కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖ ఆపరేషన్స్ ఎస్‌ఈ భార్గవరాముడి దురుసు వైఖరిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. కింది స్థాయి ఏడీఈలు, డీఈల పట్ల ఆయన తీరు బాగాలేదని ఇప్పటి వరకు ఆరోపణలు వెలువెత్తగా.. తాజాగా క్లరికల్ స్టాఫ్, ఉద్యోగినుల పట్ల ఆయన నోరు పారేసుకున్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్యాలయంలో బాత్రూమ్ సరిగా లేదు మరమ్మతులు చేయండి అని కన్‌స్ట్రక్షన్ విభాగంలోని ఓ ఉద్యోగిని ఫిర్యాదు చేస్తే ‘అందులో పడుకుంటారా’ అని అవమానించారు. అలాగే మరో ఉద్యోగిని అనారోగ్య సమస్య ఉండటంతో లిఫ్ట్ వాడుకునే అవకాశం కల్పించాలని కోరితే ‘సెలవు పెట్టి వెళ్లిపో’ అన్నట్లు తెలిసింది.
‘పని చేతకాని మహిళలకు సెంట్లు, గిఫ్ట్‌లు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారంటూ’ మెడికల్ బిల్స్ చేసే సీనియర్ అసిస్టెంట్‌తో అన్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన ఉన్నతాధికారే బాధ్యతారహితంగా ప్రవర్తించడంతో ఉద్యోగ సంఘాలు నిలదీశాయి. ఆగ్రహించిన ఉద్యోగినులు, 1104, తెలుగునాడు, బీసీ, బహుజన సంఘాల నాయకులు శనివారం ఎస్‌ఈని కలసి ఆయన తీరును ఖండించారు. ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, దురుసుతనాన్ని మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎస్‌ఈ అందరి సమక్షంలో ఉద్యోగినులను క్షమించమని కోరారు. కార్యక్రమంలో 1104, తెలుగునాడు, బీసీ, బహుజన సంఘాల నాయకులు గణేష్, చారి, కృష్ణమూర్తి, చంద్రబోస్, సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
మహిళలన్న గౌరవం లేదు
మా శాఖలో మహిళల పట్ల గౌరవం లేదు. అధికారులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ బాగోలేదంటే మరమ్మతులు చేయించకుండా అసభ్యకరంగా మాట్లాడటం సరికాదు. గిఫ్ట్‌లు తీసుకొని పనులు చేస్తున్నారని చెప్పడం బాధ కలిగిస్తోంది.
– యు.ఎం. శాంతి, బీసీ మహిళా ఉద్యోగుల ప్రతినిధి.
Comments
Please login to add a commentAdd a comment