మళ్లీ విద్యుత్ కోతలు | Power outages again | Sakshi
Sakshi News home page

మళ్లీ విద్యుత్ కోతలు

Published Tue, Oct 22 2013 2:11 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM

Power outages again

 వరంగల్, న్యూస్‌లైన్ :  విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా గృహావసరాలకు అధికారికంగా... వ్యవసాయ విద్యుత్‌కు అనధికారికంగా కరెంట్ కోతలు అమలు చేస్తున్నారు. గ్రామాల్లోనైతే పగలంతా విద్యుత్‌ను మరిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రిళ్లు సైతం సరఫరా నిలిపివేస్తుండడం గమనార్హం. బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్ పవర్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందనే సాకుతో విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

లోడ్ రిలీఫ్ కోసం కరెంట్ అధికారులు ప్రధానంగా గ్రామాలపైనే దృష్టి పెట్టి కోతల సమయూన్ని పెంచడం గమనార్హం. ఇక వరంగల్ కార్పొరేషన్‌లో విద్యుత్ మరమ్మతుల నెపంతో ఏరియాలను బట్టి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నారు. మునిసిపాలిటీ, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ కేంద్రాల్లో కూడా కోతలను ఒక్కసారిగా పెంచారు. అంతేకాదు...  ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న వ్యవసాయ విద్యుత్‌కు సైతం కోత పెడుతున్నారు.

ఈ మేరకు సర్కారు లోపాయికారిక ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఉచిత విద్యుత్‌ను 5 గంటలకే పరిమితం చేయాలని డిస్కంలకు ఆదేశాలిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యుత్ సిబ్బంది గంటలో పదిసార్లు ట్రిప్ చేస్తూ విద్యుత్‌ను ఆదా చేసే పనిలో పడ్డారు. దీంతో పొట్టకు వచ్చిన వరికి నీళ్లు పెట్టేందుకు విద్యుత్ సరఫరా సరిపోక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం కరెంట్ లేకపోగా... రాత్రిపూట వచ్చే విద్యుత్ గంటలో పదిసార్లు ట్రిప్ అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిళ్లు వ్యవసాయ బావుల వద్దే జాగారం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

 గ్రామాల్లో 12 గంటలు...

 గ్రామాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండడం లేదు. వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ ఇచ్చినప్పుడు మూడు గంటలు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా... పొద్దంతా కరెంట్ ఉండడం లేదని గ్రామాల ప్రజలు చెబుతున్నారు. దీంతో విద్యుత్‌తో సాగే యంత్రాలు, వ్యాపారాలు  మూతపడుతున్నాయి. గ్రామాల్లో రాత్రిపూట కూడా విద్యుత్ సరఫరాకు బ్రేక్ వేస్తున్నారు. లోడ్ రిలీఫ్ పేరిట అర్ధరాత్రి గంటపాటు సరఫరా నిలిపివేస్తున్నారు.
 
 మండల కేంద్రాల్లో 6 గంటలు...

 మండల, సబ్‌స్టేషన్ కేంద్రాల్లో ఆరు గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. మండల కేంద్రాల్లో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు... లేదా ఉదయం 7 నుంచి 8 గంటల వరకు అనధికారికంగా విద్యుత్ సరఫరా తీసేస్తున్నారు.
 
మునిసిపాలిటీల్లో 4 గంటలు

 మునిసిపాలిటీ, ముఖ్య పట్టణాల్లో  4 గంటల అధికారిక కోతలు విధిస్తున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అధికారికంగా కోతల్లేకున్నా... లైన్ల మరమ్మతులంటూ రోజుల తరబడి ఏరియాల వారీగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా అపేస్తున్నారు.
 
 త్వరలోనే అధిగమిస్తాం
 రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కోతలు విధించాల్సి వస్తోంది. త్వరలోనే కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తాం.
 - మోహన్‌రావు, ఎస్‌ఈ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement