Teacher attendance
-
నిర్వహణ నిధులేవి..?
సంగెం: విద్యాలయాలు దేవాలయాలతో సమానం. దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. రేపటి పౌరులైన విద్యార్థుల జీవితం తరగతి గదితో ముడిపడి ఉంది. తరగతి గది వాతావారణం బాగుంటేనే విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ఒంటబడుతాయి అనేవి పెద్దల మాట. కాని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నిర్వహణకు నిధులు రాకపోవడంతో పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఆరు నెలలు గడిచినా పాఠశాల నిర్వహణకు నిధులు విడుదల కాలేదంటే ప్రభుత్వ విద్యావిధానంపై అధికారులకు ఎంతటి పట్టింపు ఉందో అర్థమవుతోంది. విద్యాబోధనకు అవసరమైన డస్టర్లు, చాక్‌పీస్‌లు, పేపర్లు వంటి సామగ్రి, తాగునీరు, విద్యుత్ బిల్లులు, ఇతర మరమ్మతులకు నిధులు లేక ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానోపాధ్యాయులు తమ జేబులోంచి ఖర్చు చేయాల్సిన దుస్థితి దాపురించింది. పెట్టిన నిధులు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 460 ఉన్నాయి. ఇందులో 15,972 మంది విద్యార్థులు, ప్రాథమికోన్నత పాఠశాలలు 83 ఇందులో 4,482 మంది విద్యార్థులు, ఉన్నత పాఠశాలలు 153 ఇందులో 22,028 మంది విద్యార్థులు మొత్తం 696 పాఠశాలల్లో 42,422 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా పాఠశాలల్లో మరమ్మతులు, ఇతర అవసరాలకు ప్రభుత్వం ప్రతిఏడాది గ్రాంట్స్ నిర్వహణ నిధులు విడుదల చేస్తుంది. విద్యార్థులు తరగతి గదుల సంఖ్య ఆధారంగా సర్వశిక్షాభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ద్వారా పాఠశాల యాజమాన్యాల ఖాతాల్లో జమచేస్తారు. గత ఏడాది సర్వశిక్షా అభియాన్‌ను విలీనం చేసి సమగ్ర శిక్ష అభియాన్‌గా మార్చారు. పాఠశాలలకు ఇచ్చే నిధులను కూడా కలిపి ఇస్తామని అధికారులు ప్రకటించారు. కానీ పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా నేటికి నిధుల జాడ లేదు. వేడుకలకు నిధులు నిల్.. విద్యాసంవత్సరం క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా పాఠశాలల్లో వివిధ రకాల కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ, బాలల, జాతీయ నాయకుల దినోత్సవాలు, మండలస్థాయి క్రీడలు, పాఠశాలల స్థాయి క్రీడలు, సైన్స్‌ఫెయిర్ కోసం పరికరాల తయారీ, క్రీడా సామగ్రి, విద్యుత్ బిల్లులు, పేపర్ల కొనుగోలు వంటి వాటికి ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అందించే గ్రాంట్ ఎలా సరిపోతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాత పద్ధతిలో ఇచ్చే నిధులు సరిపోకపోవడంతో ఆయా పాఠశాలల్లో కార్యక్రమాలను నామమాత్రంగా నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ బిల్లులు.. పాఠశాలల్లో నిధుల కొరత వెంటాడుతుండగా విద్యుత్ బిల్లులు మరింత వేధిస్తున్నాయి. పాఠశాలల్లో వినియోగం ఉన్నా లేకున్నా విద్యుత్ బిల్లులు మాత్రం ప్రతి నెలా చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. పలు పాఠశాలల్లో కంప్యూటర్లను మూలన పడేశారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యుత్ వినియోగించడం లేదు. అయినా బిల్లులు చెల్లించక తప్పడం లేదని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల్లో పాఠశాలలు.. పాఠశాలల నిర్వహణకు అవసరమైన నిధులు రాకపోవడంతో జిల్లాలో పాఠశాలల నిర్వహణ కష్టసాధ్యమవుతున్నదని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 40 లోపు విద్యార్థులు, 3 తరగతులు, అంతకంటే తక్కువ గదులు ఉంటే రూ.5 వేలు నిర్వహణ నిధులు, మరో రూ. 5 వేలు స్కూల్ గ్రాంట్ కింద విడుదల చేసేవారు. 5 గదులకంటే ఎక్కువగా ఉంటే రూ.5 వేల నిర్వహణ నిధులు, రూ 10వేలు స్కూల్ గ్రాంట్ కింద జమ చేసేవారు. ఉన్నత పాఠశాలల్లో ఆర్‌ఎంఎస్‌ఏ నుంచి ప్రత్యేక నిధులు రూ. 5 వేలు, స్కూల్ గ్రాంట్ కింద రూ 7 వేలు, నిర్వహణ నిధులు రూ 10 వేలు ఇచ్చేవారు. పెరిగిన జీవన ప్రమాణాలకనుగుణంగా పాఠశాలల నిర్వహణ ఖర్చులు, గ్రాంట్స్‌ను పెంచాల్సిన అవసరం ఉంటుందని నిపుణుల సూచన. ఎప్పుడో పాతికేళ్ల క్రితం నిర్ణయించిన పాఠశాల గ్రాంట్లే ఇప్పటికీ ఇస్తుండడంపై ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం సరిపోవడం లేదనే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాఠశాల ఖర్చులకనుగుణంగా నిధులు పెంచి అందించాలని పలువురు కోరుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు.. సర్వశిక్షా అభియాన్, రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ల వినియోగం తర్వాత సమగ్ర శిక్షా అభియాన్ తర్వాత ఎంత మొత్తంలో నిధులు ఇస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాలుగు విధాలుగా రూ.1000 నుంచి రూ 25 వేలు, రూ 40 వేలు, రూ 60 వేల చొప్పున ఇచ్చేందుకు విద్యాశాఖ యోచిస్తున్నట్లు సమాచారం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే గ్రాంట్స్ విడుదల చేయడానికి వీలుంటుందని తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదని ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. నిధులు విడుదల చేయాలి.. పాఠశాలలకు అవరమైన నిధులు ఈ విద్యా సంవత్సరం నుంచి నేటి వరకు విడుదల కాలేదు. విద్యాబోధన, ఇతర అవసరాల ఖర్చులకు నిధుల్లేక ప్రధానోపాధ్యాయులు అనేక అవస్థలు పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే గ్రాంట్స్ విడుదల చేస్తే విద్యాబోధనకు అవసరమైన సామగ్రిని తీసుకోవచ్చు. పాఠశాలలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్వహణ నిధులను పెంచి విడుదల చేయాలి. –ఎస్.రవీందర్, ప్రధానోపాధ్యాయుడు, సంగెం -
విద్యార్థుల హాజరు పెంచేదెలా?
- 70 శాతానికి మించని పరిస్థితి - టీచర్ల హాజరూ 78 శాతమే.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల రోజు వారీ హాజరు శాతాన్ని ఎలా పెంచాలనే అంశంపై విద్యా శాఖ దృష్టి సారించింది. విద్యా శాఖ నిర్వహించిన పలు సర్వేల్లో ఉపాధ్యాయుల హాజరే కాదు.. విద్యార్థుల హాజరు దారుణంగా పడిపోతోందన్న విషయాన్ని గుర్తించింది. ఉపాధ్యాయుల హాజరు 78 శాతం, విద్యార్థుల హాజరు 70 శాతం కన్నా మించడం లేదని సర్వేలు, అధికారుల బృందాల క్షేత్ర స్థాయి పరిశీలన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థుల చదువు కూడా అంతంత మాత్రమేనన్న విషయాన్ని గుర్తించింది. గత డిసెంబర్లో నిర్వహించిన సర్వే ప్రకారం.. పాఠశాలల్లో 45 శాతం మంది విద్యార్థులకు చదువడం, రాయడం రావడం లేదు. స్కూళ్లను హెచ్ఎంలు పట్టించుకోవడం లేదు. ఇంచార్జి ఎంఈవోలు బాధ్యతలు నిర్వర్తించడం లేదు. స్కూళ్లలో పరిస్థితులు, టీచర్ల హాజరును పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు చేపట్టడంతోపాటు హాజరును ఎలా పెంచాలనే దానిపై విద్యా శాఖ దృష్టి సారించింది. టీచర్ల హాజరు పెంపునకు బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. బడి మానే స్తున్న విద్యార్థులను పాఠశాలలకు తీసుకువచ్చే బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయంలో కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఓ సమగ్ర కార్యాచరణ నివేదిక రూపొందించి అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. క్షేత్ర స్థాయిలో టీచర్లకే విద్యార్థులను పాఠశాలలకు తీసుకువచ్చే బాధ్యతను అప్పగించాలా, లేక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించాలా, మరేదైనా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా అనే కోణంలో ఆలోచనలు చేస్తోంది. దీనిపై ఓ స్పష్టత రాగానే తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. -
ఇక బయోమెట్రిక్ హాజరు
ప్రతి స్కూల్లో నెలకు మూడుసార్లు సేకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, టీచర్ల హాజరును ఇకపై పక్కాగా పర్యవేక్షించేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ప్రతి నెలా మూడుసార్లు ఒక్కో స్కూల్లో బయోమెట్రిక్ హాజరును సేకరించేందుకు సిద్ధమవుతోంది. పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలు అమర్చడం, వాటి నిర్వహణ కష్టతరం అవుతుందనే ఉద్దేశంతో నెలలో 3 రోజుల పాటు ప్రతి పాఠశాలలను సందర్శించే ‘క్లస్టర్ రీసోర్సు పర్సన్’లకే (సీఆర్పీ) ఇంటర్నెట్ సదుపాయం కలిగిన ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. వాటికి బయో మెట్రిక్ పరికరాన్ని అనుసంధానించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ హాజరు ఆటోమేటిక్‌గా విద్యా శాఖకు చేరుతుంది. రాష్ట్రంలో 2,500 మందికిపైగా సీఆర్పీలు ఉన్నారు. ఒక్కో సీఆర్ పీ పరిధిలో 10 నుంచి 15 వరకు పాఠశాలలున్నాయి. వాటిని నెలకు 3సార్లు సందర్శిస్తారు. ఇలా ప్రతి నెలా 25వేలకు పైగా స్కూళ్లలో విద్యార్థులు, టీచర్ల హాజరు తీరును అంచనా వేసి, తగిన చర్యలు చేపట్టవచ్చని విద్యా శాఖ భావిస్తోంది. సీఆర్పీలు బయోమెట్రిక్ హాజరును ఆకస్మికంగా సేకరిస్తారు. ప్రస్తుతం పాఠశాలల్లో పర్యవేక్షణ లేదన్న ఉపాధ్యాయ సంఘాల వాదనలకు దీంతో చెక్ పెట్టాలని విద్యా శాఖ భావిస్తోంది. అంతేకాకుండా ఎంత మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారన్నది తెలుసుకొని ఓ అంచనాకు రావచ్చు. ఇందులో భాగంగా ట్యాబ్‌లకు బయోమెట్రిక్ పరికరం, దాని సాఫ్ట్వేర్ అనుసంధానంపై వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలతో శాఖ చర్చలు జరుపుతోంది. త్వరలో ఇది ఓ కొలిక్కి వస్తే ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి జూన్‌లో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అమల్లోకి తేవాలనే ఆలోచనలో ఉంది. -
రూ.వెయ్యిస్తే ఎస్సార్!
విద్యాశాఖ, ఎల్ఎఫ్ ఆడిట్ సిబ్బంది చేతివాటం రెండు నెలలుగా అందని పీఆర్సీ వేతనాలు ఎయిడెడ్ టీచర్ల ఆవేదన విశాఖపట్నం: పిల్లలు బడికి వచ్చారో లేదో తెలుసుకోవడానికి టీచరు హాజరు పట్టీలో పేర్లను వరసగా పిలుస్తారు. అలా పిలిచేటప్పుడు వచ్చిన వారు ‘ఎస్ సార్’ అంటారు. ఆ విద్యార్థి వచ్చాడని నిర్ధారించుకుని ఆ మాస్టారు పట్టీలో హాజరు వేస్తారు. ఇప్పుడు పీఆర్సీ జీతాల బకాయిల చెల్లింపులకు అవసరమైన ఎస్సార్ (సర్వీసు రిజిస్టర్)లో నమోదుకు ఇటు డీఈవో కార్యాలయ సిబ్బంది, అటు ఎల్ఎఫ్ ఆడిట్ సిబ్బంది చేతులు తడపనిదే పని జరగడం లేదని ఎయిడెడ్ టీచర్లు ఆరోపిస్తున్నారు. ఫలితంగా రెండు నెలలుగా కొత్త జీతాలకు నోచుకోలేదని వాపోతున్నారు. వాస్తవానికి రెండు నెలల క్రితం టీచర్లకు జీతాల పీఆర్సీ అమలయింది. వీటిని పొందాలంటే ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు సంబంధిత కరస్పాండెంట్ల నుంచి జిల్లాలో ఎంఈవోలు, అర్బన్ పరిధిలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ల (డీఐ)ల ద్వారా, హైస్కూళ్లయితే డిప్యూటీ డీఈవోల ద్వారా డీఈవో కార్యాలయానికి పీఆర్సీ ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. డీఈవో కార్యాలయంలో వీటిని పరిశీలించి ఎల్ఎఫ్ ఆడిట్‌కు పంపుతారు. అక్కడ అభ్యంతరాలుంటే రిమార్కులో ఉంచుతారు. లేదంటే ఎస్సార్‌లో నమోదు చేస్తారు. దీంతో అభ్యంతరాల్లేని ఉపాధ్యాయులు పీఆర్సీ జీతాలకు లైన్ క్లియర్ అవుతుంది. కానీ డీఈవో కార్యాలయంలో సంబంధిత సిబ్బంది ఒక్కో టీచరు నుంచి రూ.వెయ్యి, ఎల్ఎఫ్ ఆడిట్ ఆఫీసులో మరో రూ.వెయ్యి చొప్పున వసూలు చే స్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు ఉపాధ్యాయులు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని చెబుతున్నారు. అలా చెల్లించిన వారికి ఎస్సార్‌లో నమోదు చేయడంతో పీఆర్సీ జీతాలు పొందారని, లేనివారికి ఆగిపోయాయని పేర్కొంటున్నారు. జిల్లాలోని 26 ఎయిడెడ్ హైస్కూళ్లలో 16, రెండు ఓరియంటల్ స్కూళ్లు (సింహాచలం ఎస్వీఎల్ఎన్ సంస్కృతోన్నత పాఠశాల, చోడవరం హిందీ మహావిద్యాలయ)లతో పాటు పలు ప్రాథమిక పాఠశాలలు పీఆర్సీకి నోచుకోలేదని తెలుస్తోంది. ఇతర జిల్లాల్లో ఇప్పటికే పీఆర్సీ జీతాలు అందుకోగా రెండు నెలలవుతున్నా తమకు మాత్రం సిబ్బంది చేతివాటంతో జాప్యం జరుగుతోందని ఈ ఎయిడెడ్ టీచర్లు అంటున్నారు. లంచం అడిగితే చర్యలు.. పీఆర్సీ నమోదులో డీఈవో కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. లంచం ఇచ్చిన టీచర్లపైనా చర్యలుంటాయి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా నన్ను సంప్రదించవచ్చు. ఎయిడెడ్ ఎలిమెంటరీ, హైస్కూల్ టీచర్ల పీఆర్సీ ప్రతిపాదనలు వేగవంతం చేస్తాం. ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఈ విషయాన్ని స్పష్టం చేశాం. -ఎం.వి.కృష్ణారెడ్డి, డీఈవో