పోస్టల్ అధికారుల తీరును తప్పుపట్టిన హైకోర్టు
అసమంజస కారణాలతో చెల్లింపు నిరాకరణ సరికాదని వ్యాఖ్య
20 ఏళ్లుగా పోరాటం చేస్తున్న బాధితురాలికి ఊరట
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గందరగోళ పథకాలు పెట్టడమే కాకుండా, ఖాతాదారులు పెట్టుబడిగా పెట్టే మొత్తాలను అర్థంలేని కారణాలతో తిరిగి చెల్లింపునకు నిరాకరించడం సరికాదని హైకోర్టు తప్పుపట్టింది. తపాలా శాఖ ఇచ్చిన ఐవీపీ డాక్యుమెంట్ డబ్బు తిరిగి పొందేటప్పుడు ఆధారంగా చూపేందుకేనని, అంతేతప్ప ఒకవేళ అది కనిపించకుండా పోతే ఏంచేయాలనేదీ ప్రత్యామ్నాయం చూపకుండా ఏళ్ల తరబడి వేధిం చడం సరికాదని అభిప్రాయపడింది. ప్రత్యామ్నాయాలు చూపకుండా రూపొందించే ఇలాంటి పథకాలు రాజ్యాంగం ప్రకారం అహేతుకమైనవి స్పష్టం చేసింది.
భర్త పొదుపు చేసిన మొత్తాన్ని ఐవీపీ డాక్యుమెంట్ లేక ఏళ్ల తరబడి తిరిగి పొందలేకపోయిన బాధితురాలికి ఆ సొమ్మును చెల్లించాలని చీరాల హెడ్ పోస్ట్‌మాస్టర్‌ను ఆదేశించింది. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఓలేటి సుబ్బారావు ఎల్‌ఐసీ ఏజెంట్. 1991లో మైనరైన తన కుమారుడు వెంకటమారుతి కార్తీక్ పేరు మీద రూ.18వేలకు ఇందిరా వికాస్ పత్రాలు (ఐవీపీ) కొన్నారు. వాటిపై ఐదేళ్లకు రూ. 36 వేలు తపాలాశాఖ చెల్లించాల్సి ఉంది. అయితే 1993లో సుబ్బారావు మృతి చెందారు. అతని డైరీలో ఐవీపీల వివరాలు ఉండటంతో భార్య సత్యఫణివర్ధిని ఆ పత్రాల కోసం వెతికారు.
అవి కనిపించకపోవడంతో డైరీలో ఉన్న ఐవీపీ నంబర్ల ఆధారంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని చీరాల హెడ్ పోస్ట్‌మాస్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ నంబర్ల ఆధారంగా డబ్బు ఇవ్వలేమని, ఓరిజినల్ ఐవీపీలు తెస్తేనే మెచ్యూరిటీ మొత్తం ఇస్తామని పోస్టల్ అధికారులు చెప్పారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈమెకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినా తపాలా అధికారులు అప్పీల్ వేశారు.మెచ్యూరిటీ మొత్తం కోసం దశాబ్ద కాలంగా ఎవ్వరూ క్లెయిమ్ చేయకపోయినా ఆ సొమ్మును బాధితురాలికి ఇవ్వకపోవడాన్ని అప్పిలెట్ కోర్టు తపాలా అధికారులను తీరును తప్పుపట్టింది. వారి అప్పీల్‌ను కొట్టివేసినా 2007లో హైకోర్టులో సెకండ్ అప్పీల్ దాఖలు చేశారు.
అయితే విచారణకొచ్చేందుకు చర్యలు తీసుకోకపోవడంతో ఆ అప్పీల్ నెంబర్ కాలేదు. ఈ కేసు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ముందుకు విచారణకు వచ్చినప్పుడు.. అప్పీల్ నంబర్ కాని విషయాన్ని గమనించారు. దీంతో ఐదేళ్ల తరువాత అంటే 2013లో అప్పీల్ నంబర్ అయింది. దీనిపై పోస్టల్ అధికారుల వాదనలు విన్న జస్టిస్ నాగార్జునరెడ్డి... ఈ కేసులో వారి తీరును తప్పుపట్టారు. మానవీయ కోణంలో ఈ కేసును అర్థం చేసుకుని తీర్పు వెలువరించారు. రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న బాధితురాలిని ఇప్పటికైనా ఇబ్బంది పెట్టడం మాని, ఆమెకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు.
ఐవీపీ అసలు పత్రాల్లేకుంటే డబ్బు ఇవ్వరా?
Published Sun, Apr 13 2014 2:43 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement