ప్రతీకాత్మక చిత్రం
తెలుగుదేశం పార్టీతోపాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ‘పెద్దాయన’ అనే మంచి పేరున్న ఉన్నం హనుమంతరాయచౌదరికి ఎమ్మెల్యే అయిన తర్వాత పరపతి పూర్తిగా మసకబారింది. ఇందుకు కారణం ఆయన కుమారుడు, యువనేత మారుతీచౌదరి వ్యవహార శైలి. రెండో కుమారుడు ఉదయ్‌కుమార్ చౌదరి కూడా భూ వివాదాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ‘షాడో’ ఎమ్మెల్యేగా పేరొందిన మారుతిచౌదరి శుక్రవారం అనంతపురంలోని హంద్రీనీవా కార్యాలయంలో ఇంజినీర్లపై దౌర్జన్యానికి దిగి దుర్భాషలాడిన సంఘటనతో మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ ఘటన జిల్లాలో రచ్చరచ్చగా మారింది. యువనేత వైఖరిని అటు టీడీపీ, ఇటు అధికార వర్గాలు చీదరించుకుంటున్నాయి. – కళ్యాణదుర్గం
తండ్రిపదవి.. తనయుడి పెత్తనం
2014 ఎన్నికల అనంతరం టీడీపీ అధికారం చేపట్టగానే యువనేత మారుతీ చౌదరి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే అయిన తండ్రి ఉన్నం హనుమంతరాయ చౌదరిని డమ్మీ చేసేశారు. అధికార యంత్రాంగంతో పాటు పార్టీని కూడా తన కనుసన్నల్లోనే నడుచుకునేలా ఆంక్షలు విధించారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, కాంట్రాక్టు పనులు ఎవరితో చేయించాలి..? అధికారులను ఎవరిని వేయించుకోవాలి? వారు వినకపోతే బదిలీ చేసి ఎవరిని నియమించుకోవాలనేదే ఆ యువనేత నిత్యకృత్యం. నాలుగేళ్లుగా నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం.
ఆయన చెప్పిందే వేదం..
నియోజకవర్గంలో మారుతీచౌదరి చెప్పిందే వేదం. రెండేళ్ల క్రితం మడకశిర ప్రాంతంలో టీడీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా అనారోగ్యం పాలై తిరిగి కంబదూరు తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన అధికారిని సీట్లో కూర్చోకుండా పార్టీ యంత్రాంగంతో నడిపిన తతంగం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బ్రహ్మసముద్రం మండలంలో నిజాయతీగా పనిచేసిన ఓ ఎస్‌ఐ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోగా ఆ మండల తెలుగు తమ్ముళ్లు రుబాబు చేశారు. చివరకు అందరూ నాన్‌బెయిలబుల్ కేసులో ఇరుక్కుపోయారు.
వీరిని కాపాడేందుకు సదరు ఎస్‌ఐను ఇక్కడి నుంచి పంపించేశారు. ఆ ఎస్‌ఐనే కాదు నిజాయతీగా పనిచేస్తున్న యువ డీఎస్పీని కూడా బదిలీ చేయించారు. నియోజకవర్గ కేంద్రానికి ముఖద్వారమైన మండల కేంద్రంలో పనిచేసిన ఓ తహసీల్దార్ వీరు చెప్పినట్లు నడుచుకోలేక విసుగెత్తి బదిలీచేయించుకున్నారు. చెప్పినట్టు వినలేదని ఇటీవల ఒక సీఐను వీఆర్‌కు పంపారు. ఈ విధంగా ప్రతి విషయంలోనూ యువనేత జోక్యం పెరిగిపోతోంది. నియోజకవర్గంలో ఏ స్థాయి అధికారి బదిలీపై రావాలన్నా..కాంట్రాక్టర్లు పనులు దక్కించుకోవాలన్నా యువనేతను ప్రసన్నం చేసుకోవాల్సిందే.
వ్యతిరేకిస్తే ‘అధికారాలు’ కత్తిరింపు
నియోజకవర్గంలో ఏ స్థాయి ప్రజాప్రతినిధులైనా యువనేత చెప్పినట్లు నడుచుకోకుంటే వారికి అధికారాలు కత్తిరించేస్తున్నారు. కళ్యాణదుర్గం ఎంపీపీ మంజులా కొల్లప్ప, బ్రహ్మసముద్రం ఎంపీపీ మంజులతో పాటు దుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ రామలక్ష్మిలకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని పాలన సాగించకుండా అడ్డంకులు సృష్టించాడు. ఇద్దరు దళిత ఎంపీపీలకు అధికారాలు కత్తిరింపు చేయడంతో చివరకు వారు యువనేత వద్ద తలొగ్గి పనులు చేయించుకోక తప్పలేదు. రోడ్ల విస్తరణ విషయంలో చైర్‌పర్సన్ బీకే రామలక్ష్మికీ ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. యువనేత వ్యవహర శైలిపై అధికారులు, ప్రజల్లోనే కాదు.. టీడీపీలోని నాయకుల్లోనూ అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది.
వినకుంటే దౌర్జన్యం
శెట్టూరు, కళ్యాణదుర్గం మండల సరిహద్దు గ్రామాల్లో జరుగుతున్న గాలిమరల పనులను మారుతీచౌదరి అడ్డుకుని కాంట్రాక్టర్లను వెనక్కుపంపారు. చివరకు యాక్సిస్, ఎకోరియన్, గ్రీన్‌కో, హీరో, సుజలాన్, విండ్ పవర్ కంపెనీలు ఏ పని చేయాలన్నా ఆయన్ను సంప్రదించే చేస్తున్నాయి. గాలిమరల బిడ్డింగ్‌లను వేయడం మొదలుకుని మట్టిరోడ్లు, విద్యుత్ లైన్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు ఆయన చెప్పిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టి కోట్ల రూపాయల కమీషన్లు దండుకున్నారు.
ఈ విషయంలో కిందిస్థాయి టీడీపీ నేతలకు ఒక్క పనికూడా ఇవ్వకపోవడంతో యువనేతపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. 2014 డిసెంబర్‌లో బోయలపల్లి గ్రామ సమీపాన రైల్వే పనులు చేస్తుండగా కాంట్రాక్టర్ కమీషన్లు ఇవ్వలేదని ఏకంగా జేసీబీలు ధ్వంసం చేసి హంగామా సృష్టించారు. బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లి, చెలిమేపల్లి వద్ద వేదావతి నదిలో ఇసుక దందాకు పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment