బుచ్చిరెడ్డిపాళెం: ఆరుగాలం శ్రమించి పండించిన పంట దళారుల పాలవుతున్నా రైతుల బాధ అధికారులకు పట్టడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 162 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తానన్న కలెక్టర్ నేటికీ పూర్తిగా ఏర్పాటు చేసిన దాఖలాల్లేవన్నారు. మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీని నేటికీ ఇవ్వలేదని, ఈ మేరకు లెటర్ ఆఫ్ అండర్ స్టాండింగ్ జరగకపోవడం దారుణమన్నారు. «
ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పుట్టికి రూ.13,515 మద్దతు ధర ఎక్కడా అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గతేడాది 8 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి ఈ ఏడాది ఏడు లక్షల ఎకరాలకే పరిమితమైందన్నారు. విధిలేని పరిస్థితుల్లో దళారులకు రైతులు పుట్టి ధాన్యాన్ని రూ.11,800కు శనివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు రైతులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
మద్దతు ధరలు లభించక దళారుల చేతుల్లో బలవుతున్నామని కోవూరులో రిలే దీక్షలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జాయింట్ కలెక్టర్, మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువునా దగా చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, అమర్‌నాథ్‌రెడ్డి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా మంత్రులు అధికారులతో సమావేశాలను నిర్వహించి పుట్టి ధాన్యానికి రూ.18 వేల మద్దతు ధర ఇవ్వాలని, లేని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment