ఇక పోస్టల్ ఏటీఎం సెంటర్లు
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ :
సాంకేతిక పరిజ్ఞానాన్ని తపాలా శాఖ అందిపుచ్చుకుంటోంది. ఇప్పటివరకు బ్యాంకులకే పరిమితమైన ఏటీఎం సెంటర్లను పోస్టాఫీసుల్లోనూ నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సేవింగ్స్ బ్యాంకు(ఎస్‌బీ) ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాలలో హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. తొలుత ఈ పోస్టాపీసుల్లో ఏటీఎం సెంటర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఇన్ఫోసిస్ కంపెనీ, ఇంజినీర్ల బృందం ఇటీవల ఆదిలాబాద్, మంచిర్యాల కార్యాలయాలను సందర్శించింది. వచ్చే ఏడాది మార్చిలోపు పోస్టల్ ఏటీఎంలను నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆ తర్వాత జిల్లాలోని పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు న్యూ ఢిల్లీలోని తపాలా శాఖ కేంద్ర కార్యాలయం కార్యదర్శి కమల గోపినాథ్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
2లక్షల మంది ఎస్‌బీ ఖాతాదారులు..
జిల్లాలో 2లక్షల మంది సేవింగ్ బ్యాంక్ ఖాతాదారులు ఉన్నారు. వీరు ఖాతాల్లో ఎప్పుడైనా న గదు వేసుకోవచ్చు. అవసరాన్నిబట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఆదిలాబాద్ హెడ్ పోస్టాఫీసు ప రిధిలో లక్షా 20వేల మంది,మంచిర్యాల హెడ్‌పోస్టాఫీసు పరిధిలో 80వేల మంది వరకు ఎస్‌బీ ఖాతాదారులు ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ రెండింటి పరిధిలో 63 సబ్ పోస్టాఫీసులు, 451 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉన్నాయి.
ఖాతాల పరిశీలన మొదలు..
ఏటీఎం సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవాలంటే ప్రాథమికంగా హెడ్‌పోస్టాఫీసు పరిధిలో ఉన్న ఎస్‌బీ ఖాతాలను పరిశీలించి వాటి వివరాలను కంప్యూటర్‌లో పొందుపర్చాలి. ఆ దిశగా హెడ్ పోస్టాఫీసు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా జిల్లాలోని సబ్ పోస్టాఫీసులు తమ కార్యాలయ పరిధిలోని ఖాతాలను తాజాగా లావాదేవీలు జరుపుతున్నట్లు ధ్రువీకరిస్తారు. ఆయా సబ్‌పోస్టాఫీసుల పరిధిలోని బ్రాంచ్ పోస్టాఫీసులకు కూడా ఉన్న ఎస్‌బీ అకౌంట్లను సైతం పరిశీలించి సర్టిఫై చేస్తున్నారు. త్వరలోనే పోస్టు ఖాతాదారులకు ఏటీఎం సౌకర్యం అందుబాటులోకి రానుంది. గంటల తరబడి పోస్టాఫీసుల్లో నిలబడే అవసరం లేకుండా పోతుంది.
మెరుగైన సేవలు..
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో తపాలా శాఖ జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాలలో పోస్టల్ ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది. ఇందు కోసం సర్వే కూడా పూర్తయ్యింది. జిల్లాలోని 2 లక్షల మంది ఎస్‌బీ ఖాతాదారులకు ఈ సౌకర్యం అందుబాటులో రానుంది.
- జె.పండరి,
పోస్టల్ సూపరింటెండెంట్, ఆదిలాబాద్