blue kerosene
-
పెరిగిన నీలి కిరోసిన్ ధర
తొర్రూరు రూరల్(పాలకుర్తి): రేషన్ దుకాణాల్లో నీలి కిరోసిన్ ధర పెరిగింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం పడింది. కిరోసిన్‌ను అధిక శాతం నిరుపేదలే వినియోగిస్తుంటారు. ధరలు పెరగడంతో కిరోసిన్ కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ఇబ్బందులు పడుతున్న పేదలను కిరోసిన్ ధర మరింత కుంగదీస్తోంది. నెలన్నర క్రితం లీటర్‌కు రూ.15 నేడు రూ.27కు చేరుకుంది. ప్రజలపై రూ. 27.78లక్షల భారం జిల్లాలో 553 రేషన్ దుకాణాలు, 2,31,580 కార్డులు ఉన్నాయి. ఒక్కో రేషన్ కార్డుకు లీటరు చొప్పున కిరోసిన్ ఇస్తున్నారు. రెండేళ్లలో అదనంగా రూ.12 పెంచడంతో ప్రజలపై రూ.27.78లక్షల భారం పడుతోంది. పెరిగిన ధరలతో కిరోసిన్ కొనుగోలు చేయలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ప్రైవేటు మార్కెట్లో లీటర్ కిరోసిన్ ధర రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. ధరలతో ప్రైవేటులో, రేషన్ దుకాణాల్లో కొనలేని పరిస్థితి దాపురించిందని పలువురు వాపోతున్నారు. గత ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా 10 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేసేది. ప్రస్తుతం బియ్యం, కిరోసిన్ మాత్రమే ఇస్తున్నారు. బియ్యం ధర అందుబాటులో ఉన్నప్పటికీ కిరోసిన్ ధర కూడా తగ్గించాలని స్థానికులు కోరుతున్నారు. కిరోసిన్ ధర తగ్గించాలి లీటర్ కిరోసిన్ రూ.27కు కొనాలంటే కష్టంగా ఉన్నది. అంతకుముందు రూ.15కు పోసేవాళ్లు. గ్యాస్ పొయ్యి కొనే స్థోమత లేదు. కిరోసిన్ స్టవ్ పెట్టుకుందామంటే దాని ధర కూడా పెరిగింది. ప్రభుత్వం ఆలోచించి ధర తగ్గించాలి. – గుగులోతు బీకి, గుడిబండ తండా, తొర్రూరు సామాన్యులపై భారం పడుతోంది రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం ఒక్క కార్డుకు లీటరు కిరోసిన్ మాత్రమే ఇస్తోంది. రెండు, మూడు నెలలకోసారి ధరలు పెంచుతున్నారు. దీంతో మాపై భారం పడుతుంది. గతంలోమాదిరి పప్పు, చింతపండు, చక్కర, తదితర వస్తువులు ఇవ్వాలి. – దండె సురేష్, ఫత్తేపురం, తొర్రూరు ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రభుత్వ ఆదేశాల మేరకే కిరోసిన్ పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం ఏ ధర నిర్ణయిస్తే అలాగే డీలర్లకు సరఫరా చేస్తున్నాం. కిరోసిన్ ధరలు తగ్గించాలని ఉన్నతాధికారులను కోరతాం. – జి.నర్సింగరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
బ్లూ కిరోసిన్ దందా
జనగామ : జిల్లా కేంద్రంగా బ్లూ కిరోసిన్ దందా యథేచ్ఛగా సాగుతోంది. డీజిల్ ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు రేషన్ ద్వారా పంపిణీ చేసే బ్లూ కిరోసిన్ వైపు దృష్టి సారిస్తున్నారు. కొంతమంది బ్రోకర్లు రాత్రికి రాత్రే బ్లూ కిరోసిన్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. లబ్ధిదారులతోపాటు పలువురు ఏజెంట్ల నుంచి బ్లూ కిరోసిన్‌ను సేకరిస్తూ రహస్య ప్రదేశాల్లో డంపింగ్ చేస్తున్నారు. జనగామ పట్టణంలో నడిరోడ్డుపై ‘బ్లాక్’ దందా సాగిస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనగామతోపా టు మండలాల్లో ఈ వ్యాపారం మూడు పూలు..ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. జనగామ జిల్లాలోని 13 మండలాల్లో 355 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెల 1.62 లక్షల కుటుంబాలకు 1.62 లక్షల లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తున్నారు. రేషన్ దుకాణాల ద్వారా నిరుపేద కుటుంబాలకు సరఫరా చేస్తున్న కిరోసిన్ పెద్ద మొత్తంలో పక్కదారి పడుతోంది. జనగామ జిల్లా కేంద్రంలో కొంతమంది బ్రోకర్ల కనుసన్నల్లో ఈ దందా జరుగుతోంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి వెంబడే ఓ వ్యాపారి పట్టపగలే కిరోసిన్‌ను బ్లాక్‌లో అమ్ముతున్నాడు. పట్టణంలోని రెండు మూడు ప్రదేశాల్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. రహస్య ప్రదేశాల్లోని గోదాంలో బ్లూ కిరోసిన్ క్యాన్లను నిల్వ చేస్తున్నారు. తనిఖీలు చేస్తున్నాం అర్ధరాత్రి సమయంలో బ్లూ కిరోసిన్ అమ్మకాలపై తనిఖీలు చేస్తున్నాం. కొడకండ్ల పరిధిలో కేసులు కూడా నమోదు చేసినం. లబ్ధిదారులు ఎక్కడా కూడా కిరోసిన్ అమ్ముకోవద్దు. ఎవరైనా సబ్సిడీ కిరోసిన్ అమ్మినా, ప్రైవేట్ వ్యాపారాలకు వినియోగించినా కేసులు తప్పవు. - రుక్మిణి, డీఎస్ఓ -
నీలి కిరోసిన్ పట్టివేత
డోన్ టౌన్ : పట్టణంలోని కేవీఎస్ పెట్రోల్ బంకు వెనుకాల గల గోడౌన్‌పై సోమవారం తహసీల్దార్ మునికృష్ణయ్య ఆకస్మిక దాడులు జరిపి అక్రమంగా నిల్వ ఉంచి, లెక్కచూపని 10, 280 లీటర్ల నీలి కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కిరోసిన్ హోల్‌సేల్ డీలర్.. కేవీఎస్ కంపెనీ వారికి జనవరి నెలలో 67 వేల లీటర్ల కిరోసిన్‌ను కేటాయించగా.. 54వేల లీటర్లను మాత్రమే పంపిణీ చేశారని తహసీల్దార్ తెలిపారు. అక్రమంగా 10,280 లీటర్ల కిరోసిన్‌ను గోడౌన్లో నిల్వచేయగా దాడులు జరిపి గోడౌన్‌ను సీజ్ చేశాన్నారు. మిగిలిన 2,720 లీటర్ల కిరోసిన్ ఏమయిందనే విషయంపై సరైన రికార్డులను కేవీఎస్ కంపెనీ చూపలేకపోయిందని ఆయన తెలిపారు. ఈ విషయంపై జిల్లా అధికారులకు సమగ్ర నివేదిక పంపినట్లు తహసీల్దార్ స్పష్టం చేశారు. -
నీలి ఇంధనం..!
► మాఫియా చేతుల్లో నీలి కిరోసిన్ ►నార్కెట్‌పల్లి రహదారిలో విచ్చలవిడిగా వ్యాపారం ►పౌరసరఫరాల శాఖ నుంచి పక్కదోవ పడుతున్న వైనం ►నోరు మెదపని అధికారులు.. తనిఖీ బృందాలు ప్రతి ఒక్కరూ పేదలపై దండయాత్ర చేసేవారే. వారి నోటి దగ్గర కూడు లాక్కొని భోం చేసేవారే. స్థలాలు.. పొలాల నుంచి కష్టపడి సంపాదించే కూలి దాకా.. పంటల ఉత్పత్తి దాకా! ఇక రేషన్ సరుకుల గురించి చెప్పేదేముంది?ఎంత పిండితే అంత! పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే కిరోసిన్ సంపాదనకు ఇం‘ధనం’గా మారింది. మాఫియా చేతుల్లో వేలాది లీటర్లు పక్క దోవ నుంచి కారిపోతూనే ఉంది. - సంతమాగులూరు చాలా పేద కుటుంబాల్లో ఇప్పటికీ వంట గ్యాస్ లేదు. ఇలాంటి వారందరికీ నీలి కిరోసినే ఆధారం. దానిని స్టౌలలో పోసుకొని కావాల్సిన వంట చేసుకుంటారు. అందుకే పౌర సరఫరాల శాఖ తెల్ల రేషన్‌కార్డు దారులకు ప్రతినెలా రేషన్ డీలర్ల నుంచి కిరోసిన్ సరఫరా చేస్తుంది. అరుుతే కొంతమంది మాఫియాగా ఏర్పడి దీనిని అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారు. ఈ తరహా దందాకు అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారి నిలయంగా మారింది. ఇక్కడ నుంచి బహిరంగంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటంలేదు. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు సమీపం లోని పాత హోటళ్ల వద్ద భారీ స్టాక్ ఉంటోంది. కిరోసిన్‌ను పీపాల్లో భద్రపరుస్తున్నారు. ఒక్క పీపాలో 220 లీటర్లు పడుతుంది. ఇలాంటివి ప్రతి నెలా 10 డ్రమ్ముల దాకా తరలిపోతోంది. అంటే ప్రతి నెలా దాదాపు 2000 లీటర్ల కిరోసన్ బ్లాక్ మార్కెట్లో అమ్ముడు పోతోంది. దీని విలువ రూ. 5 లక్షల దాకా ఉం టుందని అంచనా. గతంలో ఈ వ్యాపారంపై దినపత్రికల్లో వార్తలు రాగా కాసేపు హడావుడి చేసినా అధికారులు మామూళ్లు పుచ్చుకొని వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నారుు. డీలర్ల పాత్ర? ఏల్చూరు, రొంపిచర్ల, సజ్జాపురం, కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం తదితర గ్రామాల నీలి కిరోసిన్ తరలి వస్తోంది. ఒక్కోడీలర్ నుంచి 100 లీటర్ల దాకా సేకరిస్తున్నారు. అలాగే హైవేపై మద్దిపాడు, మేదరమేట్ల వంటి ప్రాంతాల్లోనూ కిరోసిన్ వ్యాపారం జోరుగా సాగుతోంది. గతంలో రేషన్ డీలర్లకు పంచదార, కిరోసిన్, బియ్యం సరఫరా మధ్య జాప్యం ఉండేది. దీంతో దాదాపు లబ్ధిదారులందరికీ సరుకు ఇవ్వడం అనివార్యమయ్యేది. కానీ ప్రస్తుతం సరకులన్నీ ఒకేసారి రావటంతో డీలర్లు అన్ని రకాల పదార్థాలకు ఒకే సారి వేలిముద్ర వేరుుంచుకొంటున్నారు. అవసరంలేని వారి వద్ద కిరోసిన్ సేకరించి లీటరు రూ. 30 చొప్పున బ్లాక్‌లో అమ్ముకుం టున్నారు. వ్యాపారులు లారీలకు లీటరు రూ. 50 చొప్పున అమ్ముతున్నారు. ఇలా లక్షలాది రూపాయలు వారి జేబుల్లో పడుతున్నారుు. ప్రభుత్వం మాత్రం లీటరు రూ.15కే సరఫరా చేస్తుంది. కొంతమంది దళారులు.. వ్యాపారులకు, డీలర్లకు మధ్య సంబంధాలు నిర్వహిస్తూ చీకటి వ్యాపారాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. లారీ డ్రైవర్లు ఓనర్లకు తెలియకుండా డీజిల్‌ను పక్కదోవ పట్టించి దాని స్థానంలో కిరోసిన్ నింపుతున్నారు. వాహనాలు, ఎరువుల దుకాణాలనే పరిశీలిస్తారా? జిల్లా విజిలెన్స అధికారులు వారానికి ఒక సారి పుట్టావారిపాలెం జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుంటారు.- అలాగే ఇటీవల కాలంలో కొమ్మాలపాడులో ఎరువుల దుకాణాల్లోనూ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కానీ ఏల్చూరు- కొమ్మాలపాడు గ్రామాల మధ్య యథేచ్ఛగా సాగుతున్న నీలికిరోసిన్ వ్యాపారాన్ని ఎందుకు కట్టడి చేయడంలేదో వారికే తెలియాలి. అధికారులు దాడులకు ఉపక్రమించిన సమయంలో వ్యాపారులకు కొంతమంది ముందస్తు సమాచారం ఇవ్వటంతో జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: పార్వతి ,తహసీల్దార్ కిరోసిన్ విషయం తన దృష్టికి వచ్చింది. కొత్త గా విధుల్లోకి చేరడం వల్ల కొంత పని ఒత్తిడి ఉంది. మూడు, నాలుగు రోజుల్లో తనిఖీలు చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. -
130 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం
ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరామల్ గూడ లో అక్రమంగా నిల్వ ఉంచిన నీలి కిరోసిన్ పోలీసులు ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా రేషన్ డీలర్ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం తో ఎస్ ఓటీ పోలీసులు దాడి చేసి 130 లీటర్ల నీలి కిరోసిన్ తో పాటు ఒక లారీ, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. -
700 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం
గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల నీలి కిరోసిన్‌ను పట్టుకున్నారు. గుంటూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆటో నగర్లో నీలి కిరోసిన్ విక్రయిస్తుంటాడు. అతడి దుకాణంపై గురువారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేసి 700 లీటర్ల నీలి కిరోసిన్‌ను పట్టుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నాగరాజు తన సెల్‌ఫోన్‌ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. సెల్‌ఫోన్ సహా కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. -
దారి దోపిడీ!
సాక్షి, కర్నూలు : ప్రజల ఆకలి తీర్చడం కనీస బాధ్యతన్న యోచనతో ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం, రాయితీపై చౌక దుకాణాల ద్వారా నీలి కిరోసిన్ పంపిణీ చేస్తోంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. బియ్యం, కిరోసిన్ అక్రమార్కుల పరమవుతోంది. చౌక బియ్యాన్ని మరింత పాలిష్ పట్టించి రూపాయికి పదింతల అక్రమార్జనకు పాల్పడుతూ పేదల కడుపుకొడుతున్నా.. డీలరు, దళారి ఒక్కటై అసలు కార్డుదారులకు కిరోసిన్ ఇవ్వకుండా కాజేస్తున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అక్రమానికి బీజం.. జిల్లాలో రాయితీపై ఇచ్చే కిరోసిన్ 24 లక్షల లీటర్లు కాగా, అందులో సగం పక్కదారి పడుతోంది. ఎలా అంటే కిరోసిన్ పొందుతున్న వారిలో అధికశాతం మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పేరుకు తెల్లకార్డులు ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కిరోసిన్ తెచ్చుకునేవారి సంఖ్య తక్కువ. ఇక పట్టణ ప్రాంతాల్లో కొందరు ధనవంతులకు తెల్లకార్డులు ఉన్నాయి. ఇలాంటి వారు తమ బిడ్డల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, వైద్య సేవలకు మాత్రమే తెల్లకార్డును వినియోగించుకుంటున్నారు. కిరోసిన్‌ను తెచ్చుకోవడంలేదు. ఈ పరిస్థితే డీలర్లకు కలిసొస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురు డబ్బులిచ్చి నోళ్లు మూయించడం.. అధికారులు దాడి చేస్తే రాజకీయ సిఫారసులతో వారి చేతులు కట్టేయడం జరుగుతోంది. బ్లాక్ మార్కెట్లో లీటర్ కిరోసిన్ రూ. 45 జిల్లాలోని డీలర్లు ప్రతి నెలా 14, 15 తేదీల్లో కిరోసిన్‌కు డీడీలు కడతారు. తర్వాత హోల్‌సేల్ డీలరు 15వ తేదీ నుంచి చౌక దుకాణాలకు కిరోసిన్ చేరవేయాలి. దానిని డీలరు 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ కార్డుదారులకు పంపిణీ చేయాలి. గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారుడికి లీటరు, లేనివారికి రెండు లీటర్ల చొప్పున ఇస్తారు. ప్రభుత్వం డీలరుకు లీటరు రూ. 14.75కు సరఫరా చేస్తే, లబ్ధిదారుడికి రూ. 15కు అందజేస్తారు. అయితే డీలరు పూర్తి స్థాయిలో కేటాయింపులకు డీడీలు తీయకుండా.. సగానికి తీసి, మిగతాది పూర్తి కిరోసిన్ అందించే సమయంలో కడతామంటూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బోగస్ కార్డులు, బినామీ కార్డులు, కిరోసిన్ వాడని కార్డుల ద్వారా మిగుల్చుకున్న కిరోసిన్‌ను బ్లాక్మార్కెట్లో రూ. 45కు అమ్ముకుంటున్నారు. అదీ కొందరు హోల్‌సేల్ డీలర్లకే. ఇటీవల.. పట్టుపడడం పరిస్థితికి అద్దం పడుతోంది. కొందరు కార్డుదారుల కక్కుర్తి.. కర్నూలు నగరంతోపాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో ధనవంతులకూ తెల్లకార్డులు ఉన్నాయి. వాటిని వైద్యానికి, బోధనా చెల్లింపులకు వినియోగించుకుంటూ కిరోసిన్‌ను డీలరుకే రూ. 25కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా బ్లాక్‌మార్కెట్‌కు తరలించిన కిరోసిన్‌ను కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ బంకుల్లో కలిపి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. దారి మళ్లుతున్న బియ్యం.. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోంది. పౌరసరఫరాల శాఖలో పర్యవేక్షణ కొరవడడంతో ఎవరిష్టం వారిదన్నట్లు ఇష్టారాజ్యంగా రూపాయి బియ్యంను దారి మళ్లిస్తున్నారు. జిల్లాలో 17 ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నెలకు 17 వేల టన్నుల బియ్యం 2,411 చౌక దుకాణాలకు తరలిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఆ తర్వాత బియ్యం దారి మళ్లుతున్నాయి. నంద్యాల, నందికొట్కూరు, ఆదోని, కర్నూలు, ఆలూరు ప్రాంతాల నుంచి అలా అక్రమంగా తరిలించిన బియ్యానికి కల్లూరు, కర్నూలు శివారులు అనధికారిక గోదాములుగా మారాయి. ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా సేకరించిన బియ్యానికి కర్నూలుకు చెందిన కొందరు వ్యాపారులు కల్లూరు శివారు ప్రాంతాల్లోని రోడ్డు వెంట కొన్ని ప్రాంతాల్లో, కల్లూరులోని కొన్ని గోదాముల్లో నిల్వ ఉంచుతారు. ఈ బియ్యంను వ్యాపారులు డీలరు నుంచి రూ. ఐదుకు కొనుగోలు చేసి, ఇతరులకు రూ. 10కి విక్రయిస్తారు. వాటిని లారీల్లో కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు తరలిస్తారు. ఒక్క కర్నూలు, నందికొట్కూరు, ఆదోని, కల్లూరు ప్రాంతాల్లోనే ఇలా వ్యాపారులు చేసే వారు 50 మంది ఉండగా.. ఒక్క కర్నూలు ప్రాంతంలోనే చౌక బియ్యం వ్యాపారం చేసే దళారులు 20 మంది వరకూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా అన్లైన్ ప్రజాపంపిణీకి అధికారులు శ్రీకారం చుడతామంటున్నారు. అప్పుడైనా ప్రజా పంపిణీలో అవకతవకలకు తావుండదా అన్నది వేచి చూడాల్సిందే. రూట్ అధికారి లేకుండానే.. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి చౌక దుకాణానికి బియ్యం, కిరోసిన్ తీసుకెళ్లే సమయంలో వాహనం వెంట ఓ రూట్ అధికారి ఉండాలి. ఈ ప్రక్రియ పకడ్బందీగా అమలు జరగడం లేదు. దాంతో డీలరు, అక్రమ వ్యాపారులు, అధికారులకు ఈ వ్యాపారం భారీగానే జేబులు నింపుతోంది. ఇప్పటికైనా అక్రమ వ్యాపరులపై కన్నేసీ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసే అక్రమార్కుల భరతం పట్టాల్సిన అవసరం ఉంది. ఏడాదిలో 150కుపైగా 6ఏ కేసులు.. ప్రస్తుతం ఏ పట్టణంలో, ఏ మండలంలో చూసినా హోటళ్లలో దోసెలు, ఇడ్లీలకు వినియోగించేది కిలో రూపాయి బియ్యమే. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, డోన్, నందికొట్కూరు ప్రాంతాల్లో అల్పాహార దుకాణాల వద్ద అడిగితే రేషన్ బియ్యమేనని బహిరంగంగా చెప్పేస్తారు. ఏడాదిలో జిల్లాలో 150కుపైగా 6ఏ కేసులు నమోదయ్యాయి. మాటలతో సరి.. జిల్లా పౌరసరఫరాల అధికారి కిరోసిన్.. కిలో రూపాయి బియ్యంను అడ్డదారిన బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఏడాది చౌక బియ్యం, కిరోసిన్‌కు సంబంధించి 6ఏ కేసులు 150 వరకూ పెట్టామని చెప్పారు. కానీ.. అక్రమార్కులు యథేచ్ఛగా తమ పనిని తాము కానిచ్చేస్తున్నారు. -
వెయ్యి లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం
నెల్లూరు(క్రైమ్) : ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన వెయ్యి లీటర్ల కిరోసిన్‌ను అక్రమంగా తరలిస్తుండగా ఎస్బీ, నెల్లూరు రెండో నగర పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఐదు బ్యారళ్లలోని కిరోసిన్‌తో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు..నగరంలోని వెంగమాంబ సెంటర్‌కు చెందిన చెంబేటి పెంచలయ్య జేమ్స్గార్డెన్లో కిరోసిన్, పాతదుస్తులు విక్రయిస్తాడు. ఆయన పలువురు రేషన్ డీలర్ల నుంచి కిరోసిన్‌ను లీటర్ రూ.35 వంతున కొనుగోలు చేస్తాడు. దానిని లారీ, ఆటో మెకానిక్‌లతో పాటు పలువురికి రూ.40 వంతున విక్రయిస్తాడు. కొన్నేళ్లుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో పలు రేషన్‌షాపుల నుంచి సేకరించిన వెయ్యి లీటర్ల కిరోసిన్‌ను ఐదు బ్యారళ్లలో నింపుకుని ఆదివారం తెల్లవారుజామున ఆటోలో జేమ్స్గార్డెన్ను తరలించసాగాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్బీ పోలీసులు రెండో నగర పోలీసులను అప్రమత్తం చేశారు. అనంతరం రెండో నగర ఎస్సైలు కె.సాంబశివరావు, జిలాని, ఎస్బీ ఏఎస్సై బ్రహ్మానందం, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు ఆటోను వెంబడించి జేమ్స్‌గార్డెన్ వద్ద పట్టుకున్నారు. డ్రైవర్ బొమ్ము సురేష్‌తో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం చెంబేటి పెంచలయ్యను సైతం అదుపులోకి తీసుకొని విచారించారు. లక్ష్మీపురంలోని పి. ఇవాంజలిన్ (ఎఫ్‌పి షాప్ నంబర్-5) వ ద్ద 180 లీటర్లు, కిసాన్‌నగర్‌లోని సీహెచ్ రమణయ్య(ఎఫ్‌పి షాప్ నంబర్-108) వద్ద 300లీటర్లు, మిగిలిన కిరోసిన్‌ను పలువురి నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడించాడు. ఆటోను సీజ్ చేసిన పోలీసులు పెంచలయ్య, సురేష్‌తో పాటు డీలర్లపై కేసులు నమోదు చేశారు. డీలర్లపై చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సిఫార్సు చేస్తామని పోలీసులు తెలిపారు. -
నీలి కిరోసిన్ కేరాఫ్బ్లాక్ మార్కెట్
చల్లపల్లి కేంద్రంగా అక్రమాల జోరు గిలకలదిండికి తరలింపు? గుట్టుచప్పుడు కాకుండా నిర్వహణ చల్లపల్లి రూరల్, న్యూస్‌లైన్ : చౌక దుకాణాల్లో తెల్ల రేషన్ కార్డుదారులకు సరఫరా చేయాల్సిన సబ్సిడీ నీలి కిరోసిన్ మచిలీపట్నం పరిధిలోని గిలకలదిండి గ్రామానికి అక్రమంగా తరలిపోతోంది. ఈ వ్యవహారం చల్లపల్లి పరిసర మండలాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రతినెలా రేషన్ డీలర్లు కట్టిన డీడీలను బట్టి సరకుల కోటా కేటాయింపులు జరుగుతాయి. డీలర్లకు చేరకముందే నీలి కిరోసిన్ నల్ల బజారుకు తరలిపోతోందనేది బహిరంగ రహస్యమని పలువురు ఆరోపిస్తున్నారు. కార్డుదారులకు కొర్రీ... రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులు కిరోసిన్‌ను పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నారు. ప్రతి నెలా సరఫరా చేయాల్సిన కిరోసిన్ ఒకేసారి ఒకే మొత్తంగా చేరటం లేదని, అందుకే అందరికీ ఒకేసారి కిరోసిన్ ఇవ్వలేకపోతున్నామని డీలర్లు చెపుతున్నారు. ఫలితంగా రికార్డులు పక్కనపెట్టి చూస్తే నెలనెలా కిరోసిన్ పోయించుకుంటున్న కార్డుదారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. అసలు కిరోసిన్ వచ్చిందో లేదో.. ఎప్పుడిస్తారో కూడా తెలియని అయోమయంలో ఉన్నామని కొందరు కార్డుదారులు చెబుతున్నారు. కిరోసిన్‌ను రెండు విడతలుగా రేషన్ షాపులకు తరలించటం వెనుక పెద్ద ఎత్తుగడే ఉన్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి నెలా ఇలాగే జరుగుతున్నా అధికారులు మాత్రం ఏంచేస్తున్నారో అర్థంకావటం లేదని వారి పనితీరుపై పెదవి విరుస్తున్నారు. ప్రతినెలా ఒకేసారి అందరికీ కిరోసిన్ అందేలా సరిపడినంత కోటాను రేషన్ దుకాణాలకు సరఫరా చేయాలని కోరుతున్నారు. నిరంతర తనిఖీలతోనే అడ్డుకట్ట... నిరంతర తనిఖీలతోనే అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందనేది కార్డుదారుల అభిప్రాయం. గతంలో బందరు ఆర్డీవోగా పనిచేసిన కట్టా హైమావతి గిలకిలదిండిలోని చేపల వేటకు ఉపయోగించే బోట్లపై దాడిచేసి పెద్ద ఎత్తున నీలి కిరోసిన్ నిల్వలను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. అంతేగాక రేషన్ దుకాణాలపై కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ వాటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుత ఆర్డీవో కూడా మరోసారి ధైర్యం చేసి గిలకలదిండిలో తనిఖీలు చేస్తే నీలికిరోసిన్ మాఫియా భాగోతం గుట్టు రట్టవుతుందని పలువురు పేర్కొంటున్నారు. తరలిపోతోంది ఇలా... సేకరించిన నీలికిరోసిన్ మొత్తాన్ని రహస్య ప్రదేశానికి చేరుస్తారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న వాహనంపై రాత్రి సమయాల్లో తరలిస్తారు. ఎక్కువగా శనివారం రాత్రివేళ ఈ వ్యవహారాన్ని యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తారు. తొలుత కిరోసిన్‌ను పీపాల్లో నింపి వాహనంలో ఎక్కించి అవి బయటకు కనిపించకుండా నల్లతెరలు కప్పుతారు. వాహనం బయలుదేరగానే ఓ వ్యక్తి మోటారు బైక్‌పై ముందు వెళ్లి పోలీసుల ఉనికిని గమనిస్తూ రూట్ సక్రమంగా ఉందా లేదా. అనేది పరిశీలిస్తూ వాహనాన్ని ముందుకు తీసుకువెళతాడు. కిరోసిన్ వాహనం ఊరు పొలిమేరలు దాటగానే బైక్‌పై ఉన్న వ్యక్తి వెనుదిరిగి వచ్చేస్తాడు. ఇది గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న తతంగం. ఇదే క్రమంలో ఈ నెల 18వ తేదీ శనివారం రాత్రి 10 గంటలకు ట్రాలీ వాహనం చల్లపల్లి అగ్రహారంలోని సీఐ దుర్గారావు నివాసం ఉండే ఇంటికి కొంతదూరంలో ఉన్న చీకటి ప్రదేశం నుంచి ప్రధాన రోడ్డువైపు ఒక్కసారిగా దూసుకొచ్చింది. అప్పటికే రోడ్డుపై కాపలా కాస్తున్న మరో వ్యక్తి వాహనం ఎక్కాడు. వెంటనే అది శివాలయం ముందునుంచి వేగంగా మచిలీపట్నం వైపుకు దూసుకుపోయింది. బైక్‌పై ఓ వ్యక్తి కిరోసిన్‌తో తరలిపోతున్న వాహనానికి ముందు వెళ్లాడు. లక్ష్మీపురం పొలిమేర దాటగానే వెనుదిరిగి వచ్చేశాడు. బయటికి తరలిస్తే నిబంధనల ఉల్లంఘనే చల్లపల్లి మండలంలోని డీలర్లకు బందర్ రోడ్డులోని రావి వీరరాఘవయ్య అండ్ సన్స్ ద్వారా అగ్రహారంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వెనుక ఉన్న స్టాక్ పాయింట్ నుంచి నీలి కిరోసిన్‌ను సరఫరా చేస్తారని తహశీల్దార్ ముత్యాల శ్రీనివాస్ తెలిపారు. చల్లపల్లి మండలానికి చెందిన కోటా కిరోసిన్‌ను పక్క ప్రాంతాలకు తరలించకూడదని నిబంధన ఉన్నట్లు వివరించారు. అలాకాక బయటి ప్రాంతాలకు తరలిస్తే నిబంధనలను ఉల్లంఘించినట్లేనని చెప్పారు. ఎవరైనా అలా తరలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అక్రమ రవాణాకు ఉపయోగించే వాహనాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవటంతో పాటు నిందితులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. - శ్రీనివాస్, తహశీల్దార్ -
రచ్చబండ కార్డులకు కిరోసిన్ ఏదీ ?
గుడివాడ, న్యూస్‌లైన్ : రచ్చబండలో రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు రెండు నెలలైనా నీలి కిరోసిన్ అందడం లేదు. తెల్ల కార్డులు ఇచ్చి తమను గాలికొదిలేశారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ కిరోసిన్ సరఫరా చేయకపోవడంతో వంట చేసుకోవడానికి, ఇంట్లో దీపాలు వెలగించుకునేందుకు సైతం వారు ఇబ్బందులు పడుతున్నారు. 59,920 మంది లబ్ధిదారులు... గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రెండేళ్ల క్రితం తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి కార్డులు అందజేశారు. జిల్లాలో 59 వేల 920 మందికి ఈ కార్డులు అందాయి. వీరందరికీ గత నెలలోనే రేషన్ సరకులు అందాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యం, డీలర్ల అలసత్వం ఫలితంగా అనేకచోట్ల కొత్త కార్డులు పొందినవారికి డిసెంబర్ రేషన్ సరకులు అందలేదు. మరికొన్నిచోట్ల లబ్ధిదారులకు కార్డులు కూడా చేరలేదని సమాచారం. జనవరిలో అన్ని రేషన్ సరకులు ఇచ్చినా డిసెంబర్, జనవరి నెలల్లో ఇవ్వాల్సిన నీలి కిరోసిన్ ఇంతవరకు రాలేదని చెబుతున్నారు. ఈ కార్డులకు జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష లీటర్లకు పైగా కిరోసిన్ ఇవ్వాల్సి ఉంది. కిరోసిన్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉం దని, ఎక్కడా ఇంతవరకు సరఫరా కాలేదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త కార్డులకు కిరోసిన్ సబ్సిడీ విడుదలైతేనే కోటా కేటాయింపులు జరుగుతాయని అధికారులు సమాధానం ఇస్తున్నారు. నిరుపేదల అవస్థలు... సబ్సిడీ కిరోసిన్ సరఫరా చేయకపోవడంతో నిరుపేదలు నానా అవస్థలు పడుతున్నారు. అసలే కరెంటు కోత తో దీపాలు వెలిగించటానికి, ఇంట్లో వంట చేసుకునేందుకు కావాల్సిన కిరోసిన్‌ను బహిరంగ మార్కెట్లో లీటరు రూ.40తో కొంటున్నామని చెబుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి కొత్త కార్డుదారులకు నీలి కిరోసిన్ అందేలా చూడాలని కోరుతున్నారు. -
పౌరసరఫరాలశాఖపై విజిలెన్స్
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలోని పౌరసరఫరాలశాఖపై విజిలెన్స్ దృష్టి సారించింది. పౌరసరఫరాలశాఖ అక్రమాల గుట్టురట్టు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మూడేళ్లుగా ఆశాఖలో అవినీతి పెరిగిపోయిందన్న ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్‌లో కదలిక వచ్చింది. పౌరసరఫరాలశాఖకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తోంది. ముఖ్యంగా బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకపోవడం, నీలి కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలడం, మండల స్టాక్పాయింట్లలో జరుగుతున్న అక్రమాలు, గ్యాస్ రీఫిల్లింగ్, ప్రైవేట్ ఉద్యోగుల పాత్ర వంటి వాటిపై లోతుగా విజిలెన్స్ విచారిస్తున్నట్టు తెలిసింది. చౌక దుకాణాల్లో బినామీల దందా... జిల్లాలో బినామీ రేషన్ డీలర్లు రాజ్యమేలుతున్నారు. వీరికి రాజకీయ, అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో డీలర్ల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నెల్లూరు నగరంలో సగానికి పైగా బినామీ రేషన్‌డీలర్లు షాపులు నడుపుతున్నట్టు తెలిసింది. దీనికి నెల్లూరు తహశీల్దార్ కార్యాలయం వేదికగా మారింది. రేషన్‌సరుకుల అలాట్మెంట్లో భారీ అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. కేటాయింపు ఇలా... జిల్లాలో మొత్తం 1872 మంది రేషన్‌డీలర్లు ఉన్నారు. వీరికి పౌరసరఫరాలశాఖ కార్యాలయం నుంచి రేషన్ సరుకుల కేటాయింపు తహశీల్దార్ కార్యాలయాలకు పంపుతారు. దీని ప్రకారం డీలర్లు మీ సేవా కేంద్రాల్లో డీడీల రూపంలో డబ్బు చెల్లిస్తారు. తమకు కేటాయించిన ప్రకారం మండల స్టాక్ పాయింట్ల వద్ద సరుకులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగడంలేదు. బినామీ డీలర్లతో తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే పౌరసరఫరాలశాఖ డిప్యూటీ తహశీల్దార్ కుమ్మక్కై కేటాయింపుల్లో మోసాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా ఏ అధికారి అటువైపు తొంగిచూడకపోవడం గమనార్హం. బినామీల కనుసన్నల్లో.. కొత్తరేషన్ కార్డుల మంజూరు, రేషన్ బియ్యం తరలింపు, ఏ షాపుకు ఎంత అలాట్మెంట్, కోత, ఏ అధికారికి ఎంత సొమ్ము ముట్టజెప్పాలనే విషయాలన్నీ బినామీ డీలర్ల కనుసన్నల్లో జరుగుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా ఏ అధికారి బినామీ డీలర్ల జోలికి వెళ్లేందుకు సాహసించరు. అలాగే గిరిజన కులస్తులు (చల్లా యానాదులు)కు సంబంధించిన వైఏపీ కార్డులను సైతం రాబట్టుకొని, కార్డులకు సంబంధించిన కోటాను కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద బినామీ డీలర్లు అక్రమాలకు అడ్డుకట్టవేయలేరా? దాడులు నిల్.. కనెక్షన్లు ఫుల్... దాడులు నిల్.. కనెక్షన్లు ఫుల్ అన్న చందంగా పౌరసరఫరాలశాఖ మారింది. జిల్లాలోని పౌరసరఫరాలశాఖలో డీఎస్‌ఓతోపాటు డీఎం, ఐదుగురు ఏఎస్ఓలు, 18 మంది సీఎస్డీటీలు పని చేస్తున్నారు. అయితే ఎక్కడా దాడులు చేసిన దాఖలాలు కనిపించవు. ఒక వేళ ఎక్కడైనా దాడులు జరిపినా వారిపై కేసులు ఉండవు. అందినకాడికి దోచుకొని అక్రమార్కులకు అండగా నిలవడం పరిపాటిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. -
నీలిరంగు కిరోసిన్‌తో ప్రాణాలకు ముప్పు
నీలిరంగు కిరోసిన్‌తో వాహనాలను నడుపడం వల్ల ప్రయాణికులు, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పండరి అన్నారు. శుక్రవారం మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద పలు వాహనాలను ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న నీలిరంగు కిరోసిన్‌తో నడుస్తున్న ప్రైవేట్ వాహనాలను ఆయన సోదా చేశారు. మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తున్న సబ్సిడీ కిరోసిన్‌ను వాహనాల్లో నింపి నడపడంవల్ల వచ్చే విష వాయువుల వల్ల ప్రజలు అనేక రకాల రోగాలబారిన పడుతున్నారన్నారు. వాహనాలు కిరోసిన్‌తో నడపడం వల్ల పర్యావరణం దెబ్బతినడంతోపాటు దానివల్ల వచ్చే కార్బన్ మోనాక్సైడ్ వల్ల వివిధ రకాల జబ్బులు వస్తున్నాయన్నారు. కిరోసిన్‌తో నడుస్తున్న వాహనాల ఆటకట్టించేందుకు తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని పండరి తెలిపారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేసి కిరోసిన్‌తో నడుపుతున్న వాటిని సీజ్ చేశారు.