బియ్యం ధరలకు విద్యుత్ షాక్
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : బియ్యానికి కరెంటు షాక్ తగిలింది. దీంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించడంతో ఆ ప్రభావం ఉత్పత్తిపై పడింది. ఉత్పత్తి తగ్గడం, మరో పక్క లెవీగా మిల్లర్లు బియ్యాన్ని ఎఫ్‌సీఐకి పంపిస్తూండటంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కరెంటు కోతల విషయంలో ప్రభుత్వం మిల్లర్లతో దోబూచులాడిన నేపధ్యంలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా రైసు మిల్లులు మూతపడిన సందర్భాలు ఉన్నాయి. తాజా పరిస్థితి చూస్తే కరెంటు సమస్య. ఎఫ్‌సీఐ లెవీ కారణాలతో గత పదిహేను రోజులుగా బియ్యం ధరలు పెరిగిపోయాయి. పరిశ్రమలకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విద్యుత్ కోత విధించారు. దీంతో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, కొన్ని సందర్భాల్లో మరో రెండు గంటలపాటు అదనంగా మిల్లులు ఆడుతున్నాయి. పగటి పూట దాదాపుగా రైసు మిల్లుల్లో బియ్యం ఆడటం లేదు. దీంతో బియ్యం ఉత్పత్తి సుమారు 50 శాతం పడిపోయింది.
ఆ ప్రభావం బియ్యం ధరలపై పడుతోంది. ఆవిరిపట్టిన(స్టీమ్) స్వర్ణ రకం బియ్యం క్వింటాలు రూ.2వేల 500 నుంచి రూ.2వేల 700 అక్కడి నుంచి రూ.2వేల 800 కు. సోనా విషయానికొస్తే క్వింటాలు రూ.2వేల 800 నుంచి 3వేల 400, బ్రాండ్ల బియ్యం(సూపర్ ఫైన్) క్వింటాలు రూ.4వేల 200 నుంచి రూ.4వేల 800కు చేరుకున్నాయి, పీఎల్ క్వింటాలు రూ.2వేల 600 నుంచి రూ.2వేల 800 చేరింది. ప్రస్తుతం రకాన్ని బట్టి రూ.3వేలు-రూ.3వేల 200 మధ్య ధర ఉంది. మరో పక్క మార్కెట్‌లో కొన్ని సంస్థల బ్రాండ్లకున్న క్రేజ్ నేపధ్యంలో మార్కెట్లో ఆయా బ్రాండ్ల బియ్యానికి కృత్రిమ కొరతను సృష్టించి సొమ్ములు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారులు బ్రాండ్లకు అలవాటు పడటం కూడా బియ్యం మార్కెట్లో ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. బియ్యం ధరలకు రెక్కలు రావటానికి విద్యుత్ కోతలు, లెవీ, ప్రభుత్వ మార్పిడి తదితర కారణాలు చెబుతున్నా చివరకు వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది. బియ్యం ధరలను విపరీతంగా పెంచుతున్నా పట్టించుకునే నాథుడు లేడు.