ప్రసవ వేదన
♦ పెద్దాస్పత్రికి కాన్పు కష్టాలు
♦ చాలీచాలని పడకలు, సరిపోని వైద్యులు
♦ సీఎం చూసి వెళ్లినా ఫలితం శూన్యం
♦ సర్కారు వైఫల్యంపై జనం మండిపాటు
లబ్బీపేట : రెండు దశాబ్దాల కిందట నగర పరిసర ప్రాంతాల జనాభా సుమారు ఆరున్నర లక్షలుంటే.. ప్రస్తుతం 12 లక్షలకు చేరింది. అంటే నగరీకరణ నేపథ్యంలో దాదాపు రెట్టింపయింది. అదే ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో రెండు దశాబ్దాల కిందట 60 పడకలు, పది మంది వైద్యులు ఉంటే.. నేటికీ అదే పరిస్థితి నెల కొంది. జనాభా పెరిగినప్పుడు ఆస్పత్రిలో సౌకర్యాలు పెంచాల్సి ఉండగా, ప్రభుత్వాలు ఆ దిశగా కృషిచేయడం లేదు. ఫలితంగా నిండు గర్భిణులకు ప్రసూతి కష్టాలు తప్పడం లేదు.
నగరం, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, భీమవరం నుంచి కూడా నిత్యం గర్భిణులు ప్రసూతి కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తుం టారు. ఒక్కో సమయంలో సాధారణ కేసులను కూడా ఇక్కడికి రిఫర్ చేస్తుండడంతో ఈ విభాగంలో ఉన్న పడకలు చాలక కారిడార్, వరండాల్లో వేసిన పడకలపై ఉంచాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించినా, వైద్య శాఖ మంత్రి దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేదు.
చాలని పడకలు..
పాత ప్రభుత్వాస్పత్రిలోని ప్రసూతి విభాగానికి నిత్యం 150 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. 110 నుంచి 115 మంది వరకు గర్భిణులు, గర్భకోశ వ్యాధులతో బాధపడే వారు చికిత్స పొందుతుంటారు. ఈ విభాగంలో అధికారికంగా రెండు యూనిట్లు ఉండగా 60 పడకలు ఉన్నాయి. అనధికారికంగా నిర్వహిస్తున్న మరో యూనిట్‌తో (30 పడకలతో) కలిపితే 90 పడకలున్నాయి. మరి 115 మంది ఇన్ పేషెంట్స్ ఉంటే మిగిలిన 25 మందిని ఎక్కడ ఉంచాలనే విషయమై వైద్యులు, వైద్య నిఫుణులు తలలు పట్టుకుంటున్నారు.
ఈ విషయం తెలియని మంత్రులు ఒకే బెడ్‌పై ఇద్దరిని ఎందుకుంచుతున్నారంటూ హడావుడి చేస్తున్నారు. ప్రస్తుత జనాభా ప్రకారం చూసినా ఆరు యూనిట్లు ఉంటే కాని సరైన వైద్యం అందించలేమని గతంలోనే వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుత్వానికి రాసిన లేఖను బుట్టదాఖలు చేశారు. ప్రిన్సిపాల్ సూచన మేరకు యూనిట్లు పెంచి ఉంటే 180 పడకలు, 30 మంది వైద్యులు అందుబాటులోకి వచ్చే అవకాశముండేది.
వచ్చారు.. చూశారు.. వెళ్లారు..
గత ఏడాది నవంబరులో ముఖ్యమంత్రి నగర పర్యటనలో భాగంగా పాత ఆస్పత్రి ప్రసూతి విభాగాన్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న గర్భిణుల కష్టాల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో చికిత్స పొందుతున్న వారికి ప్రోత్సాహక నగదు అందించి చేతులు దులుపుకొన్నారు తప్ప శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. దీంతో సమస్యలు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ అన్న చందంగా మారాయి.
లక్ష్యం ఘనం..సౌకర్యాలు శూన్యం..
ఒకవైపు మాతాశిశు మరణాల రేటును వంద శాతం నివారించాలంటూ వాడవాడలా సమావేశాలు పెడుతూ ఊదరగొడుతున్న ప్రభుత్వం ప్రసూతి ఆస్పత్రుల్లో కనీస వసతులు కల్పించడంలో మాత్రం విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి రక్తపరీక్షలు సైతం అందుబాటులో ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితిలో సకాలంలో వైద్యం ఎలా అందించగలుగుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రసూతి ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వైద్యుల నియామకాలు చేపట్టాలని, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని నిపుణులు అంటున్నారు.