వెయ్యి లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం
నెల్లూరు(క్రైమ్) : ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన వెయ్యి లీటర్ల కిరోసిన్‌ను అక్రమంగా తరలిస్తుండగా ఎస్‌బీ, నెల్లూరు రెండో నగర పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఐదు బ్యారళ్లలోని కిరోసిన్‌తో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు..నగరంలోని వెంగమాంబ సెంటర్‌కు చెందిన చెంబేటి పెంచలయ్య జేమ్స్‌గార్డెన్‌లో కిరోసిన్, పాతదుస్తులు విక్రయిస్తాడు.
ఆయన పలువురు రేషన్ డీలర్ల నుంచి కిరోసిన్‌ను లీటర్ రూ.35 వంతున కొనుగోలు చేస్తాడు. దానిని లారీ, ఆటో మెకానిక్‌లతో పాటు పలువురికి రూ.40 వంతున విక్రయిస్తాడు. కొన్నేళ్లుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో పలు రేషన్‌షాపుల నుంచి సేకరించిన వెయ్యి లీటర్ల కిరోసిన్‌ను ఐదు బ్యారళ్లలో నింపుకుని ఆదివారం తెల్లవారుజామున ఆటోలో జేమ్స్‌గార్డెన్‌ను తరలించసాగాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్‌బీ పోలీసులు రెండో నగర పోలీసులను అప్రమత్తం చేశారు.
అనంతరం రెండో నగర ఎస్సైలు కె.సాంబశివరావు, జిలాని, ఎస్‌బీ ఏఎస్సై బ్రహ్మానందం, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు ఆటోను వెంబడించి జేమ్స్‌గార్డెన్ వద్ద పట్టుకున్నారు. డ్రైవర్ బొమ్ము సురేష్‌తో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం చెంబేటి పెంచలయ్యను సైతం అదుపులోకి తీసుకొని విచారించారు.
లక్ష్మీపురంలోని పి. ఇవాంజలిన్ (ఎఫ్‌పి షాప్ నంబర్-5) వ ద్ద 180 లీటర్లు, కిసాన్‌నగర్‌లోని సీహెచ్ రమణయ్య(ఎఫ్‌పి షాప్ నంబర్-108) వద్ద 300లీటర్లు, మిగిలిన కిరోసిన్‌ను పలువురి నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడించాడు. ఆటోను సీజ్ చేసిన పోలీసులు పెంచలయ్య, సురేష్‌తో పాటు డీలర్లపై కేసులు నమోదు చేశారు. డీలర్లపై చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సిఫార్సు చేస్తామని పోలీసులు తెలిపారు.