రాత్రంతా ఉద్రిక్తత | Postpartum Sharda Relatives concern IN Hospital | Sakshi
Sakshi News home page

రాత్రంతా ఉద్రిక్తత

Published Mon, Jun 16 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

రాత్రంతా ఉద్రిక్తత

రాత్రంతా ఉద్రిక్తత

పార్వతీపురం టౌన్ :ప్రసవానంతరం గర్భసంచి ముడుచుకోకపోవడం వల్ల మృత్యువాత పడిన పైల శారద(28)బంధువులు చేపట్టిన ఆందోళన కారణంగా స్థానిక జయశ్రీ హాస్పిటల్ వద్ద వేకువజాము వరకూ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డాక్టర్ వై.వి.పద్మజ నిర్లక్ష్యం కారణంగానే పైల శారద(28) మృత్యువాత పడిందని ఆరోపిస్తూ మండలంలోని పెదమరికి గ్రామానికి చెందిన ప్రజలు శనివారం రాత్రి ఆ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వారంతా మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద ఉంచి రాత్రంతా ఆందోళన కొనసాగించారు. సంబంధిత వైద్యురాలిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని వారు పట్టుబట్టారు.
 
 ఊరు ఊరంతా ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. రహదారిపై ధర్నా చేపట్టారు. ఆస్పత్రిలో ఫర్నిచర్, మందులను రోడ్డుపై పడేసి ధ్వంసం చేశారు. ఒకానొక దశలో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పట్టణ ఎస్సైలు వి.అశోక్ కుమార్, బి.సురేంద్రనాయుడు, సాలూరు సీఐ జి.దేవుళ్లు, గరుగుబిల్లి, కొమరాడ, రామభద్రపురం, పార్వతీపురం రూరల్ తదితర ప్రాంతాలకు చెందిన ఎస్సైలు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఒకానొక సమయంలో పోలీసులకు, బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
 
 వందలాదిమంది ఆస్పత్రిలోకి దూసుకుపోయేందుకు యత్నిం చారు. బాధితుల అరుపులు, నినాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. విషయం తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, టీడీపీ నాయకుడు ద్వారపురెడ్డి జగదీష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలతో చర్చలు జరిపారు. చివరకు రాత్రి 3 గంటల ప్రాంతంలో(సోమవారం వేకువజామున) ఇరువర్గాల మధ్య చర్చలు కొలిక్కిరావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనలో పలువురికి గాజుపెంకులు తగిలి గాయాలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement