
తప్పు వారిది.. శిక్ష మాకా.. ?
టెక్కలి: విద్యుత్ శాఖాధికారులు చేసిన తప్పులకు గాను ఓ వినియోగదారుడు బలయ్యాడు. తమ వాడకానికి సంబంధించిన విద్యుత్ బిల్లు రావడంలేదంటూ అధికారుల చూట్టూ తిరిగినా వారు పట్టించుకోలేదు. ఇంతలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వివరాలు చూస్తే.. టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన పాత్రో కృష్ణారావు ఇంటి మీటరు నెంబర్ 145కు గాను గత ఏడాది డిసెంబర్ నుంచి విద్యుత్ బిల్లులు నిలిచిపోయాయి. రెండు నెలల వేచి చూసిన బిల్లులు రాకపోవడంతో, కృష్ణారావు కుమారుడు దేవేంద్ర అప్పటి ఏఈ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేయగా దీనికి ఫిర్యాదు అవసరం లేదు తక్షణమే బిల్లులు వచ్చినట్లు చర్యలు తీసుకుంటామని ఏఈ చెప్పినట్లు దేవేంద్ర తెలియజేశాడు.
నెలలు తరబడి వేచి చూసినా బిల్లులు రాలేదు. మళ్లీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల విజిలెన్స్ తనిఖీల్లో దొంగతనంగా విద్యుత్ వినియోగిస్తున్నారంటూ కేసు నమోదు చేసి రూ. 1560 అపరాద రుసుం చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీనిపై ప్రస్తుత ఏఈ వెంకటరమణ దృష్టికి తీసుకువెళ్లగా అపరాద రుసుం చెల్లించి కొత్త మీటరు కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటూ సలహా ఇచ్చినట్లు దేవేంద్ర తెలిపాడు .అధికారులు చేసిన తప్పుకు మేము బలయ్యూం అంటూ వాపోయూడు. ఈ సమస్యపై విశాఖపట్టణంలో జరిగే విద్యుత్ గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదు చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని కోరుతామని దేవేంద్ర తెలిపాడు.