
నేటితో ముగియనున్న శీతాకాల విడిది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది మంగళవారం ముగియనుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సోమవారం ‘ఎట్ హోమ్’ తేనీటి విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురందేశ్వరి, చిరంజీవి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇరు ప్రాంతాల జేఏసీ నాయకులు హాజరయ్యారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, త్రివిధ దళాల అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. జయప్రద రామ్మూర్తి బృందం వేణుగానం, యశోదా ఠాగూర్ కూచిపూడి నృత్యం ఆహూతులను ఆకట్టుకున్నాయి.
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌లో గడిపిన దాదాపు రెండు వారాల కాలంలో ప్రణబ్ రాష్ట్ర విభజన, సమైక్య రాష్ట్రానికి సంబంధించిన వినతులను కుప్పలు తెప్పలుగా స్వీకరించారు. సమస్య తీవ్రతను, వైషమ్యాల్ని గ్రిహ ంచినందు వల్లనేమో.. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చాలావరకు ముభావంగానే గడిపారు. తన పక్క సీట్లో సతీ సమేతంగా కూర్చున్న గవర్నర్‌తో మాత్రమే ఒకట్రెండు మాటలు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు కె.శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకొని.. రాష్ట్రపతి హైదరాబాద్ విడిదికి వచ్చే ముందు ఢిల్లీలో వినూత్నంగా ప్రారంభించిన రాష్ట్రపతి భవన్ ‘ఇన్ రెసిడెన్సీ’ కార్యక్రమం బాగుందని అభినందించినప్పుడు కూడా ప్రణబ్ తన సహజ ధోరణిలో ముసిముసి నవ్వుతో థాంక్యూ అని మాత్రమే అంటూ ముందుకు సాగారు. దాదాపు ఇదే వైఖరి మిగతా అందరి పట్ల రాష్ట్రపతి కనబరిచారు.
ప్రాంతాలవారీగా వేర్వేరు వరుసల్లో మంత్రులు: తేనీటి విందుకు హాజరైన రాష్ట్ర మంత్రులు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల వారీగా వేర్వేరు వరుసల్లో కూర్చున్నారు. సీమాంధ్ర మంత్రులు రెండో వరసలో, తెలంగాణ మంత్రులు మూడో వరుసలో కూర్చున్నారు. ఇది గమనించిన మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ వివేక్‌లు మంత్రి జానారెడ్డిని బలవంతంగా రెండో వరుసలోకి తీసుకెళ్లి కన్నా లక్ష్మీనారాయణ పక్కన కూర్చోబెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మధుయాష్కీ, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి ఒక వరుసలో కూర్చోగా, సీమాంధ్ర మంత్రులు కన్నా, రఘువీరా, బాలరాజు, కొండ్రు మురళీమోహన్, వట్టి వసంత్‌కుమార్ మరో వరుసలో కూర్చున్నారు. రాష్ట్రపతి రావడానికి ముందుగానే ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలంతా చేరుకోవడంతో అక్కడ కాసేపు సందడి నెలకొంది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ప్రణబ్ రాష్ట్రపతి నిలయం నుంచి బయలుదేరి హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వె ళతారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇలావుండగా రాష్ట్రపతి నిలయూన్ని ప్రజలు సందర్శించేందుకు వీలుగా త్వరలో తేదీలు ఖరారు కానున్నట్లు సమాచారం.