తల్లడిల్లిన గర్భిణి | Pregnant suffered greatly due to doctor negligence | Sakshi
Sakshi News home page

తల్లడిల్లిన గర్భిణి

Published Sat, Nov 22 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

Pregnant suffered greatly due to doctor negligence

 ఒంగోలు సెంట్రల్ : రిమ్స్‌లో ఓ గర్భిణి పట్ల వైద్యులు అమానుషంగా ప్రవర్తించారు. గర్భంలో ఉన్న మృత శిశువును తీసి ఆమెకు ప్రాణాలు పోయాలని వేడుకున్నా బంధువులు చికిత్స అందించలేదు సరికదా.. కనీసం పడుకునేందుకు మంచం కూడా కేటాయించకుండా ఒక రోజంతా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. దళిత నాయకులు వచ్చి డెరైక్టర్, ఆర్‌ఎంఓతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. గర్భిణి బంధువులు ఆందోళనకు దిగడంతో రాత్రికి శస్త్ర చికిత్స చే శారు. దీంతో గర్భిణి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాలు..
ఉలవపాడుకు చెందిన కె.మహేశ్వరికి నెలలు నిండాయి. ఇంతలో ఆమె కడుపునొప్పితో కూడా బాధపడుతోంది. ఈ నెల 20వ తేదీన బంధువులు ఆమెను ఉలవపాడులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అప్పటికే ఆమె కడుపులో మృత శిశువు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా వైద్యులు గుర్తించి తక్షణమే ఒంగోలు తీసుకెళ్లాలని సూచించారు. భర్త సైమన్ మరో ఇద్దరు బంధువులు శుక్రవారం ఉదయం ఆమెను రిమ్స్‌కు తీసుకెళ్లారు. ఓపీలో ఉన్న వైద్యురాలికి పరిస్థితి వివరించారు. గర్భిణి మహేశ్వరికి తక్షణమే శస్త్ర చికిత్స చేయాలని, రక్తం తక్కువగా ఉందని, వెంటనే సమకూర్చితే శస్త్ర చికిత్స చేస్తామని సదరు డ్యూటీ డాక్టర్ చెప్పారు.

 అత్యవసర పేషంట్‌కూ మంచం కరువే
 సమస్యంతా ఇక్కడే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వైద్యురాలికి కనీసం మంచం కూడా కేటాయించలేకపోయారు.. రిమ్స్ సిబ్బంది. గైనకాలజీ ఎదుట ఉన్న అరుగుపై పడుకోబెట్టారు. తక్షణమే చికిత్స చేయాలని గర్భిణి బంధువులు ఎంత ప్రాధేయపడినా ఎవరూ స్పందించ లేదు. అదే సయమంలో ఆమె రక్తహీనతతో బాధపడుతోంది.

 సమయం గడిచేకొద్దీ పరిస్థితి విషమంగా మారింది. ఉన్నట్లుండి ఫిట్స్ రావడంతో బంధువులు మరింత ఆందోళనకు గురయ్యారు. అందిన సమాచారం మేరకు మాలమహానాడు నేత దాసరి శివాజీ ఆస్పత్రికి వచ్చారు. రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్య, ఆర్‌ఎంఓ డాక్టర్ బాలాజీనాయక్‌తో విషయం చెప్పారు. వారిద్దరూ స్పందించకపోవడంతో అదనపు జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. చివరకు కాన్పుల విభాగంలోనే నిరశనకు దిగారు. గర్భిణికి తక్షణమే శస్త్ర చికిత్స చేసి మృత శిశువును బయటకు తీయాలని ఆందోళన చేశారు. విషయం గాలివానలా మారడంతో వన్‌టౌన్ సీఐ రవిచంద్ర తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరారు. ఆందోళనకారులకు సర్దిచెప్పి వారిని బయటకు తీసుకొచ్చారు.

రాత్రి సమయంలో శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు చేశారు. వివిధ పరీక్షలు నిర్వహించారు. ఇంతలో రక్తం కూడా సమకూరడంతో ఆపరేషన్ చేసి ఆమె గర్భంలోని మృతశిశువును బయటకు తీశారు. ఈ విషయమై డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.చంద్రయ్యను వివరణ కోరగా రిమ్స్‌లో జరిగిన సంఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు. పరిశీలించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. రాత్రికి ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు వెళ్లి గర్భిణి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. ఆయనతో పాటు ఒంగోలు ఎమ్మార్వో మాడమంచు వెంకటేశ్వర్లు ఉన్నారు. రాత్రి పొద్దుపోయే వరకూ బాధితురాలు మహేశ్వరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement