పేరుకుపోతున్న పంచాయితీ బకాయిలు
విద్యుత్ శాఖకు పంచాయతీల బకాయిలు రూ. 92.49 కోట్లు
కర్నూలు(రాజ్‌విహార్) : పంచాయతీల్లోని విద్యుత్ బిల్లుల బకాయిల చెల్లింపు వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి అధికారులు సిద్ధం కాగా.. పల్లెల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు కూడా పన్నులు వేస్తామని సర్పంచులు తెగేసి చెబుతున్నారు. మేజర్, మైనర్ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన వీధి దీపాల విద్యుత్ నెల వారీ బిల్లులు చెల్లించకపోవడంతో పల్లెల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. మంగళవారం కర్నూలు డివిజన్ పరిధిలోని 12 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
జిల్లాలలో పంచాయతీల్లో విద్యుత్ బిల్లులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా మంజూరు చేయడంలేదు. 13వ ఆర్థిక సంఘం నిధులను డ్రా చేసుకొని బిల్లులను చెల్లించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే గ్రామ సర్పంచులు దీనికి అంగీకరించడం లేదు. కేంద్రం ఇచ్చే 13వ ఆర్థిక సంఘం నిధులను కరెంటు బిల్లులకు ఉపయోగించబోమని, బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం, సర్పంచుల మధ్య నలుగుతున్న ఈ సమస్య కారణంగా బకాయిలు రూ. 92.49 కోట్లకు చేరాయి. జిల్లాలోని 918 గ్రామాల్లో ఏర్పాటు చేసిన వీధి దీపాలు (స్ట్రీల్ లైట్స్), వాటర్ వర్క్ (తాగునీటి సరఫరా)కు ఇచ్చిన కనెక్షన్లకు సంబంధించిన బిల్లులను పంచాయతీలే చెల్లించాలి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో నెలల తరబడి బిల్లులు బకాయిపడ్డాయి. ఉన్నతాధికారుల సూచనల మేరకు బకాయిలు ఉన్న గ్రామాల్లోని వీధి దీపాలకు సరఫరా నిలిపివేయడానికి స్థానిక అధికారులు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా మంగళవారం ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం, కోడుమూరు మండలంలోని లద్దగిరి, గోరంట్ల, కల్లూరు మండలంలోని మార్కాపురం, కొట్టాల, కర్నూలు మండలంలోని బి. తాండ్రపాడుతోపాటు సి. బెళగల్ మండలంలోని ఆరు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి స్వగ్రామం లద్దగిరిలోని వీధి దీపాలకు సరఫరా నిలపివేయడంతో చీకట్లు కమ్ముకున్నాయి.
బిల్లులు చెల్లించేందుకు రెండు రోజుల గడువు
గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. దీంతో 12 గ్రామాల్లో సరఫరా నిలిపివేశాం. రెండు రోజులు గడువు ఇస్తున్నాం. వెంటనే స్పందించి విద్యుత్ బకాయిలు చెల్లించాలి. లేకపోతే బకాయిలు ఉన్న ప్రతి గ్రామానికి సరఫరా నిలిపివేస్తాం. - ఉమాపతి, డీఈ, కర్నూలు.