నీలి కిరోసిన్ కేరాఫ్బ్లాక్ మార్కెట్ | Blue kerosene keraphblak market | Sakshi
Sakshi News home page

నీలి కిరోసిన్ కేరాఫ్బ్లాక్ మార్కెట్

Published Tue, Jan 21 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

నీలి కిరోసిన్ కేరాఫ్బ్లాక్ మార్కెట్

నీలి కిరోసిన్ కేరాఫ్బ్లాక్ మార్కెట్

  • చల్లపల్లి కేంద్రంగా అక్రమాల జోరు
  •  గిలకలదిండికి తరలింపు?
  •  గుట్టుచప్పుడు కాకుండా నిర్వహణ
  •  
    చల్లపల్లి రూరల్, న్యూస్‌లైన్ : చౌక దుకాణాల్లో తెల్ల రేషన్ కార్డుదారులకు సరఫరా చేయాల్సిన సబ్సిడీ నీలి కిరోసిన్ మచిలీపట్నం పరిధిలోని గిలకలదిండి గ్రామానికి అక్రమంగా తరలిపోతోంది. ఈ వ్యవహారం చల్లపల్లి పరిసర మండలాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రతినెలా రేషన్ డీలర్లు కట్టిన డీడీలను బట్టి సరకుల కోటా కేటాయింపులు జరుగుతాయి. డీలర్లకు చేరకముందే నీలి కిరోసిన్ నల్ల బజారుకు తరలిపోతోందనేది బహిరంగ రహస్యమని పలువురు ఆరోపిస్తున్నారు.
     
     కార్డుదారులకు కొర్రీ...
     రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులు కిరోసిన్‌ను పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నారు. ప్రతి నెలా సరఫరా చేయాల్సిన కిరోసిన్ ఒకేసారి ఒకే మొత్తంగా చేరటం లేదని, అందుకే అందరికీ ఒకేసారి కిరోసిన్ ఇవ్వలేకపోతున్నామని డీలర్లు చెపుతున్నారు. ఫలితంగా రికార్డులు పక్కనపెట్టి చూస్తే నెలనెలా కిరోసిన్ పోయించుకుంటున్న కార్డుదారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. అసలు కిరోసిన్ వచ్చిందో లేదో.. ఎప్పుడిస్తారో కూడా తెలియని అయోమయంలో ఉన్నామని కొందరు కార్డుదారులు చెబుతున్నారు. కిరోసిన్‌ను రెండు విడతలుగా రేషన్ షాపులకు తరలించటం వెనుక పెద్ద ఎత్తుగడే ఉన్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి నెలా ఇలాగే జరుగుతున్నా అధికారులు మాత్రం ఏంచేస్తున్నారో అర్థంకావటం లేదని వారి పనితీరుపై పెదవి విరుస్తున్నారు. ప్రతినెలా ఒకేసారి అందరికీ కిరోసిన్ అందేలా సరిపడినంత కోటాను రేషన్ దుకాణాలకు సరఫరా చేయాలని కోరుతున్నారు.
     
    నిరంతర తనిఖీలతోనే అడ్డుకట్ట...
     నిరంతర తనిఖీలతోనే అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందనేది కార్డుదారుల అభిప్రాయం.
     
     గతంలో బందరు ఆర్డీవోగా పనిచేసిన కట్టా హైమావతి గిలకిలదిండిలోని చేపల వేటకు ఉపయోగించే బోట్లపై దాడిచేసి పెద్ద ఎత్తున నీలి కిరోసిన్ నిల్వలను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది.
     
     అంతేగాక రేషన్ దుకాణాలపై కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ వాటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.
     
      ప్రస్తుత ఆర్డీవో కూడా మరోసారి ధైర్యం చేసి గిలకలదిండిలో తనిఖీలు చేస్తే నీలికిరోసిన్ మాఫియా భాగోతం గుట్టు రట్టవుతుందని పలువురు పేర్కొంటున్నారు.
     
     తరలిపోతోంది ఇలా...
     సేకరించిన నీలికిరోసిన్ మొత్తాన్ని రహస్య ప్రదేశానికి చేరుస్తారు.
     
     అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న వాహనంపై రాత్రి సమయాల్లో తరలిస్తారు.
     
     ఎక్కువగా శనివారం రాత్రివేళ ఈ వ్యవహారాన్ని యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తారు.
     
     తొలుత కిరోసిన్‌ను పీపాల్లో నింపి వాహనంలో ఎక్కించి అవి బయటకు కనిపించకుండా నల్లతెరలు కప్పుతారు.
     
     వాహనం బయలుదేరగానే ఓ వ్యక్తి మోటారు బైక్‌పై ముందు వెళ్లి పోలీసుల ఉనికిని గమనిస్తూ రూట్ సక్రమంగా ఉందా లేదా. అనేది పరిశీలిస్తూ వాహనాన్ని ముందుకు తీసుకువెళతాడు.
     
     కిరోసిన్ వాహనం ఊరు పొలిమేరలు దాటగానే బైక్‌పై ఉన్న వ్యక్తి వెనుదిరిగి వచ్చేస్తాడు. ఇది గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న తతంగం.
     
     ఇదే క్రమంలో ఈ నెల 18వ తేదీ శనివారం రాత్రి 10 గంటలకు ట్రాలీ వాహనం చల్లపల్లి అగ్రహారంలోని సీఐ దుర్గారావు నివాసం ఉండే ఇంటికి కొంతదూరంలో ఉన్న చీకటి ప్రదేశం నుంచి ప్రధాన రోడ్డువైపు ఒక్కసారిగా దూసుకొచ్చింది.
     
     అప్పటికే రోడ్డుపై కాపలా కాస్తున్న మరో వ్యక్తి వాహనం ఎక్కాడు.
     
     వెంటనే అది శివాలయం ముందునుంచి వేగంగా మచిలీపట్నం వైపుకు దూసుకుపోయింది. బైక్‌పై ఓ వ్యక్తి కిరోసిన్‌తో తరలిపోతున్న వాహనానికి ముందు వెళ్లాడు. లక్ష్మీపురం పొలిమేర దాటగానే వెనుదిరిగి వచ్చేశాడు.
     
     బయటికి తరలిస్తే నిబంధనల ఉల్లంఘనే
     చల్లపల్లి మండలంలోని డీలర్లకు బందర్ రోడ్డులోని రావి వీరరాఘవయ్య అండ్ సన్స్ ద్వారా అగ్రహారంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వెనుక ఉన్న స్టాక్ పాయింట్ నుంచి నీలి కిరోసిన్‌ను సరఫరా చేస్తారని తహశీల్దార్ ముత్యాల శ్రీనివాస్ తెలిపారు.  చల్లపల్లి మండలానికి చెందిన కోటా కిరోసిన్‌ను పక్క ప్రాంతాలకు తరలించకూడదని నిబంధన ఉన్నట్లు వివరించారు. అలాకాక బయటి ప్రాంతాలకు తరలిస్తే నిబంధనలను ఉల్లంఘించినట్లేనని చెప్పారు. ఎవరైనా అలా తరలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అక్రమ రవాణాకు ఉపయోగించే వాహనాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవటంతో పాటు నిందితులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
     - శ్రీనివాస్, తహశీల్దార్
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement