కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ వెల్లడి
ఏపీతో అవగాహన ఒప్పందం
2019 నాటికి దేశంలో అందరికీ 24 గంటల విద్యుత్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 2016 అక్టోబర్‌కు అందరికీ విద్యుత్ అందనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో అందరికీ విద్యుత్ పథకం అమలుకు సిద్ధంగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా 24 గంటల పాటు విద్యుత్ పథకం అమలు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ ఆదివారం వెల్లడించింది. దేశంలో 2019 నాటికల్లా అందరికీ 24 గంటల విద్యుత్ అందించాలనే దిశగా విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్, సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం, ఫీడర్ల సెపరేషన్, వినియోగదారులకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు తదితర అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈశాన్య రాష్ట్రాల్లో నిరంతర విద్యుత్‌పై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించింది. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే.. విద్యుత్ ఉత్పత్తి చేయడం, ట్రాన్స్‌మిషన్, సరఫరాలో రాష్ట్రాల భాగస్వామ్యంతో 24 గంటల పాటు అందరికీ విద్యుత్ సరఫరాకు కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.
అందరికీ విద్యుత్‌లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి పథకం ద్వారా విద్యుత్ సరఫరా పనులను గ్రామీణ ప్రాంతాల్లో పటిష్టం చేయడానికి చర్యలు చేపడుతోంది. ఈ పథకానికి రూ. 43,033 కోట్లు అంచనా వ్యయంగా ఉంది. సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకం, రెగ్యులేటరీ సంస్కరణలు, పునరుత్పాదక ఇంధనంలో సలహా గ్రూపు ఏర్పాటు చేయడం, ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు తదితర చర్యలు చేపట్టనున్నారు. హుద్‌హుద్ తుపాను తరువాత విశాఖపట్నంలో సుమారు 91 వీధి దీపాలుగా ఎల్‌ఐడీ బల్బులను ఎనర్జీ ఎఫిషియెన్సీ సంస్థ అమర్చినట్టు కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది.