విద్యార్థుల హాజరు పెంచేదెలా?
- 70 శాతానికి మించని పరిస్థితి
- టీచర్ల హాజరూ 78 శాతమే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల రోజు వారీ హాజరు శాతాన్ని ఎలా పెంచాలనే అంశంపై విద్యా శాఖ దృష్టి సారించింది. విద్యా శాఖ నిర్వహించిన పలు సర్వేల్లో ఉపాధ్యాయుల హాజరే కాదు.. విద్యార్థుల హాజరు దారుణంగా పడిపోతోందన్న విషయాన్ని గుర్తించింది. ఉపాధ్యాయుల హాజరు 78 శాతం, విద్యార్థుల హాజరు 70 శాతం కన్నా మించడం లేదని సర్వేలు, అధికారుల బృందాల క్షేత్ర స్థాయి పరిశీలన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థుల చదువు కూడా అంతంత మాత్రమేనన్న విషయాన్ని గుర్తించింది. గత డిసెంబర్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం.. పాఠశాలల్లో 45 శాతం మంది విద్యార్థులకు చదువడం, రాయడం రావడం లేదు. స్కూళ్లను హెచ్‌ఎంలు పట్టించుకోవడం లేదు. ఇంచార్జి ఎంఈవోలు బాధ్యతలు నిర్వర్తించడం లేదు.
స్కూళ్లలో పరిస్థితులు, టీచర్ల హాజరును పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు చేపట్టడంతోపాటు హాజరును ఎలా పెంచాలనే దానిపై విద్యా శాఖ దృష్టి సారించింది. టీచర్ల హాజరు పెంపునకు బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. బడి మానే స్తున్న విద్యార్థులను పాఠశాలలకు తీసుకువచ్చే బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయంలో కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఓ సమగ్ర కార్యాచరణ నివేదిక రూపొందించి అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. క్షేత్ర స్థాయిలో టీచర్లకే విద్యార్థులను పాఠశాలలకు తీసుకువచ్చే బాధ్యతను అప్పగించాలా, లేక స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు అప్పగించాలా, మరేదైనా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా అనే కోణంలో ఆలోచనలు చేస్తోంది. దీనిపై ఓ స్పష్టత రాగానే తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.