదితర పనులకు ప్రభుత్వపరంగా నిధుల విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవటంతో పోర్టు నిర్మాణ పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. బందరు మండలం పెదపట్నం వద్ద మెరైన్ అకాడమీని ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రస్తావించారు. 300 ఎకరాల్లో ఈ అకాడమీ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అయితే మెరైన్ అకాడమీకి ప్రభుత్వ పరంగా భూమిని కేటాయిస్తే అకాడమీ నిర్మాణానికి సంబంధించిన వ్యయం మొత్తం కేంద్రమే భరిస్తుంది. ఈ అకాడమీ నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని అప్పట్లో పోలీసు విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ప్రకటించారు.
పోర్టు ఆశలపై నీళ్లు
Published Fri, Mar 13 2015 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM
Advertisement