రూ.వెయ్యిస్తే ఎస్సార్!
విద్యాశాఖ, ఎల్‌ఎఫ్ ఆడిట్ సిబ్బంది చేతివాటం
రెండు నెలలుగా అందని పీఆర్సీ వేతనాలు
ఎయిడెడ్ టీచర్ల ఆవేదన
విశాఖపట్నం: పిల్లలు బడికి వచ్చారో లేదో తెలుసుకోవడానికి టీచరు హాజరు పట్టీలో పేర్లను వరసగా పిలుస్తారు. అలా పిలిచేటప్పుడు వచ్చిన వారు ‘ఎస్ సార్’ అంటారు. ఆ విద్యార్థి వచ్చాడని నిర్ధారించుకుని ఆ మాస్టారు పట్టీలో హాజరు వేస్తారు. ఇప్పుడు పీఆర్‌సీ జీతాల బకాయిల చెల్లింపులకు అవసరమైన ఎస్సార్ (సర్వీసు రిజిస్టర్)లో నమోదుకు ఇటు డీఈవో కార్యాలయ సిబ్బంది, అటు ఎల్‌ఎఫ్ ఆడిట్ సిబ్బంది చేతులు తడపనిదే పని జరగడం లేదని ఎయిడెడ్ టీచర్లు ఆరోపిస్తున్నారు. ఫలితంగా రెండు నెలలుగా కొత్త జీతాలకు నోచుకోలేదని వాపోతున్నారు. వాస్తవానికి రెండు నెలల క్రితం టీచర్లకు జీతాల పీఆర్‌సీ అమలయింది. వీటిని పొందాలంటే ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు సంబంధిత కరస్పాండెంట్ల నుంచి జిల్లాలో ఎంఈవోలు, అర్బన్ పరిధిలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ల (డీఐ)ల ద్వారా, హైస్కూళ్లయితే డిప్యూటీ డీఈవోల ద్వారా డీఈవో కార్యాలయానికి పీఆర్‌సీ ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. డీఈవో కార్యాలయంలో వీటిని పరిశీలించి ఎల్‌ఎఫ్ ఆడిట్‌కు పంపుతారు. అక్కడ అభ్యంతరాలుంటే రిమార్కులో ఉంచుతారు. లేదంటే ఎస్సార్‌లో నమోదు చేస్తారు. దీంతో అభ్యంతరాల్లేని ఉపాధ్యాయులు పీఆర్సీ జీతాలకు లైన్ క్లియర్ అవుతుంది.
కానీ డీఈవో కార్యాలయంలో సంబంధిత సిబ్బంది ఒక్కో టీచరు నుంచి రూ.వెయ్యి, ఎల్‌ఎఫ్ ఆడిట్ ఆఫీసులో మరో రూ.వెయ్యి చొప్పున వసూలు చే స్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు ఉపాధ్యాయులు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని చెబుతున్నారు. అలా చెల్లించిన వారికి ఎస్సార్‌లో నమోదు చేయడంతో పీఆర్సీ జీతాలు పొందారని, లేనివారికి ఆగిపోయాయని పేర్కొంటున్నారు. జిల్లాలోని 26 ఎయిడెడ్ హైస్కూళ్లలో 16, రెండు ఓరియంటల్ స్కూళ్లు (సింహాచలం ఎస్‌వీఎల్‌ఎన్ సంస్కృతోన్నత పాఠశాల, చోడవరం హిందీ మహావిద్యాలయ)లతో పాటు పలు ప్రాథమిక పాఠశాలలు పీఆర్సీకి నోచుకోలేదని తెలుస్తోంది. ఇతర జిల్లాల్లో ఇప్పటికే పీఆర్సీ జీతాలు అందుకోగా రెండు నెలలవుతున్నా తమకు మాత్రం సిబ్బంది చేతివాటంతో జాప్యం జరుగుతోందని ఈ ఎయిడెడ్ టీచర్లు అంటున్నారు.
లంచం అడిగితే చర్యలు..
పీఆర్సీ నమోదులో డీఈవో కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. లంచం ఇచ్చిన టీచర్లపైనా చర్యలుంటాయి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా నన్ను సంప్రదించవచ్చు. ఎయిడెడ్ ఎలిమెంటరీ, హైస్కూల్ టీచర్ల పీఆర్సీ ప్రతిపాదనలు వేగవంతం చేస్తాం. ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఈ విషయాన్ని స్పష్టం చేశాం.
-ఎం.వి.కృష్ణారెడ్డి, డీఈవో