ప్రబోధానంద స్వామి ,జేసీ దివాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్
పోలీసులపై జేసీ రెచ్చిపోవడం.. పోలీసు అధికారుల సంఘం అదేస్థాయిలో వార్నింగ్ ఇవ్వడం.. తిరిగి జేసీ తనదైన స్థాయిలో స్పందించడం.. ఇంతలో ఇప్పటి వరకు ఎక్కడున్నారో తెలియని ప్రబోధానంద ఓ వీడియో విడుదల చేసి మొత్తం ఘటనకు జేసీనే కారణమని ఆరోపించడం.. వెరసి చల్లారిందనుకున్న ‘తాడిపత్రి’ రోజుకో రీతిన రగులుతూనే ఉంది. వారం రోజులు గడుస్తున్నా.. వినాయక చవితి రగడ తిరుగుతున్న మలుపులు ఏ పరిస్థితులకు దారి తీస్తాయోననే చర్చ జోరుగా సాగుతోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: గణేశ్ నిమజ్జం సందర్భంగా తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడ గ్రామంలో ఘర్షణ తలెత్తింది. ఆ సందర్భంగా పోలీసులు వైఫల్యం చెందారని వారిని ‘కొజ్జా’లతో పోల్చడంతో పాటు ఎంపీ జేసీ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా రాజకీయపార్టీలు వ్యవహరిస్తున్నాయని, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే నాలుక కోస్తామని జిల్లా పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, సీఐ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై శుక్రవారం జేసీ స్పందించారు. గొడవ సందర్భంగా పోలీసులంతా పారిపోయారని, వారితో పాటు తాను పారిపోయానన్నారు. పారిపోయిన పోలీసులు కొజ్జాలే అని, వారితో పాటు తానూ కొజ్జానే అని జేసీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. సినీ హీరో సాయికుమార్ తరహాలో మీసం మెలేసి, నాలుక కోస్తా అని మాధవ్ అంటున్నారని, ఇది సినిమా కాదు నిజ జీవితం అన్నారు. ‘రేయ్ మాధవ్‌ఎన్నిసార్లు నా చుట్టూ తిరగలేదు. నువ్వు నా నాలుక కోస్తావా. ఎక్కడికి రావాలో చెప్పు’ అని తీవ్రంగానే స్పందించారు.
అంతటితో ఆగకుండా తాడిపత్రికి వెళ్లి మాధవ్‌పై ఫిర్యాదు చేశారు. సీఐలా కాకుండా వీధిరౌడీలా మాట్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆశ్రమ ఘటనలో పోలీసులు వైఫల్యం చెందారన్నారు. పోలీసు సంఘం స్పందన తర్వాత జేసీ క్షమాపణలు చెబుతారని పోలీసులు భావించారు. అందుకు భిన్నంగా జేసీ వ్యవహరించడం, ఏకంగా ఫిర్యాదు వరకూ వెళ్లడంతో పోలీసులు పునరాలోచనలో పడ్డారు. ఈ విషయంలో వెనక్కి తగ్గితే పోలీసు వ్యవస్థపై ఓ వ్యక్తి పైచేయి సాధించినవారవుతారని భావిస్తున్నారు. దీనిపై సీఎం, డీజీపీని కలిసి జేసీపై కేసు నమోదు చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆశ్రమంలో జరిగిన ఘటనను, పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలను వేర్వేరుగా చూడాలని విన్నవించనున్నారు.
వీడియో ద్వారా వెలుగులోకి ప్రబోధానంద
ఈ వివాదం ఇలా నడుస్తుంటే గణేశ్‌నిమజ్జనం గొడవ, ఆశ్రమంపై ఆరోపణలు, జేసీ బ్రదర్స్‌తో వైరంపై ఆశ్రమ నిర్వాహకుడు ప్రబోధానంద వీడియా ద్వారా స్పందించారు. గతంలో బీజేపీ కార్యకర్తలకు ఆశ్రయం కల్పించామనే కారణంతో మాపై కక్షకట్టారని, అప్పట్లో ఆశ్రమం ఖాళీ చేయించి కర్ణాటకకు వెళ్లామన్నారు. 2003లో జేసీతో విభేదాలు వద్దని ఆయనతోనే ఆశ్రమం ప్రారంభించామన్నారు. 2008 వరకూ జేసీ మంచిగానే ఉన్నారన్నారు. ఆపై డబ్బులు డిమాండ్ చేయడం, తాము ఇవ్వకపోవడంతో కక్ష కట్టి నీళ్లు, కరెంటు నిలిపేసి ఇబ్బందులు పెట్టాలని చూశారన్నారు. తాము లొంగకపోవడంతో కొంతమంది గ్రామస్తులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. గణేశ్ నిమజ్జనం కూడా రాజకీయకుట్రలో భాగంగానే జరిగిందని, సీఐ సురేంద్రనాథ్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని గొడవ సృష్టించి తమను కేసుల్లో ఇరికించాలని జేసీ బ్రదర్స్ కుట్రపన్నారని ప్రబోధానంద వెల్లడించారు.
ఆశ్రమ భవనాన్ని కూల్చాలని కూడా ప్రయత్నించారన్నారు. ఆశ్రమంపై చేసిన ఆరోపణలు ఖండిస్తూ 64 సీసీ కెమెరాలు ఉన్నాయని, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందని.. విచారించుకోవచ్చన్నారు. ఈ క్రమంలో తాడిపత్రిలో ప్రబోధానందకు వ్యతిరేకంగా ముస్లింలు ర్యాలీ చేశారు. 2017మేలో ‘దేవుని ముద్ర’ పేరుతో ప్రబోధానంద ఓ పుస్తకం ప్రచురించారు. అందులో ముస్లింలను కించపరిచేలా రచనలు ఉన్నాయని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై కేసు నమోదైంది. తాజాగా కేసు నమోదైనా ఆశ్రమంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తాడిపత్రి ముస్లింలు శుక్రవారం తిరిగి ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసు సంఘం, జేసీ దివాకర్‌రెడ్డి వివాదంతో పాటు ఆశ్రమం, చిన్నపొలమడ గ్రామస్తులు, ఆశ్రమం, ముస్లింలు నమోదు చేసిన కేసు...ఇలా మూడు రకాలుగా వివాదం నడుస్తున్నట్లయింది.
ముగింపు పలకకపోతే మరింత ప్రమాదం
తాడిపత్రి స్టేషన్‌లో గతేడాది జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన అనుచరులు సీఐలపై పరుష పదజాలం వాడినప్పుడే స్పందించి ఉంటే, ఈ రోజు జేసీ దివాకర్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదని కొంతమంది పోలీసులు చెబుతున్నారు. పోలీసులను కొజ్జాలతో పోల్చినా పట్టనట్లు వ్యవహరించడంతో పోలీసుల్లో ఐక్యత లేదని, తనపై ఎలాంటి కేసు నమోదు చేయలేరనే ధీమాతో జేసీ ఉన్నారు. అందుకే పోలీసు సంఘం స్పందన తర్వాత కూడా అదేస్థాయిలో జేసీ స్పందించారు. బాధ్యత కలిగిన ఎంపీ వ్యవస్థపై పరుష వ్యాఖ్యలు చేసినా డీజీపీతో పాటు ముఖ్యమంత్రి కూడా స్పందించలేదు. దీంతో ఉన్నతాధికారుల మద్దతు లేకుండా ముందడుగు వేయాలా? వద్దా? అని కూడా పోలీసు సంఘం మరో కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జేసీపై కేసు నమోదు చేస్తే తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందేమోనని ఓ వైపు, పట్టనట్లు వ్యవహరిస్తే ఏం మాట్లాడినా పోలీసులు ఏం చేయలేకపోయారనే భావన ప్రజల్లో ఉంటుందని మరోవైపు పోలీసులు సంఘర్షణ పడుతున్నారు. ఏదేమైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ వ్యవహారానికి ముగింపు పలకకపోతే ఈ వ్యవహారం మరింత ముదిరే ప్రమాదం లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment