• ఈఎల్‌ఆర్ పేరిట పల్లె , పట్టణ ప్రాంతాల్లో రెండు గంటల పాటు కోత
• చిన్నపాటి లోపాల పేరుతో రోజులో మరో గంట
• తగ్గుముఖం పడుతున్న విద్యుత్ కేటాయింపులు
• వీటీపీఎస్‌లో సాంకేతిక లోపం కారణంగా కోతలు : విద్యుత్ శాఖ ఎస్‌ఈ
చలి ఇప్పుడిప్పుడే తగ్గుముఖంపడుతోంది... వేసవి ఛాయలు ఇంకా పూర్తిగా రానేలేదు...అప్పుడే విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో పరిస్థితిని తలచుకుని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. లోడ్ రిలీఫ్, మరమ్మతుల పేరుతో అనధికార కోతలు విధిస్తూ విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు చెమటలు పట్టిస్తున్నారు. రోజుకు రెండు గంటల నుంచి మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.
విజయనగరం మున్సిపాలిటీ : విద్యుత్ శాఖ అధికారులు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్‌పేరిట జిల్లాలో కోతలు ప్రారంభించారు. జిల్లా కేంద్రం, పారిశ్రామిక రంగానికి మినహా మిగిలిన మండల కేంద్రాలు, మూడు మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో రెండు గంటల పాటు ఎమర్జెన్సీ లోడ్‌రిలీఫ్ పేరిట కోతలు విధించారు. ఈ అనధికారిక కోతల నుంచి జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణం,పారిశ్రామిక రంగానికి మినహాయింపు ఇచ్చారు. శుక్రవారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.25 గంటల వరకు సరఫరా నిలిపివేశారు. ఇది కాకుండా చిన్నపాటి లోపాల పేరుతో రోజులో మరో గంట వరకు విద్యుత్ సరఫరా ఉండడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.జిల్లాలో 5 లక్షల 73వేల 240 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి.
సర్కిల్ పరిధిలో రోజుకు 5.364 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగిస్తుండగా... పై నుంచి 5.183 మిలియన్ యూనిట్‌లు మాత్రమే కేటాయిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోవటంతో భవిష్యత్‌లో విద్యుత్‌కోతలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే పరీక్షలు దగ్గర పడుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళ కోతలు విధిస్తుండడంతో చదవలేకపోతున్నారు.
ఇదేవిషయమై ఏపీఈపీడీసీఎల్ విజ యనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ జి.చిరంజీవిరావు వద్ద సాక్షి ప్రస్తావించగా... వీటీపీఎస్‌లోని రెండు యూనిట్‌లలో నెలకొన్న సాంకేతిక లోపం కారణంగా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట కోతలు విధిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి పగటి సమయం ఐదు గంటలు, రాత్రి సమయం రెండు గంటల పాటు మొత్తం ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు.