గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కలేనా?
- ముందుకు కదలని విమానాశ్రయ విస్తరణ
- నిలిచిపోయిన భూసేకరణ
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : అంతర్జాతీయ హోదా పొందడానికి అన్ని హంగులూ ఉన్న గన్నవరం విమానాశ్రయ విస్తరణ మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కు అన్న చందాన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతున్న విజయవాడకు అతి దగ్గర్లో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ హోదా కల్పించడం కలగా మారింది. పాలకులు పట్టించుకోపోవడంతో భూసేకరణ కార్యక్రమం ఐదేళ్లుగా ముందుకు సాగడం లేదని విమర్శలొస్తున్నాయి. కనీసం 491.92 ఎకరాల భూమిని అప్పగించినా.. ఎయిర్‌పోర్టును అంతర్జాతీయస్థాయికి తీసుకువెళతామని ఐదేళ్లుగా ఎయిర్‌పోర్టు అథారిటీ మొత్తుకుంటున్నా ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయితే మొదట.. గన్నవరం విమానాశ్రయంపై దృష్టి సారించాల్సి ఉంది. విజయవాడ, గుంటూరు పట్టణాల్లో వేల సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపార రంగంలో ప్రముఖులున్నారు. ఇక్కడి విమానాశ్రయానికి భవిష్యత్తులో తాకిడి పెరగనుంది. విజయవాడ నుంచి ముఖ్యవైన ఇతర ఎయిర్‌పోర్టులన్నీ దాదాపు, 300 నుంచి 400 కిలోమీటర్ల మధ్య దూరంలో ఉన్నాయి. ఢిల్లీ, ముంబయి తదితర పట్టణాలకు ఇక్కడ నుంచి లింకు సర్వీసులు నడుస్తున్నాయి.
సర్వీసులు పెంచడంపై దృష్టి
గన్నవరం విమానాశ్రయం నుంచి సర్వీసులను పెంచడంపై ప్రైవేటు విమానసంస్థలు దృష్టి సారించాయి. అంతర్జాతీయ హోదా కల్పించి అభివృద్ధి చేస్తే దేశంలో అతి ముఖ్యమైన పట్టణాలకు నేరుగా సర్వీసులు నడపడానికి ప్రైవేటు విమాన సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఎయిర్ కోస్తా, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి సంస్థలు మరిన్ని సర్వీసులు నడపడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇక్కడి నుంచి ప్రస్తుతం ఆరు సర్వీసులు నడుస్తున్నాయి. రోజూ బెంగళూరుకు మూడు సర్వీసులు, హైదరాబాద్‌కు మూడు సర్వీసులు నడుపుతున్నారు. వీటిలో రెండు విమానాలు హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబయికి లింకు సర్వీసులుగా నడుస్తున్నాయి.
నిలిచిన భూసేకరణ
విమానాశ్రయం అభివృద్ధి కోసం జరుగుతున్న భూసేకరణ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ఐదేళ్ల నుంచి పోరాడగా, ఐదారు నెలల క్రితం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్ల బడ్జెట్ కేటాయించింది. అవి కాగితాలకే పరిమితమయ్యాయి. భూసేకరణ ప్రక్రియలో భాగంగా నెల పాటు ఎన్‌జాయ్‌మెంట్ సర్వే చేశారు. అంతటితో ఈ కార్యక్రమం మరుగున పడింది.
గన్నవరం విమానాశ్రయం 500 ఎకరాల విస్తార్ణంలో ఉంది. ఇక్కడి నుంచి నైట్ ల్యాండింగ్ సౌకర్యం, అఫ్రాన్ ఏర్పాటు చేశారు. కార్గో సర్వీసులను క్రమబద్ధం చేసి నడపడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఎప్పుడో ప్రణాళిక రూపొందించింది. అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి కార్గో బిల్డింగ్, ఫైర్‌స్టేషన్, టెక్నికల్ బ్లాక్, కార్‌పార్కింగ్, కస్టమ్స్ ఆఫీసు, అదనపు సెక్యురిటీ బ్లాకులు ఏర్పాటుకు ఎయిర్‌పోర్టు అథారిటీ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నా ప్రాంత నేతలు పట్టించుకోవడంలేదని ఆరోపణలున్నాయి.