నీలిరంగు కిరోసిన్‌తో ప్రాణాలకు ముప్పు
నీలిరంగు కిరోసిన్‌తో వాహనాలను నడుపడం వల్ల ప్రయాణికులు, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని జిల్లా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి పండరి అన్నారు. శుక్రవారం మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద పలు వాహనాలను ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న నీలిరంగు కిరోసిన్‌తో నడుస్తున్న ప్రైవేట్ వాహనాలను ఆయన సోదా చేశారు.
మార్కెట్‌లో తక్కువ ధరకు లభిస్తున్న సబ్సిడీ కిరోసిన్‌ను వాహనాల్లో నింపి నడపడంవల్ల వచ్చే విష వాయువుల వల్ల ప్రజలు అనేక రకాల రోగాలబారిన పడుతున్నారన్నారు. వాహనాలు కిరోసిన్‌తో నడపడం వల్ల పర్యావరణం దెబ్బతినడంతోపాటు దానివల్ల వచ్చే కార్బన్ మోనాక్సైడ్ వల్ల వివిధ రకాల జబ్బులు వస్తున్నాయన్నారు. కిరోసిన్‌తో నడుస్తున్న వాహనాల ఆటకట్టించేందుకు తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని పండరి తెలిపారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేసి కిరోసిన్‌తో నడుపుతున్న వాటిని సీజ్ చేశారు.