సిద్దిపేట, న్యూస్‌లైన్: ఏ యంత్రం పనిచేయాలన్నా కరెంటు చాలా ముఖ్యం. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ, అధికారులకు ఈ మాత్రం ఆలోచన కూడా లేకపోయింది. దీంతో సిద్దిపేటలోని భూసార పరీక్షా కేంద్రం సేవలందించలేక నిస్సారంగా మారింది. అందులో పరికరాలన్నీ ఉండీ, పరీక్షలు చేసే అధికారి ఉన్నప్పటికీ కరెంటు లేని కారణంగా మట్టి నమూనా పొట్లాలు మూలనపడ్డాయి. ఉపకరణాలు దుమ్ముబారాయి. జిల్లాలో సంగారెడ్డి, మెదక్‌తోపాటు సిద్దిపేట మార్కెట్ కమిటీ ప్రాంగణం(ఏఎంసీ)లో సాయిల్ టెస్ట్ ల్యాబొరెటరీ (ఎస్‌టీఎల్) ఉంది. 1982లో సిద్దిపేటలో నెలకొల్పిన ఈ కేంద్రంపట్ల అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడంతో అలంకార ప్రాయంగా మారింది.
వేతనం నుంచి కరెంటు బిల్లు కట్టిన అధికారి..
ప్రతి యేటా రూ.25 వేలు సాధారణ నిధుల్ని ఎస్‌టీఎల్‌కు ఏఎంసీ ఇచ్చేది. గత రెండేళ్లుగా ఆపేసింది. ఏడాది కిందట రూ. 1.56 లక్షల నిధులతో భవనం మరమ్మతు పనులు చేపట్టారు. ఆ డబ్బుల్లో మిగిలిన సొమ్ముతో గత మార్చిదాకా నెట్టుకొచ్చారు. తర్వాత కనీసం కరెంటు బిల్లు చెల్లించడానికైనా పైసా లేకపోవడంతో ఎస్‌టీఎల్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న వ్యవసాయాధికారిణి జి.ప్రగతి తన వేతనంలోంచి మూడు నెలలపాటు అంటే గత జూన్ వరకు కరెంటు చార్జీలు చెల్లించారు. అయినప్పటికీ నిధుల విడుదలపై యంత్రం దృష్టి సారించకపోవడంతో జూలై నుంచి భూసార పరీక్ష కేంద్రానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కేంద్రంపై తీవ్ర ప్రభావం
కరెంటు సరఫరా లేకపోవడంతో గడిచిన మూడు నెలల నుంచి సిద్దిపేటలో భూసార పరీక్షలు ఆగిపోయాయి. సెంటర్ పరిధిలో ఉన్న చిన్నకోడూరు-150, నంగునూరు-105, సిద్దిపేట-120, జగదేవపూర్-260, తొగుట-50, కొండపాక-90 కలిపి మొత్తం 775 మట్టి నమూనాలను ఈ ఏడాది జులై వరకు ఖరీఫ్ సీజన్‌కుగాను పరీక్షించి ఫలితాలను వెల్లడించారు. తర్వాత రబీకి సంబంధించి జగదేవపూర్ మండలానికి చెందిన 140 మట్టి నమూనాలు విద్యుత్ సదుపాయం లేకపోవడంతో మూలన పడ్డాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం ఖరీఫ్‌లోనూ, రబీలోనూ మట్టి నమూనాలు తెప్పించి ఇక్కడ పరీక్షిస్తారు. తేలిక, మద్యరకం, బరువు నేలలుగా భూముల స్వభావం, ఉదజని, లవణ సూచికలు, సేంద్రీయ కర్బణం, లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్ ప్రమాణాలను విశ్లేషిస్తారు. తద్వారా సేంద్రీయ ఎరువులు, తదితరాలు ఏ మోతాదులో వాడాలనేది సఫార్సు చేస్తారు. అలా 2012లో 1,942 నమూనాలను పరిశీలించి ‘సాయిల్ హెల్త్ కార్డు’లను విడుదల చేశారు.
ఉపకరణాలదీ...అదే తీరు...
ఈ సెంటర్‌లో మట్టిని పరీక్షించేందుకు స్పెక్ట్రో ఫొటోమీటర్ అందుబాటులో ఉంది. అలాగే రోటరీ షేకర్ కూడా తెప్పించారు. కానీ..ఎర్తింగ్ లేకపోవడంతో దానిని ఆన్ చేస్తే మొరాయిస్తోంది. ప్రస్తుతం దాని కండీషన్ అస్తవ్యస్తంగా ఉంది. వాస్తవానికి కొత్త యంత్రాలు సంగారెడ్డి, మెదక్ కేంద్రాలకు చేరినప్పటికీ నిధులు ఇప్పించే నాథుడే లేక సిద్దిపేటకు మాత్రం అవి దక్కలేదు.
కొంచెం చేయూతనిస్తే...
మూడు మాసాల కరెంటు బిల్లు రూ.1,500 కడితే విద్యుత్ సరఫరా ప్రస్తుతానికి పునరుద్ధరించే అవకాశం ఉంది. దాంతో తిరిగి ల్యాబ్‌లో కదలికలు మొదలవుతాయి. అలాగే అంతటా ఇస్తున్నట్లే ఏడాదికోసారి జనరల్ బడ్జెట్ ఏఎంసీ తిరిగి కేటాయించి కొంచెమైనా చేయూతనిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
ఏడీఏకు నివేదించాం
బిల్లులు చెల్లించని కారణంగా కరెంటు సౌకర్యం లేకుండా పోయింది. అందుకే మట్టి పరీక్షలు ఆగాయి. ప్రతి సంవత్సరం రూ.25 వేలు నిధులు కేటాయించే ఏఎంసీ రెండేళ్లుగా నిధులు ఇవ్వడం మానేసింది. ఇప్పటికే మూడుమార్లు ఏఎంసీని సంప్రదించాం. పరిస్థితిని ఏడీఏకు నివేదించాను.
-జి.ప్రగతి, ఏఓ, ఎస్‌టీఎల్, సిద్దిపేట
కమిషనర్ నుంచి ఉత్తర్వు వస్తేనే...
భూసార పరీక్షా కేంద్రం నిర్వహణ కోసం నిధుల విడుదలకు మా శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వు రావాలి. గతంలో సంగతి ఎలా ఉన్నా.. అనుమతి వస్తేనే మేం నిధులు విడుదల చేస్తాం. ఈ విషయాన్ని ఏఓకు తెలియజేశాం.
-సంగయ్య, ఏఎంసీ కార్యదర్శి, సిద్దిపేట
పవర్ కట్... పరీక్షలు బంద్
Published Wed, Sep 18 2013 1:03 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
Advertisement
Advertisement