ప్రతాప్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం
అపోలో ఆస్పత్రుల చైర్మన్ జీవిత కథ ‘హీలర్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జానా
సాక్షి, హైదరాబాద్: వైద్యరంగంలో డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి సేవలు చిరస్మరణీయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అపోలో ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి జీవిత చరిత్ర ‘హీలర్: డాక్టర్ ప్రతాప్ చంద్రరెడ్డి అండ్ ది ట్రాన్స్‌ఫార్మేషన్స్ ఆఫ్ ఇండియా’ పుస్తకావిష్కరణ బుధవారం ఇక్కడి అపోలో హెల్త్ సిటీలో జరిగింది. మంత్రి జానారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అపోలో ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం ద్వారా ప్రతాప్‌రెడ్డి విదేశీయులను ఆకర్షిస్తున్నారంటూ ఆయన సేవలను ప్రశంసించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. 1980 తర్వాత దేశానికి సూపర్‌స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత ప్రతాపరెడ్డికే దక్కుతుందన్నారు. 30 ఏళ్లుగా ప్రతాప్‌రెడ్డి 37 మిలియన్ల మంది రోగుల జీవితాల్లో వెలుగులు నింపారని పుస్తక రచయిత, చరిత్రకారుడు ప్రణ్‌య్‌గుప్తా కొనియాడారు.
600 పేజీలు గల ఈ హీలర్ పుస్తక ప్రతిని ప్రతాప్‌రెడ్డి కొన్ని రోజుల క్రితం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి అందించగా.. అధికారికంగా పుస్తకావిష్కరణ బుధవారం జరిగింది. అనంతరం తొలి ప్రతిని ప్రతాప్‌రెడ్డి తన సతీమణి సుచరితారెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి రాఘవరెడ్డి ఆదేశాల మేరకే ఒకప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చానన్నారు. గతంలో ఇక్కడి రోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా విదేశీ వైద్యులను ఆశ్రయించాల్సి వచ్చేదని, సకాలంలో వైద్యం అందక అనేక మంది మృత్యువాతపడేవారని చెప్పారు. దీంతో సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలను కార్డియాలజీ విభాగంలో ప్రారంభించినట్లు తెలిపారు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి అభివృద్ది చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ధరకే మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు రాంచరణ్, అపోలో డెరైక్టర్ సంగీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.