విలపిస్తున్న గ్రీష్మ, తల్లిదండ్రులు, బంధువులు
పాతపోస్టాఫీసు (విశాఖ): విషాదం వెల్లువైంది. కన్నీరు కాలువకట్టింది. ఎల్జీ పాలిమర్స్ సంఘటనలో మృతుల భౌతిక దేహాలను మార్చురీ వద్ద చూసిన బంధువుల ఆక్రందనలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. ఘటనలో మృతి చెందిన మెడికో మృతదేహాన్ని గురువారం అప్పగించారు. మిగిలిన 10 మంది మృతదేహాలకు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి వైద్యాధికారులు మృతదేహాలను వారివారి బంధువులకు అప్పగించారు. మృతుల కుటుంబాలకు చెందినవారి ఆర్తనాదాలు, శోకాలతో పోస్టుమార్టం పరిసరాలు ప్రతిధ్వనించాయి. తమ వారి మృతదేహాల కోసం ఉదయం నుంచి పోస్టుమార్టం వద్ద బంధువులు పడిగాపులు పడ్డారు. కడసారి చూసుకుందామని కన్నీళ్లతో ఎదురుచూశారు. మృతదేహాలను చూసి గగ్గోలు పెట్టారు.
♦ నాగులాపల్లి గ్రీష్మ (9) మృతదేహాన్ని చూసి తల్లి ఎలుగెత్తి శోకించింది. కూతురు బాగుందని చెప్పి చివరికి శవాన్ని అప్పగించారా అంటూ అమె కన్నీళ్లు పెట్టుకుంది. గ్రీష్మ అన్న పార్ధు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.
♦ గండిబోయిన కుందన శ్రియ (6) మృతదేహాన్ని చూసి తల్లి శోభ స్పృహ కోల్పోయింది. ఆమె అన్న శ్రీకర్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.
♦ నేమర్తి నాని (30) కూలిపనులు చేసేవాడు. అతడి భార్య లక్ష్మి మార్చురీ వద్ద రోదించడంతో అందరి కళ్లు చెమర్చాయి. నాని తల్లి అప్పలనర్సమ్మకు విషయం తెలియకుండా బంధువులు జాగ్రత్త పడ్డారు.
♦ మృతురాలు రావాడ నారాయణమ్మ (45) భర్త సత్యవంతుడు విజయనగరం జిల్లా కల్లేపల్లిలో వ్యవసాయకూలీ. లాక్‌డౌన్ వల్ల అక్కడే ఉండిపోవడంతో మృతదేహాన్ని బంధువులు తీసుకెళ్లారు.
♦ శివకోటి గోవిందరాజులు (33) పాలిమర్స్ కంపెనీలోనే కార్పెంటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు వచ్చారు.
♦ ఎండోమెంట్‌లో రిటైర్డ్ ఈవో మేకా కృష్ణమూర్తి (73) మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అతడి అల్లుళ్లు వచ్చారు.
♦ మరణించిన యలమంచిలి అప్పలనర్సమ్మ (45)కు భర్త పైడిరాజు, కుమారులు వెంకటేష్, రమేష్ ఉన్నారు. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
♦ నూతిలో పడి చనిపోయిన సిహెచ్.గంగరాజు (40) భవన నిర్మాణ కార్మికుడు. భార్య నాగమణి, ఇద్దరు పిల్లలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
సోదరుడు సన్యాసిరావు అన్న మృతదేహాన్ని తీసుకువెళ్లాడు.
♦ మృతుడు పిట్టా శంకరరావు (46) భవననిర్మాణ కార్మికుడు. బంధువులు మృతదేహాన్ని తీసుకువెళ్లారు.
♦ దుర్ఘటనలో మరణించిన అన్నెపు చంద్రమౌళి (19) వైద్య విద్యార్థి. గురువారం రాత్రి పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని శ్రీకాకుళం తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment