సంగెం: విద్యాలయాలు దేవాలయాలతో సమానం. దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. రేపటి పౌరులైన విద్యార్థుల జీవితం తరగతి గదితో ముడిపడి ఉంది. తరగతి గది వాతావారణం బాగుంటేనే విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ఒంటబడుతాయి అనేవి పెద్దల మాట. కాని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నిర్వహణకు నిధులు రాకపోవడంతో పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయి.
ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఆరు నెలలు గడిచినా పాఠశాల నిర్వహణకు నిధులు విడుదల కాలేదంటే ప్రభుత్వ విద్యావిధానంపై అధికారులకు ఎంతటి పట్టింపు ఉందో అర్థమవుతోంది. విద్యాబోధనకు అవసరమైన డస్టర్లు, చాక్‌పీస్‌లు, పేపర్లు వంటి సామగ్రి, తాగునీరు, విద్యుత్ బిల్లులు, ఇతర మరమ్మతులకు నిధులు లేక ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానోపాధ్యాయులు తమ జేబులోంచి ఖర్చు చేయాల్సిన దుస్థితి దాపురించింది. పెట్టిన నిధులు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 460 ఉన్నాయి. ఇందులో 15,972 మంది విద్యార్థులు, ప్రాథమికోన్నత పాఠశాలలు 83 ఇందులో 4,482 మంది విద్యార్థులు, ఉన్నత పాఠశాలలు 153 ఇందులో 22,028 మంది విద్యార్థులు మొత్తం 696 పాఠశాలల్లో 42,422 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా పాఠశాలల్లో మరమ్మతులు, ఇతర అవసరాలకు ప్రభుత్వం ప్రతిఏడాది గ్రాంట్స్ నిర్వహణ నిధులు విడుదల చేస్తుంది. విద్యార్థులు తరగతి గదుల సంఖ్య ఆధారంగా సర్వశిక్షాభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ద్వారా పాఠశాల యాజమాన్యాల ఖాతాల్లో జమచేస్తారు. గత ఏడాది సర్వశిక్షా అభియాన్‌ను విలీనం చేసి సమగ్ర శిక్ష అభియాన్‌గా మార్చారు. పాఠశాలలకు ఇచ్చే నిధులను కూడా కలిపి ఇస్తామని అధికారులు ప్రకటించారు. కానీ పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా నేటికి నిధుల జాడ లేదు.
వేడుకలకు నిధులు నిల్..
విద్యాసంవత్సరం క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా పాఠశాలల్లో వివిధ రకాల కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ, బాలల, జాతీయ నాయకుల దినోత్సవాలు, మండలస్థాయి క్రీడలు, పాఠశాలల స్థాయి క్రీడలు, సైన్స్‌ఫెయిర్ కోసం పరికరాల తయారీ, క్రీడా సామగ్రి, విద్యుత్ బిల్లులు, పేపర్ల కొనుగోలు వంటి వాటికి ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అందించే గ్రాంట్ ఎలా సరిపోతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాత పద్ధతిలో ఇచ్చే నిధులు సరిపోకపోవడంతో ఆయా పాఠశాలల్లో కార్యక్రమాలను నామమాత్రంగా నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యుత్ బిల్లులు..
పాఠశాలల్లో నిధుల కొరత వెంటాడుతుండగా విద్యుత్ బిల్లులు మరింత వేధిస్తున్నాయి. పాఠశాలల్లో వినియోగం ఉన్నా లేకున్నా విద్యుత్ బిల్లులు మాత్రం ప్రతి నెలా చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. పలు పాఠశాలల్లో కంప్యూటర్లను మూలన పడేశారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యుత్ వినియోగించడం లేదు. అయినా బిల్లులు చెల్లించక తప్పడం లేదని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యల్లో పాఠశాలలు..
పాఠశాలల నిర్వహణకు అవసరమైన నిధులు రాకపోవడంతో జిల్లాలో పాఠశాలల నిర్వహణ కష్టసాధ్యమవుతున్నదని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 40 లోపు విద్యార్థులు, 3 తరగతులు, అంతకంటే తక్కువ గదులు ఉంటే రూ.5 వేలు నిర్వహణ నిధులు, మరో రూ. 5 వేలు స్కూల్ గ్రాంట్ కింద విడుదల చేసేవారు. 5 గదులకంటే ఎక్కువగా ఉంటే రూ.5 వేల నిర్వహణ నిధులు, రూ 10వేలు స్కూల్ గ్రాంట్ కింద జమ చేసేవారు. ఉన్నత పాఠశాలల్లో ఆర్‌ఎంఎస్‌ఏ నుంచి ప్రత్యేక నిధులు రూ. 5 వేలు, స్కూల్ గ్రాంట్ కింద రూ 7 వేలు, నిర్వహణ నిధులు రూ 10 వేలు ఇచ్చేవారు. పెరిగిన జీవన ప్రమాణాలకనుగుణంగా పాఠశాలల నిర్వహణ ఖర్చులు, గ్రాంట్స్‌ను పెంచాల్సిన అవసరం ఉంటుందని నిపుణుల సూచన. ఎప్పుడో పాతికేళ్ల క్రితం నిర్ణయించిన పాఠశాల గ్రాంట్‌లే ఇప్పటికీ ఇస్తుండడంపై ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం సరిపోవడం లేదనే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాఠశాల ఖర్చులకనుగుణంగా నిధులు పెంచి అందించాలని పలువురు కోరుతున్నారు.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు..
సర్వశిక్షా అభియాన్, రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్‌ల వినియోగం తర్వాత సమగ్ర శిక్షా అభియాన్ తర్వాత ఎంత మొత్తంలో నిధులు ఇస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాలుగు విధాలుగా రూ.1000 నుంచి రూ 25 వేలు, రూ 40 వేలు, రూ 60 వేల చొప్పున ఇచ్చేందుకు విద్యాశాఖ యోచిస్తున్నట్లు సమాచారం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే గ్రాంట్స్ విడుదల చేయడానికి వీలుంటుందని తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదని ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి.
నిధులు విడుదల చేయాలి..
పాఠశాలలకు అవరమైన నిధులు ఈ విద్యా సంవత్సరం నుంచి నేటి వరకు విడుదల కాలేదు. విద్యాబోధన, ఇతర అవసరాల ఖర్చులకు నిధుల్లేక ప్రధానోపాధ్యాయులు అనేక అవస్థలు పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే గ్రాంట్స్ విడుదల చేస్తే విద్యాబోధనకు అవసరమైన సామగ్రిని తీసుకోవచ్చు. పాఠశాలలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్వహణ నిధులను పెంచి విడుదల చేయాలి. –ఎస్.రవీందర్, ప్రధానోపాధ్యాయుడు, సంగెం
Comments
Please login to add a commentAdd a comment