దారి దోపిడీ! | To exploit! | Sakshi
Sakshi News home page

దారి దోపిడీ!

Published Thu, Dec 11 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

దారి దోపిడీ!

దారి దోపిడీ!

సాక్షి, కర్నూలు : ప్రజల ఆకలి తీర్చడం కనీస బాధ్యతన్న యోచనతో ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం, రాయితీపై చౌక దుకాణాల ద్వారా నీలి కిరోసిన్ పంపిణీ చేస్తోంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. బియ్యం, కిరోసిన్ అక్రమార్కుల పరమవుతోంది. చౌక బియ్యాన్ని మరింత పాలిష్ పట్టించి రూపాయికి పదింతల అక్రమార్జనకు పాల్పడుతూ పేదల కడుపుకొడుతున్నా.. డీలరు, దళారి ఒక్కటై అసలు కార్డుదారులకు కిరోసిన్ ఇవ్వకుండా కాజేస్తున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
 అక్రమానికి బీజం..
 
 జిల్లాలో రాయితీపై ఇచ్చే కిరోసిన్ 24 లక్షల లీటర్లు కాగా, అందులో సగం పక్కదారి పడుతోంది. ఎలా అంటే కిరోసిన్ పొందుతున్న వారిలో అధికశాతం మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పేరుకు తెల్లకార్డులు ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కిరోసిన్ తెచ్చుకునేవారి సంఖ్య తక్కువ. ఇక పట్టణ ప్రాంతాల్లో కొందరు ధనవంతులకు తెల్లకార్డులు ఉన్నాయి. ఇలాంటి వారు తమ బిడ్డల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, వైద్య సేవలకు మాత్రమే తెల్లకార్డును వినియోగించుకుంటున్నారు. కిరోసిన్‌ను తెచ్చుకోవడంలేదు. ఈ పరిస్థితే డీలర్లకు కలిసొస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురు డబ్బులిచ్చి నోళ్లు మూయించడం.. అధికారులు దాడి చేస్తే రాజకీయ సిఫారసులతో వారి చేతులు కట్టేయడం జరుగుతోంది.
 
 బ్లాక్ మార్కెట్‌లో
 లీటర్ కిరోసిన్ రూ. 45
 జిల్లాలోని డీలర్లు ప్రతి నెలా 14, 15 తేదీల్లో కిరోసిన్‌కు డీడీలు కడతారు. తర్వాత హోల్‌సేల్ డీలరు 15వ తేదీ నుంచి చౌక దుకాణాలకు కిరోసిన్ చేరవేయాలి. దానిని డీలరు 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ కార్డుదారులకు పంపిణీ చేయాలి. గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారుడికి లీటరు, లేనివారికి రెండు లీటర్ల చొప్పున ఇస్తారు. ప్రభుత్వం డీలరుకు లీటరు రూ. 14.75కు సరఫరా చేస్తే, లబ్ధిదారుడికి రూ. 15కు అందజేస్తారు. అయితే డీలరు పూర్తి స్థాయిలో కేటాయింపులకు డీడీలు తీయకుండా.. సగానికి తీసి, మిగతాది పూర్తి కిరోసిన్ అందించే సమయంలో కడతామంటూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బోగస్ కార్డులు, బినామీ కార్డులు, కిరోసిన్ వాడని కార్డుల ద్వారా మిగుల్చుకున్న కిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌లో రూ. 45కు అమ్ముకుంటున్నారు. అదీ కొందరు హోల్‌సేల్ డీలర్లకే. ఇటీవల.. పట్టుపడడం పరిస్థితికి అద్దం పడుతోంది.
 
 కొందరు కార్డుదారుల కక్కుర్తి..
 కర్నూలు నగరంతోపాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో ధనవంతులకూ తెల్లకార్డులు ఉన్నాయి. వాటిని వైద్యానికి, బోధనా చెల్లింపులకు వినియోగించుకుంటూ కిరోసిన్‌ను డీలరుకే రూ. 25కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా బ్లాక్‌మార్కెట్‌కు తరలించిన కిరోసిన్‌ను కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ బంకుల్లో కలిపి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
 దారి మళ్లుతున్న బియ్యం..
 ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోంది. పౌరసరఫరాల శాఖలో పర్యవేక్షణ కొరవడడంతో ఎవరిష్టం వారిదన్నట్లు ఇష్టారాజ్యంగా రూపాయి బియ్యంను దారి మళ్లిస్తున్నారు. జిల్లాలో 17 ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి నెలకు 17 వేల టన్నుల బియ్యం 2,411 చౌక దుకాణాలకు తరలిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఆ తర్వాత బియ్యం దారి మళ్లుతున్నాయి. నంద్యాల, నందికొట్కూరు, ఆదోని, కర్నూలు, ఆలూరు ప్రాంతాల నుంచి అలా అక్రమంగా తరిలించిన బియ్యానికి కల్లూరు, కర్నూలు శివారులు అనధికారిక గోదాములుగా మారాయి. ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా సేకరించిన బియ్యానికి కర్నూలుకు చెందిన కొందరు వ్యాపారులు కల్లూరు శివారు ప్రాంతాల్లోని రోడ్డు వెంట కొన్ని ప్రాంతాల్లో, కల్లూరులోని కొన్ని గోదాముల్లో నిల్వ ఉంచుతారు.
 
 ఈ బియ్యంను వ్యాపారులు డీలరు నుంచి రూ. ఐదుకు కొనుగోలు చేసి, ఇతరులకు రూ. 10కి విక్రయిస్తారు. వాటిని లారీల్లో కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు తరలిస్తారు. ఒక్క కర్నూలు, నందికొట్కూరు, ఆదోని, కల్లూరు ప్రాంతాల్లోనే ఇలా వ్యాపారులు చేసే వారు 50 మంది ఉండగా.. ఒక్క కర్నూలు ప్రాంతంలోనే చౌక బియ్యం వ్యాపారం చేసే దళారులు 20 మంది వరకూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా అన్‌లైన్ ప్రజాపంపిణీకి అధికారులు శ్రీకారం చుడతామంటున్నారు. అప్పుడైనా ప్రజా పంపిణీలో అవకతవకలకు తావుండదా అన్నది వేచి చూడాల్సిందే.
 
 రూట్ అధికారి లేకుండానే..
 ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి చౌక దుకాణానికి బియ్యం, కిరోసిన్ తీసుకెళ్లే సమయంలో వాహనం వెంట ఓ రూట్ అధికారి ఉండాలి. ఈ ప్రక్రియ పకడ్బందీగా అమలు జరగడం లేదు. దాంతో డీలరు, అక్రమ వ్యాపారులు, అధికారులకు ఈ వ్యాపారం భారీగానే జేబులు నింపుతోంది. ఇప్పటికైనా అక్రమ వ్యాపరులపై కన్నేసీ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసే అక్రమార్కుల భరతం పట్టాల్సిన అవసరం ఉంది.
 
 ఏడాదిలో 150కుపైగా 6ఏ కేసులు..
 ప్రస్తుతం ఏ పట్టణంలో, ఏ మండలంలో చూసినా హోటళ్లలో దోసెలు, ఇడ్లీలకు వినియోగించేది కిలో రూపాయి బియ్యమే. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, డోన్, నందికొట్కూరు ప్రాంతాల్లో అల్పాహార దుకాణాల వద్ద అడిగితే రేషన్ బియ్యమేనని బహిరంగంగా చెప్పేస్తారు. ఏడాదిలో జిల్లాలో 150కుపైగా 6ఏ కేసులు నమోదయ్యాయి.
 మాటలతో సరి..
 జిల్లా పౌరసరఫరాల అధికారి కిరోసిన్.. కిలో రూపాయి బియ్యంను అడ్డదారిన బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఏడాది చౌక బియ్యం, కిరోసిన్‌కు సంబంధించి 6ఏ కేసులు 150 వరకూ పెట్టామని చెప్పారు. కానీ.. అక్రమార్కులు యథేచ్ఛగా తమ పనిని తాము కానిచ్చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement