వారంతా నిరుపేదలు. షెడ్యూల్డు క్యాస్ట్ (ఎస్సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్టీ)కు చెందిన వారు. ఇదివరకటి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించింది. అప్పటి నుంచి వీరు విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఎవరైతే ఉచితంగా కరెంటు పొందుతున్నారో.. వారందరూ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని గుర్తించి అనంతపురం విద్యుత్ చౌర్య నిరోధక పోలీసులు నోటీసులు జారీ చేశారు. అధికారులు జరిమానాగా విధించిన కాంపౌండ్ ఫీజు, అసెస్‌మెంట్ మొత్తాన్ని చెల్లించాలని, లేకపోతే నాన్‌బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని అందులో పేర్కొన్నారు.
అనంతపురం, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ చౌర్యం కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. మొత్తం 1,841 మందిపై నాన్‌బెయిలబుల్ కేసుల నమోదుకు నోటీసులు జారీ చేశారు. రూ.14.27 లక్షల రికవరీ కోసం విద్యుత్ చౌర్య నిరోధక పోలీసులు ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల వారిపైన 4,167 విద్యుత్ చౌర్యం కేసులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. నోటీసులు అందుకున్న వారు అరెస్టుల భయంతో వణికిపోతున్నారు. కొందరైతే ఊళ్లు వదిలి ఎక్కడో తలదాచుకుంటున్నారు. మరికొందరైతే పోలీసులకు పట్టుబడి బతిమలాడుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని నోటీసులు అందుకున్న వారు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీలను అన్ని విధాలా ఆదుకుంటామని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని ఇచ్చిన హామీలన్నీ ఉత్తివేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తక్షణమే నోటీసులు ఉపసంహరించుకుని, కేసులు ఎత్తివేసి.. తమకు ఉచిత విద్యుత్ అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు.
టీడీపీ వచ్చాకే కష్టాలు
టీడీపీ ప్రభుత్వం వచ్చాకే కరెంటు కేసులు పెడుతున్నారు. పోలీసులను ఇళ్లకు పంపి భయపెడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా బిల్లు కట్టించుకోలేదు. కనీసం అధికారులు వచ్చి ఒత్తిడి చేసిందీ లేదు. ఆయన హయాంలో హాయిగా నిద్రపోయాం. ఇప్పుడు రికవరీ, కేసులు పేరిట పోలీసులు చేస్తున్న హడావుడితో క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నాం.
– సుజాతాబాయి, పాలవాయి తండా, కళ్యాణదుర్గం మండలం
ఎస్సీ, ఎస్టీలను ఇబ్బందులు పెట్టొద్దు
చంద్రబాబు ప్రభుత్వానికి ఎస్సీలు, ఎస్టీలంటే చిన్నచూపు. విద్యుత్ చౌర్యం కేసుల పేరుతో ఇళ్లకు వెళ్లి పోలీసుల ద్వారా భయపెడుతోంది. ఎస్సీ, ఎస్టీలతో ఓట్లు వేయించుకుని.. సంక్షేమానికి పాటుపడతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు కేసుల పేరుతో ఇబ్బందులు పెట్టడం బాధాకరం. టీడీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బనాయించిన విద్యుత్ చౌర్యం కేసులు ఎత్తేసి, విధించిన రుసుం రద్దు చేయాలి. లేకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.– తిప్పేస్వామి నాయక్, జీఎస్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
కేసులతో కంటిమీద కునుకు లేదు
కరెంటు దొంగతనంగా వాడుకుంటున్నామంటూ ఎనిమిది నెలల కిందట మాపై కేసు నమోదు చేశారు. తొమ్మిది నూటా నలభై రూపాయలు కట్టించుకున్నారు. పోలీసులకు మళ్లా సపరేటుగా రూ.500 కట్టాను. వైఎస్సార్ ఉన్నప్పుడు ఏనాడూ ఇలాంటి కేసులు పెట్టలేదు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చాక మాపై కేసులు పెట్టి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.– వసంతమ్మ,, ఎస్సీ, తూముకుంట
ఉచిత విద్యుత్ అమలులో విఫలం
ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ‘దీన్ దయాళ్’ పథకం ప్రవేశపెట్టింది. రూ.125 చెల్లిస్తే విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు అయితే వంద యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. 125 యూనిట్ల వరకు వినియోగిస్తే.. అదనంగా కాల్చిన 25 యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. 126 యూనిట్లకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బృహత్తర పథకం గురించి ప్రచారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించి.. వారికి వర్తింపజేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఇప్పుడు వారినే విద్యుత్ చౌర్యం కింద నేరస్తులను చేస్తోంది.
కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో బుధవారం విద్యుత్ చౌర్య నిరోధక పోలీసులు రికవరీ కోసం వెళ్లారు. పోలీసుల పక్కన కనిపిస్తున్న మహిళ టీడీపీ కార్యకర్త తిమ్మరాజు భార్య సుశీలమ్మ. వీరికి కూడా విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేసి పోలీసులు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment