సాక్షి, నెల్లూరు: నగరంలోని బాలాజీనగర్‌కు చెందిన నారాయణ ఏసీ కూరగాయల మార్కెట్‌కు వెళ్లి కిలో రూ.50తో రెండు కిలోల టమోటాలు కొన్నాడు. ఇంటికి వచ్చి కాటాలో పెట్టి చూడగా ఒకటిన్నర కిలో మాత్రమే ఉన్నాయి. తూకంలో అర కిలో తగ్గినట్టు గుర్తించాడు. అతను అక్షరాలా రూ.25 నష్టపోయాడు.
వేదాయపాళేనికి చెందిన చెన్నారెడ్డి నగరంలోని డైకస్‌రోడ్డులోని చేపల మార్కెట్‌కు వెళ్లి రూ.300 చెల్లించి రెండు కిలోల చేపలు కొన్నాడు. ఇంటికి వచ్చి తూకం వేయగా ఒకటిన్నర కిలో మాత్రమే వచ్చాయి. అతను రూ.75 నష్టపోయాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలోని 1.29 లక్షల కుటుంబాల వారే కాదు జిల్లావ్యాప్తంగా లక్షలాది కుటుంబీకులు నిత్యం నిత్యావసర సరుకులు కొంటూ కొలతల్లో మోసాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నష్టం ఏ ఒక్కరోజుకో పరి మితం కాదు. ప్రతిరోజూ ప్రతి కుటుం బం తూనికలు కొలతల మోసాల బారిన పడుతోంది. తీవ్రంగా నష్టపోతోంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా రోజూ రూ.కోట్లలోనే వినియోగదారులు నష్టపోతున్నట్టు అంచనా. తూనికలు కొలతలశాఖ అధికారులు నామమాత్రపు స్పందనతో సరిపెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలను అరికట్టే దమ్ము అధికారులకు ఉందా అని జనం ప్రశ్నిస్తున్నారు.
అక్రమాలకు అడ్డేలేదు:
నగరంలో డైకస్‌రోడ్డు జలపుష్ప చేపలమార్కెట్, సంతపేట మార్కెట్, నగరం నడిబొడ్డున ఉన్న ఏసీ కూరగాయల మార్కెట్, స్టోన్‌హౌస్‌పేట, పప్పులవీధి మార్కెట్, ట్రంకురోడ్డు తదితర ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల తూకాలు, కూరగాయలు, చేపల తూకాలతో పాటు బాలాజీనగర్, ఆత్మకూరు బస్టాండ్, హరనాథపురం, ఫతేఖాన్‌పేట, పొదలకూరురోడ్డు పద్మావతి సెంటర్, వేదాయిపాళెం తదితర ప్రాంతాల్లోని తోపుడుబండ్ల వ్యాపారస్తులు సైతం తప్పుడు తూకాలతో వినియోగదారులను నిత్యం మోసగిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఒకవేళ వినియోగదారులు కాటాలో మోసాలు గుర్తించి నిలదీసినా వ్యాపారులు లెక్కచేయక బాధితులపైనే దౌర్జ్యన్యాలకు దిగుతున్న సందర్భాలనేకం.
మోసాలు ఇలా?
తూకాలకు ఎలక్ట్రానిక్ కాటాలు, బద్దకాటాలు, స్కేల్‌కాటాలుంటాయి.
ఎలక్ట్రానిక్ కాటా వినియోగంలో టేర్ బటన్ కీలకం. వ్యాపారులు వినియోగదారులకు వస్తువులు కాటా వేసేటప్పుడు వస్తువులు ఉంచే గిన్నెను కాటాపై పెట్టి టేర్ బటన్ ప్రెస్ చేస్తే అది జీరో చూపిస్తుంది. ఆ తర్వాత వినియోగదారుడు వస్తువులు కాటా గిన్నెలో వేసే పనిపై దృష్టి పెడతాడు. ఆ సమయంలో వ్యాపారి తిరిగి టేర్ బటన్ ప్రెస్ చేస్తాడు. కాటాపై ఉంచిన గిన్నె బరువు కూడా తూకంలో కలిసి పోతుంది. వినియోగదారుడు కాటాపై ఉన్న గిన్నె బరువును బట్టి 200 నుంచి 300 గ్రాముల వరకూ నష్టపోతాడు.
ఇక ఎలక్ట్రానిక్ మిషన్‌లో జీరో ఫిక్స్ చేసే విధానంలో సైతం అక్రమాలకు పాల్పడతారు.
ఇక బద్దకాటా తూకం రాళ్లలో ప్రధానంగా మోసం జరుగుతోంది. కేజీ నుం చి 2కేజీల రాళ్లను వ్యాపారులు అధికంగా వినియోగిస్తారు. వ్యాపారులు ఈ రాళ్లను కిందభాగంలో పూర్తిగా మిషన్‌తో కట్ చేస్తున్నారు. దీంతో రెండుకేజీల రాయి కేవలం ఒకటిన్నర కేజీ మాత్రమే ఉంటుంది. వస్తువులు తూచే పల్లేనికి కింద ఇనుప ముక్కలు, చింతపండు సైతం అతికించి మోసాలకు పాల్పడుతున్న సందర్భాలున్నాయి.
మొత్తంగా అటు ఎలక్ట్రానిక్ కాటాల్లోనూ, ఇటు రాళ్ల కాటాలతోనూ విని యోగదారులను వ్యాపారులు వంచిస్తున్నారు. నిత్యం ఇదే జరుగుతోంది.
పాటించాల్సిన నిబంధనలు:
ప్రతికాటాపైనా తూనికలు కొలతల శాఖ అధికారుల స్టాంప్ ఉండాలి. ప్రతి ఏడాదికొకసారి దీనిని రెన్యువల్ చేయించుకోవాలి. కాటా రాళ్లను ప్రతి రెండేళ్లకొకసారి తూకం వేయించుకుని పెట్టుకోవాలి. బంగారు షాపుల్లో అయితే ఏడాదికొకసారి కాటాలపై స్టాంప్ వేయించుకోవాలి.
ఇవేవీ సక్రమంగా జరగడంలేదు. నూటికి 50 శాతం మంది వ్యాపారులు కూడా నిబంధనలు పాటించడంలేదు.
ప్యాకింగ్ వస్తువుల నిబంధనలు:
ప్యాకేజీ నిబంధనల చట్టం 2011, తూనికలు,కొలతల చట్టం 2009 నిబంధనలను వ్యాపారులు అనుసరించాలి. ప్రతి వస్తువుపై ఎంఆర్‌పీ రేట్ ముద్రించి ఉండాలి. తయారీ తేదీ ఉండాలి.
కంపెనీ వివరాలు పిన్‌కోడ్‌తో సహా ముద్రించాలి. నికర బరువు ముద్రించి ఉండాలి.
కస్టమర్ కేర్ నంబర్ ఉండాలి.
పట్టించుకోని అధికారులు:
అక్రమాలు నిత్యం జరుగుతున్నా అధికారులు ఏ నెలకో,రెండు నెలలకో మొక్కుబడి తనిఖీలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. దీంతో వ్యాపారులు తమ అక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
ఉదాహరణకు చేపల మార్కెట్‌లో అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించి పదినిమిషాల్లోనే 15 ఎలక్ట్రానిక్ కాటాలను, 50 తప్పుడు తూకం రాళ్లను స్వాధీనం చేసుకున్నారు. 21 షాపులను సీజ్ చేశారు. దీన్ని బట్టిచూస్తే అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. నిత్యం దాడులు నిర్వహించడంతోపాటు అక్రమ వ్యాపారులను కఠినంగా శిక్షిస్తే తప్ప దోపిడీ ఆగే పరిస్థితి కనిపించడంలేదు.
తూకం దగా
Published Wed, Aug 6 2014 3:19 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement