ఉచిత షాక్ | Free shock | Sakshi
Sakshi News home page

ఉచిత షాక్

Published Tue, Jul 15 2014 2:51 AM | Last Updated on Sat, Sep 15 2018 3:13 PM

ఉచిత షాక్ - Sakshi

ఉచిత షాక్

 సీతంపేట, ఎల్.ఎన్.పేట, టెక్కలి: ఇది ఒక్క సోంబాడికి ఎదురైన అనుభవం కాదు. అదే గ్రామానికి చెందిన డొంబుడు, గయ్యారమ్మ, సుక్కయ్య.. అలాగే ఎల్.ఎన్.పేట, టెక్కలి మండలాల్లో అనేకమంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఇదే రీతిలో విద్యుత్ బిల్లులు అందాయి. సబ్సిడీ మొత్తాన్ని బిల్లుల్లో పేర్కొన్నా.. బిల్లు స్వీకరించేటప్పుడు దాన్ని మినహాయించకపోవడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ విషయంలో కొత్త ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఆ వర్గాల విని యోగదారులకు విద్యుత్ బిల్లులు షాకిస్తున్నాయి.
 
 విషయం ఏమిటంటే..
 గత ప్రభుత్వం 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను ప్రకటించింది. అందులో భాగంగా రాష్ట్రంలో దళితవాడు, గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలు వినియోగించే విద్యుత్‌లో నెలకు 50 యూనిట్ల వరకు ఉచితమని పేర్కొన్నారు. అంతకుమించి వాడితే దానికి మాత్రమే వినియోగదారులు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 50 యూనిట్ల వరకు బిల్లు మొత్తాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ట్రాన్స్‌కోకు చెల్లిస్తుంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఘనంగా ప్రకటించిన ఈ పథకానికి గత 14 నెలలుగా ప్రభుత్వం సబ్సిడీ చెల్లించలేదు.
 
 ఈలోగా ఈ ఏడాది ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు, అదే సమయంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు రెండు నెలల వినియోగానికి సంబంధించి బిల్లులు సిద్ధం చేశారు. వాటిలో సబ్సిడీ మొత్తాలను కూడా పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే బిల్లులు వసూలు చేయాలని భావించారు. అయితే ఊహించని విధంగా ఈ పథకం కింద లబ్ధి పొందేవారు ఎస్సీ, ఎస్టీలని నిర్థారించే ధ్రువీకరణ పత్రాలు స్వీకరించాలని ఆదేశించింది. దీంతో అధికారులు ప్రస్తుతానికి ఈ రెండు నెలల బిల్లులు సబ్సిడీ లేకుండానే వసూలు చేయాలని నిర్ణయించారు. ఆ బిల్లులను వినియోగదారులకు అందజేస్తున్నారు. వాటిలో సబ్సిడీ మొత్తాలు పేర్కొన్నా.
 
 బిల్లు మొత్తం చెల్లించాల్సిందేనని విద్యుత్ సిబ్బంది స్పష్టం చేస్తుండటంతో వినియోగదారులు షాక్ తింటున్నారు. ఇదేమిటని కొందరు నిలదీస్తున్నారు. అయినా తామేం చేయలేమని అధికారులు చేతులెత్తేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. సబ్సిడీ ఉంటుందన్న ధీమాతో ఇన్నాళ్లూ ఉన్నామని, ఇప్పుడు ఉన్న పళంగా సబ్సిడీ మొత్తంతో కలిపి రెండు నెలల బిల్లు ఒకేసారి చెల్లించమంటే ఎక్కడి నుంచి తేవాలని పేదవర్గాలకు చెందిన వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పుడూ కట్టనంత మొత్తం.. పలువురు రూ.500 నుంచి రూ.800 వరకు వచ్చిందని ఎల్.ఎన్.పేట మండలం గోలుకుప్ప గ్రామానికి చెందిన బిడ్డిక రాజారావు, పాలక చంద్రరావు, బిడ్డిక శ్రీరాములుతో పాటు మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 జిల్లాలో రూ.6 కోట్ల పైనే బకాయి
 కాగా ఎస్సీ, ఎస్టీలకు ఉప ప్రణాళిక పరిధిలో జిల్లాలో 27,117 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి సంబంధించి సబ్సిడీ రూపంలో రూ.6.33 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. 14 నెలలుగా ఒక్క పైసా అయినా అందకపోవడంతో ఇక ఉచిత విద్యుత్ సబ్సిడీ ఉండదేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement