చిరుబతుకుల్లో
భారీ వర్షాలు, ఈదురు గాలులు ఒకవైపు... విద్యుత్ ఉద్యోగుల సమ్మె మరోవైపు దీంతో జిల్లా ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్నచిన్న వ్యాపారాలు నిలిచిపోయాయి. రక్షిత పథకాలు పడకేశాయి. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కొవ్వొత్తుల వెలుగుల్లో అవస్థలు పడ్డారు. ఆస్పత్రుల్లో రోగుల పాట్లు వర్ణనాతీతం. దీంతో చిరుబతుకుల్లో చీకట్లు కమ్ముకున్నాయి.
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లా ప్రజలకు విద్యుత్ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. విద్యుత్ ఉద్యోగులు ఆదివారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకు వెళ్లడంతో విద్యుత్ సరఫరా లేక ప్రజలు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. ఇళ్లల్లో ఫ్యాన్లు, లైట్లు వెలగక, తాగునీరు సరఫరా కాక ఇక్కట్లు పడ్డారు. పంచాయతీ, మున్సిపల్ పరంగా తాగునీటి సరఫరా లేకపోవడంతో సొంత వనరులపైనే తాగునీటికి ఆధారపడాల్సి వచ్చింది. ఓ పక్క వర్షం కురుస్తుండడంతో వాతావరణ పరిస్థితి తెలుసుకోవాలన్న ప్రజలకు ప్రచార మాధ్యమాలు పనిచేయక పోవడంతో ఆందోళన చెందారు. జిల్లాలో 95 శాతం అంధకారం అలుముకుంది. అధికారులు ప్రైవేటు వ్యక్తులతో మరమ్మతులు చేయిస్తున్నా అవి తాత్కాలికమే అవుతున్నాయి.
మరమ్మతు చేసిన క్షణాల్లోనే తిరిగి యధాస్థితికి రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 23 జిల్లాల పరిధిలో సమ్మె జరుగుతుండడంతో విద్యుత్ ఉత్పాదక కేంద్రాల సిబ్బంది కూడా సమ్మెకు వెళ్లడంతో గంటగంటకూ ఉత్పత్తి తగ్గుతోంది. మరికొద్ది గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే గ్రిడ్ విఫలమై రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలకు వచ్చే సరఫరా తగ్గడంతో ఆ మేరకే ఇళ్లకు సరఫరా చేసే పరిస్థితి ఉంటుందని, విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించినా పరిస్థితి చక్కబడేందుకు 48 నుంచి 72 గంటలు సమయం పడుతుందని వారంటున్నారు. ఇటువంటి విషయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు జనరేటర్లపై నడిపిన కొన్ని వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు ఒకటొకటిగా మూతపడుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు, హోటళ్లు, సినిమా థియేటర్లు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో జనరేటర్లపై నడుపుతున్నారు.
ప్రైవేటు వ్యక్తులతో మరమ్మతులు
ప్రజలకు కష్టాలు తప్పించేందుకు తమ శాఖలోని ఇంజినీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారని ట్రాన్స్‌కో ఎస్‌ఈ పీవీవీ సత్యనారాయణ చెప్పారు. ప్రైవేటు వ్యక్తులతో మరమ్మతులు చేయించాలని యోచిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు తమ ఆధీనంలో ఉండే కొందరు ఉద్యోగులతో అత్యవసర సేవలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు.
సమస్య పరిష్కారం గురించి ఆలోచించని అధికారులు
విద్యుత్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి రాష్ట్ర అధికారులు ఆలోచించడం లేదని అందువల్లే రెండు రోజులుగా చర్చలు విఫలమవుతున్నాయని విద్యుత్ ఉద్యోగుల సంఘ నాయకుడు ఎంవీవీ గోపాలరావు అన్నారు. చర్చలు సఫలమైన పక్షంలో 24 గంటల్లోనే సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు.
విద్యార్థులకు కొవ్వొత్తులే దిక్కు
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్:విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యార్థులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు. సంవత్సరం పొడువునా చదివిన సమయంలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు... నెల వ్యవధిలో ఉత్తీర్ణత సాధించాలంటే ఉదయం, రాత్రివేళల్లో చదవాల్సిన పరిస్థితి. ఉదయం ఏదోలా నెట్టుకొస్తున్నా రాత్రి వేళ విద్యుత్ సరఫరా లేక దీపం, కొవ్వొత్తుల వెలుగుల్లో చదువుతూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 28వేల మంది, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు సుమారు 12వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరంతా విద్యుత్ సరఫరా లేక అగచాట్లు పడుతున్నారు. అలాగే వివిధ ఉన్నత కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకూ కష్టాలు తప్పడం లేదు.
కొవ్వొత్తుల వెలుగుల్లో విధులు
రాజాం, న్యూస్‌లైన్: విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కొవ్వొత్తుల వెలుగుల్లో విధులు నిర్వహించారు. కార్యాలయంలో వెలుతురు లేక చీకట్లు కమ్ముకోవడంతో తప్పనిసరి పనులను కొవ్వొత్తుల వెలుగుల్లో చేయాల్సి వచ్చింది. దీంతో సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. అలాగే విద్యుత్ కోత కారణంగా తాగునీటికి కూడా పట్టణ వాసులు నోచుకోలేదు. రేగిడి, శిర్లాం, రాజాంలో విద్యుత్ అంతరాయం కలగడంతో కుళాయిల ద్వారా సోమవారం తాగునీరు సరఫరా జరగలేదు. మంగళవారం కూడా తాగునీరు అందించలేమని కమిషనర్ వి.అచ్చిన్నాయుడు తెలిపారు.