నా కోసం దేవున్ని ప్రార్థించండి
♦ మీకు మెరుగైన ఆస్తులు, ప్రశాంతత లభించి అభివృద్ధి చెందుతారు
♦ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్బోధ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బిడ్డ తల్లి గర్భంలో పడినప్పటి నుంచి వారు పెరిగి పెద్దయి చనిపోయాక శ్మశానానికి వెళ్లే వరకు అందరి సంక్షేమం గురించి ఆలోచిస్తున్న తన గురించి, ప్రభుత్వం గురించి ప్రజలు ప్రార్థనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఇలా చేస్తే ప్రజలకు మెరుగైన ఆస్తులు, ప్రశాంతత లభించి అభివృద్ధి చెందుతారని బోధించారు. రాష్ట్రంలో నీటి సమస్య తొలగించడానికి నదుల అనుసంధానంతో పాటు, చెరువులను కూడా అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్రంలో నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో మంగళవారం నిర్వహించిన జన్మభూమి సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి తినే తిండి వల్ల రోగాలు వస్తాయని.. తనలాగా డ్రై ఫ్రూట్స్, కోడిగుడ్లు, రాగి, జొన్న, సజ్జ జావ, పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారని ప్రజలకు ఆహార చిట్కాలు చెప్పారు. చేపలు తింటే తెలివి పెరుగుతుందని డాక్టర్లు చెప్పడంతో తాను ఇటీవలే చేపలు తినడం ప్రారంభించానని, అప్పటి నుంచి రాష్ట్రంలో చేపల ఉత్పత్తి 45 శాతం పెరిగిందని చంద్రబాబు చెప్పుకు న్నారు.
కొందరు ఎన్నికల సమయంలో మాటలు చెప్పి మళ్లీ కనపడరని, ఎన్నికల్లో రూ. 500, రూ. 1,000 పెట్టి ఓట్లు కొంటారని ఆరోపించారు. దీని వల్ల సమాజం పాడై పోతుందని చెప్పారు. ప్రజలకు నీరు, విద్య, విద్యుత్, రోడ్లు, ఆరోగ్యం, ఆహారం, మరుగుదొడ్లు, ఇండ్లు ఇలా అన్నీ చేసినందువల్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో గుర్తు పెట్టుకుని తన కోసం, ప్రభుత్వం కోసం ప్రజలను ప్రార్థించాలని సీఎం పదే పదే అభ్యర్థించారు. తన కోసం దేవుడిని ప్రార్థిస్తే.. 50 శాతం పనిచేస్తే 100 శాతం ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు.
ముందు మాకు నీళ్లివ్వండి
‘నదుల అనుసంధానం, చెరువుల అనుసంధానం సంగతి దేవుడికెరుక.. మా ఊర్లో చెరువులో నీళ్లు లేక 1,600 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ముందు వాటికి నీళ్లు ఇవ్వాలి’ అంటూ చెన్నూరుకు చెందిన రైతు చేవూరి వేణుగోపాల్‌రెడ్డి జన్మభూమి సభలో సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రసంగం మధ్యలో రైతు గట్టిగా కేకలు వేసి ప్రశ్నలు సంధించడంతో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వేదిక దిగి వెళ్లి పోలీసుల సహాయంతో రైతుని అక్కడి నుంచి పంపించేశారు.
వడ్డీ మాఫీ రైతుకు అందేలా చూడాలి
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రెండు నెలల రబీ వడ్డీ మాఫీ ప్రయోజనం రాష్ట్రంలోని ప్రతి రైతుకు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మంగళవారం జన్మభూమిపై అధికారులు, బ్యాంకర్లు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రబీ రుణాల పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు.